దర్శి మండలం రాజంపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి నిప్పు
ట్రాక్టర్‌కు తాడు కట్టి లాగేందుకు విఫలయత్నం
సీఎస్ పురం మండలంలో ఆర్వో ప్లాంటు, బోర్డు ధ్వంసం
విజయవాడలో వైఎస్సార్ విగ్రహం మెడలో టీడీపీ కండువా
రామచంద్రాపురంలో వైఎస్సార్ విగ్రహం మాయం
నందిగామలో పలు బోర్డుల తొలగింపు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో పాటు పనిగట్టుకుని వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ట్రాక్టర్లతో కూల్చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడాన్ని గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలార్పారు.
అంతకు ముందు విగ్రహానికి తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి కూల్చేయడానికి విఫలయత్నం చేశారు. విగ్రహం ముందు వైపు ట్రాక్టర్ స్లిప్ అయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అనంతరం మడ్డి ఇంజన్ ఆయిల్ తీసుకొచ్చి విగ్రహం మీద పోసి నిప్పు పెట్టారు. ఆ మేరకు విగ్రహం పక్కనే మడ్డి ఆయిల్ డబ్బాలు కూడా ఉన్నాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుమన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం పెదగోగులపల్లెలో శుక్రవారం సాయంత్రం టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సమీపంలో ఉన్న బోర్డును నేలమట్టం చేశారు. సమీపంలోని ఆర్వో ప్లాంటులోకి చొరబడి పైపులను విరిచేశారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం చీకటీగలపాలెం అడ్డరోడ్డులో కూడా ఇదే రీతిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు.
⇒ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట, పుత్తూరు–చిత్తూరు జాతీయ రహదారిలోని దీపిక కల్యాణ మండపం వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎన్నికల్లో ఈ వాహనాన్ని ఉపయోగించారు. పోలింగ్ అనంతరం ఆ వాహనాన్ని దీపిక కల్యాణ మండపం వద్ద పార్కింగ్ చేశారు. దుండగులు వాహనానికి నిప్పంటించిన తర్వాత కల్యాణ మండపంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీవీ.పురం, కొత్తపల్లి మహభారతం, వినాయకస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసి శిలాఫలకాల్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షడు మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
⇒ కూటమి శ్రేణులు విజయవాడలో వైఎస్సార్ విగ్రహం మెడలో టీడీపీ కండువా, చేతిలో ఆ పార్టీ జెండా పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డులో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బీజేపీ కార్యాలయం దాటి శివాలయం సెంటర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఓ యువకుడు పొక్లెయిన్‌పైకి ఎక్కి మహానేత వైఎస్సార్ విగ్రహం మెడలో పచ్చ కండువా వేశాడు. చేతిలో టీడీపీ జెండా పెట్టాడు. భవానీపురం పోలీసులు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. ర్యాలీ ముందుకు కదిలిన తర్వాత పోలీసులు టీడీపీ కండువా, జెండాను తొలగించారు.
⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పంబాదూరు గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని ప్రధాన రహదారి సమీపంలో ఎన్నో ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల వరకు విగ్రహం అక్కడే ఉందని, ఉదయం లేచి చూసేసరికి విగ్రహం లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
⇒ టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో హల్ చల్ చేశారు. పట్టణంలోని పలుచోట్ల శిలాఫలకాలు ధ్వంసం చేయడంతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు, మొండితోక అరుణ్ కుమార్‌ల బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment