పాదయాత్ర స్ఫూర్తితో పాలన | Sakshi
Sakshi News home page

పాదయాత్ర స్ఫూర్తితో పాలన

Published Sun, Apr 28 2024 5:52 AM

YS Jagan Mohan Reddy about 58 months ruling

ఒక హీరోలా ప్రజల వద్దకు వెళుతున్నా: సీఎం వైఎస్‌ జగన్‌

​​​​​​​మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా అమలు చేయడం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది

సాక్షి, అమరావతి: ‘‘నా 3,648 కి.మీ. ప్రజాసంకల్ప పాదయాత్రలో కళ్లారా చూసిన సమస్యలకు పరి­ష్కారం వెతుకుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చా. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకూ ప్రతి అడుగులో కూడా నేను చూసిన ఆ సమస్యలను పరిష్కరిస్తూ 58 నెలల పాలన సాగింది’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథమో, దానికి ప్రాధాన్యత ఎప్పుడు వచ్చిందంటే ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా.

గతంలో మేని­ఫెస్టో అని అందరూ చెప్పేవాళ్లు.  ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్‌ చూపించేవాళ్లు. ఎన్నికలు ముగిశాక ఆ డాక్యుమెంట్‌ ఎక్కడుందో గాలిస్తే ఎవరికీ కానరాని పరిస్థితి. ఎన్నికల తర్వాత మేని­ఫెస్టో డాక్యుమెంట్‌ చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వాన్నమైన పరిస్థితిని మనమంతా చూశాం’ అని గుర్తు చేశారు. మేనిఫెస్టో 2024ను విడుదల చేస్తూ ఇంకా ఏమన్నారంటే..

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మేనిఫెస్టో..
మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోను బైబిల్‌గా, ఖురా­న్, భగవద్గీతలా భావిస్తూ హామీలను 58 నెలలుగా అమలు చేసిన విధానం దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది 2019 నాటి మన మేనిఫెస్టో (అప్పటి మేనిఫెస్టోను చూపిస్తూ). అప్పు­డు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎంతో నిష్టగా అమలు చేశాం.
 

వాటిని ఏ స్థాయిలో అమలు చేశామంటే మేనిఫెస్టో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ముఖ్యమైన అధికారి దగ్గర ఉంది. మన మేనిఫెస్టో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉంది. అక్క చెల్లెమ్మలూ ఇదిగో మా మేనిఫెస్టో. చెప్పినవన్నీ నెరవేర్చామో లేదో మీరే టిక్‌ చేయాలని కోరాం. మొట్టమొదటి సంవత్సరంలో 85 – 88 శాతం టిక్‌ చేస్తే చివరి ఏడాది నాటికల్లా 99 శాతం పైచిలుకు మేనిఫెస్టో హామీలను అమలు చేసి ప్రజల వద్దకు వెళ్లాం. 



నవరత్నాల పాలన...
నవరత్నాల పాలనకు అర్థం చెబుతూ 58 నెలల కాలంలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో నా అక్క­చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్లాయి. ఇదిఒక చరిత్ర. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగినవాడిగా వారి ఇంటికే పథకాలన్నీ డోర్‌ డెలివరీ చేసిన పరిస్థితి కూడా 58 నెలల కాలంలోనే చూశారు. 

2019లో మేనిఫెస్టో విడుదల చేసేట­ప్పుడు మనవాళ్లే చాలామంది సాధ్యమేనా? అని నా­తో అన్నారు. ఈ మాదిరిగా స్కీమ్‌లు, బటన్‌ నొక్క­డం, ముందుగానే క్యాలెండర్‌లో ఈ నెలలో ఏ పథ­కం అందుతుందో ప్రకటించి సరిగ్గా అదే సమ­యా­నికి అందించడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 

2014లో బాబు మోసపూరిత హామీలు..
2014లో చంద్రబాబు ఎన్నో మోసపూరిత హామీలిస్తున్నారు. మరి మనం కూడా ఇవ్వకపోతే ఎలా? తరువాత సంగతి తరువాత చూసుకుందాం.. ముందైతే హామీలు ఇచ్చేద్దామని నా శ్రేయోభిలాషులే సలహాలు ఇచ్చారు. కానీ ఆ రోజు నేను అలా చేయలేదు. ఆరోజు కూడా చేయగ­లిగేవి మాత్రమే చెప్పా. అబద్ధాల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా.

 కానీ ఈరోజు గర్వపడు­తున్నా. నాకు 2014లో అధికారం రాలేకపోయిన­ప్పటికీ చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగేవి మాత్రమే చెప్పి, చేసి చూపించి, మళ్లీ ప్రజల దగ్గరికి ఈరోజు ఒక హీరోలా వెళుతున్నా. ఆ ప్రభుత్వానికి – ఈ ప్రభుత్వానికి తేడా గమ­నించండి.  

సాకులు చూపకుండా.. ప్రజలకు అండగా
ఈరోజు పేదవాళ్ల పరిస్థితి ఏమిటి? ఎలా ఉన్నారు? ఎలా బతుకుతున్నారంటే అద్భుతంగా ఉన్నారు. పాదయాత్ర సమయంలో పేదవాళ్ల పరిస్థితి ఏమిటని గమనిస్తే ... చదివించాలని ఆరాటం ఉన్నా పిల్లలను చదివించలేని పరిస్థితి. తల్లితండ్రులు ఫీజులు కట్టలేక పోవడంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులను కళ్లారా చూశా. అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్నా నాడు పెన్షన్‌ రాని పరిస్థితి. ఇళ్లు ఇవ్వని పరిస్థితి. 

రేషన్‌ కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా, సబ్సిడీ మీద లోన్లు రావాలన్నా, ఇచ్చే అరకొర వాటికి కూడా లంచాలు, వివక్ష. రాజకీయ నాయకులు, పార్టీలు సృష్టించిన సమస్యలు, వ్యవస్థల వల్ల పేదవాడి బతుకు ఎలా అతలాకుతలం అయిందో నా కళ్లారా చూశా. 2019లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఈరోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్‌ వెతుకుతూ, మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరించేలా 58 నెలల పాలన సాగింది. 

కోవిడ్‌ వల్ల రెండేళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయినా, ఆదాయాలు రాకపో­యినా, ఖర్చులు పెరిగినా మేం సాకులు చూప­లేదు. మేనిఫెస్టో అమలు చేయకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కోలేదు. ఎన్ని సమస్యలున్నా, ఎక్కడా సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా, అండగా ఉన్నాం. 

దేశ చరిత్రలో తొలిసారిగా..
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేగంగా అడుగులు వేస్తూ ఆగస్టులో వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబర్‌ రెండో తారీఖు కల్లా సచివాలయ వ్యవస్థను తెచ్చాం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ లంచాలు,  వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని అమలు చేశాం.

 ఎవరైనా పొరపాటున మిస్‌ అయితే వారిని జల్లెడ పట్టి వెతికి మరీ మరో అవకాశం కల్పించాం. మొట్టమొదటి సారిగా ఏటా ప్రజల వద్దకు మేనిఫెస్టోను పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలు గడప గడపకూ వచ్చి నేరుగా ప్రజలను కలుసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకోవడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.   

Advertisement
Advertisement