
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్‌లో చెలరేగిన అందోళనలు సద్దుమణిగాయి. ఈ నేపధ్యంలో దేశంలో 10 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. రిజర్వేషన్ల అంశంపై సోషల్ మీడియాలో అసంబద్ధ వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకే దేశంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
దేశంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించినట్లు ప్రకటించిన ప్రభుత్వం మూడు రోజుల పాటు వినియోగదారులందరికీ 5 జీబీ డేటా ఇంటర్నెట్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ విషయమై సమాచార, కమ్యూనికేషన్ల సాంకేతిక శాఖ సహాయ మంత్రి (ఐసీటీ) జునైద్ అహ్మద్ పాలక్ అధికారిక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం జూలై 18 నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రిజర్వేషన్ల అంశంపై దేశంలో జరిగిన హింసాయుత ఘటనల్లో సుమారు వందమంది మృతి చెందారు.
యుద్ధ వీరుల బంధువులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రిజర్వ్ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలోని ఢాకాతో పాటు ఇతర నగరాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అది హింసాత్మకంగా మారింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ హింసాకాండలో 100 మంది మరణించారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడికాలేదు. మరోవైపు హింసాకాండ నేపథ్యంలో కర్ఫ్యూ విధించాలన్న తన నిర్ణయాన్ని ప్రధాని షేక్ హసీనా సమర్థించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment