restored
-
ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు పునరుద్ధరణ, దారి మళ్లింపు
సాక్షి, విజయవాడ: వరదలతో విజయవాడ డివిజన్లో రద్దు అయిన పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. మచిలీపట్నం–బెంగళూరు (07650) మధ్య ప్రత్యేక రైలును నడిపారు. అహ్మదాబాద్–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12655), చెన్నై సెంట్రల్–కాట్రా (16031), త్రివేండ్రం–హజరత్ నిజాముదీ్ధన్ (12643) యథావిధిగా పునరుద్ధరించారు.అలాగే సికింద్రాబాద్–గుంటూరు (17202) రైలును రెండు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి నడిపారు. గూడూరు–సికింద్రాబాద్ (12709) రైలును వయా తెనాలి, గుంటూరు, రేణిగుంట మీదుగా, న్యూఢిల్లీ–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12622) వయా రేణిగుంట, గుంతకల్లు, సికింద్రాబాద్, ఖాజీపేట మీదుగా, సికింద్రాబాద్–గుంటూరు (17202) వయా పగిడిపల్లి, నడికుడి మీదుగా దారి మళ్లించారు. -
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
-
Bangladesh: ఎట్టకేలకు ఇంటర్నెట్ సేవలు.. మూడు రోజులు 5జీబీ డేటా ఫ్రీ
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్‌లో చెలరేగిన అందోళనలు సద్దుమణిగాయి. ఈ నేపధ్యంలో దేశంలో 10 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. రిజర్వేషన్ల అంశంపై సోషల్ మీడియాలో అసంబద్ధ వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకే దేశంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.దేశంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించినట్లు ప్రకటించిన ప్రభుత్వం మూడు రోజుల పాటు వినియోగదారులందరికీ 5 జీబీ డేటా ఇంటర్నెట్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ విషయమై సమాచార, కమ్యూనికేషన్ల సాంకేతిక శాఖ సహాయ మంత్రి (ఐసీటీ) జునైద్ అహ్మద్ పాలక్ అధికారిక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం జూలై 18 నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రిజర్వేషన్ల అంశంపై దేశంలో జరిగిన హింసాయుత ఘటనల్లో సుమారు వందమంది మృతి చెందారు.యుద్ధ వీరుల బంధువులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రిజర్వ్ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలోని ఢాకాతో పాటు ఇతర నగరాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అది హింసాత్మకంగా మారింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ హింసాకాండలో 100 మంది మరణించారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడికాలేదు. మరోవైపు హింసాకాండ నేపథ్యంలో కర్ఫ్యూ విధించాలన్న తన నిర్ణయాన్ని ప్రధాని షేక్ హసీనా సమర్థించుకున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యథావిధిగా విమాన సర్వీసులు
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జులై 19) తలెత్తిన సాంకేతిక సమస్య ముగిసిపోయింది. విమానాలు యథావిధిగా వెళుతున్నాయి. అన్నివిమాన సర్వీసులను విమానయాన సంస్థలు పునరుద్ధరించాయి. ప్రయాణికుల ఆన్లైన్ చెక్ఇన్ సాఫీగా సాగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ విండోస్, క్లౌడ్‌లో సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో ఆన్లైన్ చెక్ఇన్ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అద్దేపల్లిలో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ట
భట్టిప్రోలు: బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పునఃప్రతిష్టించారు. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు పెట్రోలు పోసి దహనం చేసిన విషయం విదితమే. ఈ చర్యను నిరసిస్తూ, ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్‌బాబును రేపల్లె తరలించారు.ఆయన రాత్రి 12 గంటల వరకు రేపల్లె పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించేది లేదని చెప్పడంతో బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు అశోక్‌బాబును పోలీసులు బలవంతంగా చెరుకుపల్లిలోని ఆదిశంకర వ్యాలీలోగల ఆయన నివాసానికి రాత్రి ఒంటిగంట సమయంలో తరలించారు. అశోక్‌బాబు ఆదివారం కూడా తన నివాసంలో దీక్షను కొనసాగించారు. ఆదివారం ఉదయం ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం మూడుగంటలకు దళితవాడ వాసులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.దళిత హోంమంత్రి, దళిత డీజీపీని పెట్టి పోలీసులతో దళితులపై లాఠీఛార్జి చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని దహనం చేసిన నిందితులను, వారిని నడిపించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాను అరెస్టు చేయాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన వీడియో, ఫొటోలు చూసిన అనంతరమే దీక్షను విరమిస్తామని అశోక్‌బాబు చెప్పడంతో వాటిని చూపించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి అశోక్‌బాబుతో దీక్ష విరమింపజేశారు. -
