నేటి నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
విజయవాడ (రైల్వేస్టేషన్): విజయవాడ - విశాఖపట్నం మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జి రైల్వే పీఆర్వో జె.వి.ఆర్కే రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుని రైల్వేస్టేషన్‌లో కాపు గర్జన సందర్భంగా చేపట్టిన ఆందోళనలో రత్నాచల్ దగ్ధమైన విషయం తెలిసిందే. గతంలో 24 బోగీలతో నడిచిన రత్నాచల్‌ను ప్రస్తుతం బోగీల కొరత కారణంగా 17 బోగీలతో నడపనున్నట్లు పీఆర్వో పేర్కొన్నారు.
ఏసీ చైర్ కార్, రిజర్వుడ్ చైర్‌కార్, నాన్ రిజర్వుడ్, ప్యాంట్రీకార్ సహా మొత్తం 17 బోగీలతో నడుపుతున్నామని తెలిపారు. వాటిలో రిజర్వ్‌డ్ సిట్టింగ్ 8 బోగీలు, నాన్ రిజర్వ్‌డ్ సిట్టింగ్ 4, ఏసీ చైర్ కార్ 2, ఎస్‌ఎల్‌ఆర్ 2, ప్యాంట్రీ కారుతో కలిపి మొత్తం 17 బోగీలతో దీనిని నడపనున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తాకిడి ఉండే ఈ సర్వీసుకు బోగీలు కుదించటంపై పలువురు విమర్శిస్తున్నారు. 24 బోగీలతో రైలు సర్వీసును నడపాలని కోరుతున్నారు.