ఆ అప్పులు.. అంటగట్టినవే..  | Sakshi
Sakshi News home page

ఆ అప్పులు.. అంటగట్టినవే.. 

Published Fri, Feb 9 2024 5:10 AM

Submission of CAG Report to Legislature on Accounts 2022 to 23 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై దుష్ట చతుష్టయం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా ‘కాగ్‌’ నివేదిక కుండబద్ధలు కొట్టింది. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లకు చేరాయంటూ ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నివేదిక స్పష్టం చేసింది. 2022–23 అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభకు సమర్పించింది.

కార్పొరేషన్ల అప్పులను దాచేస్తున్నారని, కాగ్‌కు కూడా చెప్పడం లేదంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని కాగ్‌ అకౌంట్స్‌ నివేదిక వెల్లడించింది. 2022–23 నాటికి బడ్జెట్‌లో చేసిన అప్పులు, బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు, మార్కెట్‌ రుణాలు, వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్థిక సంస్ధల నుంచి గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పుల పూర్తి వివరాలను కాగ్‌ స్పష్టంగా వెల్లడించింది.

ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ) నిబంధనలు, లక్ష్యాలను ప్రభుత్వం పక్కాగా పాటిస్తోందని స్పష్టం చేసింది. 2022–23లో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు, ద్రవ్య, రెవెన్యూ లోటు ఉన్నాయని కాగ్‌ నివేదిక పేర్కొంది. 

బడ్జెట్‌ బయట అప్పులను సైతం ఎటువంటి దాపరికం లేకుండా కాగ్‌ అకౌంట్స్‌లో స్పష్టం చేసింది. 2018–19 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.2,57,612 కోట్లుగా ఉన్నాయని కాగ్‌ పేర్కొంది (2019 మే నాటికి టీడీపీ సర్కారు సొంత ప్రచారం కోసం మరో రూ.14 వేల కోట్లు అప్పు చేసింది).

ఆ రూ.14 వేల అప్పులను మినహాయించి చూసినా సరే 2022–23 నాటికి బడ్జెట్‌లో చేసిన అప్పులు రూ.4,23,942 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,66,330 కోట్లు మాత్రమేనని, టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టిందని కాగ్‌ అకౌంట్స్‌ నివేదిక స్పష్టం చేస్తోంది.

2022–23 నాటికి బడ్జెట్‌లో అప్పులతో పాటు బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలు, కంపెనీల ద్వారా గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు మొత్తం కలిపి రూ.5,62,817 కోట్లు మాత్రమేనని కాగ్‌ అకౌంట్స్‌ స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వెల్లడించినా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అనధికార అప్పులంటూ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.

Advertisement
 
Advertisement