‘సెలబ్రిటీ’ ఖాతాలకు మళ్లీ బ్లూ టిక్
న్యూఢిల్లీ: చందా మొత్తాన్ని చెల్లించలేదంటూ చాలా మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లో బ్లూ టిక్‌ను తొలగించిన ట్విట్టర్ యాజమాన్యం ఆదివారం కొందరికి బ్లూ టిక్‌ను పునరుద్ధరించింది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్ ఖాతాలకే ఈ మినహాయింపు ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీసహా ప్రముఖ భారతీయ నటులు, రాజకీయనేతలు, క్రీడాకారుల బ్లూ టిక్‌ను ఇటీవల తొలగించగా ఆదివారం ఆ టిక్ మళ్లీ ప్రత్యక్షమైంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉండటం వల్లే వీరందరికి బ్లూ టిక్ ఇచ్చారా ? లేక సబ్‌స్క్రైబ్ చేసుకున్నారా అనేది తెలియరాలేదు. ‘చందా కట్టకున్నా ఆదివారం బ్లూ టిక్ మళ్లీ వచ్చేసింది. మిస్టర్ మస్క్ మీరే నా తరఫున చందా రుసుం కట్టేశారా? ’ అంటూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆదివారం ట్వీట్‌చేశారు. అయితే లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు మాత్రమే వెరిఫైడ్ స్టేటస్(బ్లూ టిక్) హోదా కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే, దివంగతుల ఖాతాలకు టిక్ ప్రత్యక్షమవడం గమనార్హం. మైఖేల్ జాక్సన్, చాడ్విక్ బోస్‌మ్యాన్, కోబె బ్రయాంట్ తదితర సెలబ్రిటీల ఖాతాలు ఇందులో ఉన్నాయి. కాగా బ్లూ టిక్ కోసం చందా కట్టే ప్రసక్తే లేదని ప్రకటించిన కొందరు ప్రముఖుల తరఫున తానే నగదు చెల్లించి టిక్ పునరుద్ధరించినట్లు ట్విట్టర్ యజమాని, కుబేరుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. దిగ్గజ నటుడు విలియం శాట్నర్ తదితరుల తరఫున మస్క్ రుసుం చెల్లించారు. -
Mali mountain forest: వాళ్లు అడవిని సృష్టించారు
కోరాపుట్ (ఒడిశా): అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది. దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది. ఒక్కతాటిపై నిలిచి... అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది. కొసమెరుపు 30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది! (క్లిక్: లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!) -
యూపీ CMO ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు
-
యూపీ సీఎంవో ట్విటర్ అకౌంట్ హ్యాక్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. హ్యాకింగ్‌కు పాల్పడ్డ దుండగలు.. అకౌంట్ టైం లైన్‌పై కోతి చేష్టలకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఇది జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది ట్విటర్ యూజర్లను ట్యాగ్ చేస్తూ సీఎంవో ట్విటర్ టైం లైన్‌పై పోస్టులు చేశారు హ్యాకర్లు. అటుపై ఆకతాయిలు కోతి బొమ్మను అకౌంట్ ప్రొఫైల్ ఫొటోగా మార్చేసి.. మరీ ఈ పనికి పాల్పడ్డారు. వెంటనే దీంతో అందుకు సంబంధించిన పోస్టుల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. అయితే విషయం గమనించిన ప్రభుత్వ సాంకేతిక సిబ్బంది.. వెంటనే అకౌంట్‌ను పునరుద్ధరించారు. హ్యాకర్లు పోస్ట్ చేసిన ట్వీట్లను డిలీట్ చేసి.. ఘటనపై విచారణకు ఆదేశించారు. -
మొబైల్, ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభం
శ్రీనగర్: భద్రతా కారణాలతో కశ్మీర్లో నిలిపివేసిన మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను తిరిగి సోమవారం పునరుద్దరించారు. హంద్వారా ఘటనతో అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో కశ్మీర్‌లోని కుపార్వా, బారాముల్లా, బందీపూర, గండేర్ బల్ జిల్లాల్లో గత బుధవారం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఆర్మీ జవాన్ల కాల్పుల్లో నలుగురు మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నేటి నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
విజయవాడ (రైల్వేస్టేషన్): విజయవాడ - విశాఖపట్నం మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జి రైల్వే పీఆర్వో జె.వి.ఆర్కే రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుని రైల్వేస్టేషన్లో కాపు గర్జన సందర్భంగా చేపట్టిన ఆందోళనలో రత్నాచల్ దగ్ధమైన విషయం తెలిసిందే. గతంలో 24 బోగీలతో నడిచిన రత్నాచల్‌ను ప్రస్తుతం బోగీల కొరత కారణంగా 17 బోగీలతో నడపనున్నట్లు పీఆర్వో పేర్కొన్నారు. ఏసీ చైర్ కార్, రిజర్వుడ్ చైర్‌కార్, నాన్ రిజర్వుడ్, ప్యాంట్రీకార్ సహా మొత్తం 17 బోగీలతో నడుపుతున్నామని తెలిపారు. వాటిలో రిజర్వ్డ్ సిట్టింగ్ 8 బోగీలు, నాన్ రిజర్వ్డ్ సిట్టింగ్ 4, ఏసీ చైర్ కార్ 2, ఎస్ఎల్ఆర్ 2, ప్యాంట్రీ కారుతో కలిపి మొత్తం 17 బోగీలతో దీనిని నడపనున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తాకిడి ఉండే ఈ సర్వీసుకు బోగీలు కుదించటంపై పలువురు విమర్శిస్తున్నారు. 24 బోగీలతో రైలు సర్వీసును నడపాలని కోరుతున్నారు.