అద్దేపల్లిలో తగులపెట్టిన వైఎస్సార్ విగ్రహం స్థానంలో ఏర్పాటు చేసిన కొత్త విగ్రహానికి పూలమాలలు వేస్తున్న స్థానిక దళితవాడ వాసులు
అశోక్‌బాబుతో దీక్ష విరమింపజేసిన మాజీ ఎంపీ సురేష్
భట్టిప్రోలు: బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పునఃప్రతిష్టించారు. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు పెట్రోలు పోసి దహనం చేసిన విషయం విదితమే. ఈ చర్యను నిరసిస్తూ, ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్‌బాబును రేపల్లె తరలించారు.
ఆయన రాత్రి 12 గంటల వరకు రేపల్లె పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించేది లేదని చెప్పడంతో బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు అశోక్‌బాబును పోలీసులు బలవంతంగా చెరుకుపల్లిలోని ఆదిశంకర వ్యాలీలోగల ఆయన నివాసానికి రాత్రి ఒంటిగంట సమయంలో తరలించారు. అశోక్‌బాబు ఆదివారం కూడా తన నివాసంలో దీక్షను కొనసాగించారు. ఆదివారం ఉదయం ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం మూడుగంటలకు దళితవాడ వాసులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
దళిత హోంమంత్రి, దళిత డీజీపీని పెట్టి పోలీసులతో దళితులపై లాఠీఛార్జి చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని దహనం చేసిన నిందితులను, వారిని నడిపించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాను అరెస్టు చేయాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన వీడియో, ఫొటోలు చూసిన అనంతరమే దీక్షను విరమిస్తామని అశోక్‌బాబు చెప్పడంతో వాటిని చూపించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి అశోక్‌బాబుతో దీక్ష విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment