
విశాఖపట్నం, సాక్షి: ఏపీలో జరుగుతున్న ప్రతీకార రాజకీయ దాడుల పర్వంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. రాజకీయంగా కక్షలు తీర్చుకోనని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దాడులకు దిగిన తన కార్యకర్తలను కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడ్డారాయన. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు.
‘‘చంద్రబాబు గారూ.. మన రాష్ట్రం ఏమైపోతోంది. ఈ వయసులో మీ పార్టీ కార్యకర్తలను మీరు అదుపు చేయలేరా?. ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎలా గెలిచారో అందరికీ తెలుసు. బుద్ధి లేని మీ పార్టీ గాడిదలకు చెప్పండి. ఇంత నీచమైన స్థితికి మీ పార్టీ కార్యకర్తలు దిగజారిపోయారు. ప్రజల చేత ఛీ అనిపించుకోకండి. చరిత్ర హీనులు కాకండి’’ అని పాల్ హితవు పలికారు.

‘‘గతంలో ఇలాంటి దాడుల్ని జగన్ పార్టీ ఏనాడూ ప్రొత్సహించలేదు. కానీ, కక్ష తీర్చుకోను అని చెప్పి.. ఇప్పుడు మీ కార్యకర్తలు చేస్తోంది ఏంటి?. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయలేని మీరూ.. ఆరునెలలకు మించి ముఖ్యమంత్రిగా ఉండలేరు. రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్లాలంటే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలను వదిలేయాలి. కక్ష పూరిత రాజకీయాలు మానేసి రాష్ట్రం బాగు చేయడం కోసం పాటు పడాలి. ఇంకో 48 గంటల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. లేకుంటే మీరు రాష్ట్రాన్ని పాలించేందుకు పనికి రారని కోర్టుకు వెళ్లా. అక్కడా న్యాయం జరగకపోతే దేవుడి కోర్టుకు వెళ్తా’’ అని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment