6.3 శాతం నుంచి 6.7 శాతానికి అప్‌ | Sakshi
Sakshi News home page

6.3 శాతం నుంచి 6.7 శాతానికి అప్‌

Published Fri, Dec 15 2023 5:15 AM

ADB raises India GDP growth forecast to 6. 7percent - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది. ఈ మేరకు సెపె్టంబర్‌ నాటి అవుట్‌లుక్‌ 6.3 శాతం వృద్ధి అంచనాలను 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. రెండవ త్రైమాసికం (జూలై–సెపె్టంబర్‌) త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి ఫలితాలు అంచనాలకు మించి 7.6 శాతంగా వెలువడ్డం తమ తాజా నిర్ణయానికి కారణమని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌– డిసెంబర్‌ 2023లో వివరించింది.  2022–23లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 

2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది.  క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది.  క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్‌బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది.   క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది.  ఏప్రిల్‌ నుంచి సెపె్టంబర్‌ వరకూ చూస్తే... రియల్‌ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్‌ ఇయర్‌ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది.  

ఈ నేపథ్యంలో ఏడీబీ తాజా అవుట్‌లుక్‌ అంశాలను పరిశీలిస్తే..
► 2024–25లో ఎకానమీ 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం.  
► తయారీ, మైనింగ్, నిర్మాణంసహా కీలక పారిశ్రామిక రంగం కూడా రెండంకెల వృద్ధిని సాధిస్తున్నట్లు ఆర్థిక గణాంకాలు
సూచిస్తున్నాయి.
► వ్యవసాయ రంగం కొంత నెమ్మదించినా.. దీనిని పారిశ్రామిక రంగం భర్తీ చేసే అవకాశం ఉంది.  
► ప్రైవేటు వినియోగ వ్యయాలు, ఎగుమతుల్లో కొంత బలహీనతలు ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలు వ్యవస్థలో డిమాండ్‌ పెరుగుదలకు దోహదపడే అంశం.  
► వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో
సగటును 5.5 శాతంగా కొనసాగవచ్చు. ఇది ఆర్‌బీఐ అంచనా 5.4 శాతం కంటే అధికం కావడం గమనార్హం.  2023, 2024 భారత్‌ ద్రవ్యోల్బణం లెక్కలు అంచనాల పరిధిలోనే ఉంటాయి. రెపో రేటు యథాతథ పరిస్థితి 2024 లో కూడా కొనసాగవచ్చు.
► పలు ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలలో మహమ్మారి అనంతరం పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, తిరిగి నిరాశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. అధిక–ఆదాయ సాంకేతిక ఎగుమతిదారుల నుండి  వస్తువుల ఎగుమతుల్లో స్థిరత్వమే తప్ప ప్రోత్సాహకరంగా లేవు.

Advertisement
 
Advertisement
 
Advertisement