ratnachal express
-
విరిగిన రైలు బోగీ బాలిస్టర్ స్ప్రింగ్
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్ కింద బాలిస్టర్ స్ప్రింగ్ విరిగి పోవడంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో రెండు గంటల పాటు నిలిచిపోయింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మొదటి ప్లాట్‌ఫాంపైకి వస్తుండగా టీఎక్సార్ డిపార్ట్మెంట్ వారు ఏసీ కోచ్ నంబర్ సీ–2 కింద స్ప్రింగ్ విరిగి ఉండటాన్ని గుర్తించారు. తక్షణమే అప్రమత్తమైన అధికారులు రైలును రెండో నంబర్ ప్లాట్‌ఫాంపైకి తరలించి విరిగిన స్ప్రింగ్ స్థానంలో కొత్తది వేసి రైలును విజయవాడ పంపించారు. ఈ బాలిస్టర్ స్ప్రింగ్ మార్చేందుకు రెండు గంటల సమయం పట్టడంతో సాయంత్రం 6 గంటల సమయంలో రైలు విజయవాడకు బయలు దేరింది. -
సికింద్రాబాద్‌కు 'రత్నాచల్'
తుని : కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద జరిగిన హింసాకాండలో దగ్ధమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు గురువారం తుని నుంచి సికింద్రాబాద్ తరలించారు. ఆనాడు ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి, నిప్పు పెట్టగా రైలులోని 23 బోగీలు, ఇంజన్ కాలిపోయిన సంగతి తెలిసిందే. ప్రయాణికులు ముందే రైలు దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. దగ్ధమైన రత్నాచల్‌ను ఫిబ్రవరి ఒకటిన తుని రైల్వేస్టేషన్‌కు తరలించి, లూప్లైన్లో ఉంచారు. రైళ్ల క్రాసింగ్‌కు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం సికింద్రాబాద్ తరలించారు. -
నేటి నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
విజయవాడ (రైల్వేస్టేషన్): విజయవాడ - విశాఖపట్నం మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జి రైల్వే పీఆర్వో జె.వి.ఆర్కే రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుని రైల్వేస్టేషన్లో కాపు గర్జన సందర్భంగా చేపట్టిన ఆందోళనలో రత్నాచల్ దగ్ధమైన విషయం తెలిసిందే. గతంలో 24 బోగీలతో నడిచిన రత్నాచల్‌ను ప్రస్తుతం బోగీల కొరత కారణంగా 17 బోగీలతో నడపనున్నట్లు పీఆర్వో పేర్కొన్నారు. ఏసీ చైర్ కార్, రిజర్వుడ్ చైర్‌కార్, నాన్ రిజర్వుడ్, ప్యాంట్రీకార్ సహా మొత్తం 17 బోగీలతో నడుపుతున్నామని తెలిపారు. వాటిలో రిజర్వ్డ్ సిట్టింగ్ 8 బోగీలు, నాన్ రిజర్వ్డ్ సిట్టింగ్ 4, ఏసీ చైర్ కార్ 2, ఎస్ఎల్ఆర్ 2, ప్యాంట్రీ కారుతో కలిపి మొత్తం 17 బోగీలతో దీనిని నడపనున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తాకిడి ఉండే ఈ సర్వీసుకు బోగీలు కుదించటంపై పలువురు విమర్శిస్తున్నారు. 24 బోగీలతో రైలు సర్వీసును నడపాలని కోరుతున్నారు. -
ముద్రగడపై రైల్వే పోలీసుల కేసు
విజయవాడ: తుని రైల్వేస్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనం కేసులో కాపు ఐక్య గర్జన నిర్వాహకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై తుని గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ దుర్ఘటనలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ 24 బోగీలు దహనమైన విషయం విదితమే. రైల్వే ట్రాక్‌పైకి రావడంతోపాటు రైలును అడ్డగించడం, రైలును దహనం చే సినందుకు గాను ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్‌తో పాటు రైల్వే యాక్ట్ సెక్షన్లు 161, 162, 163, 164 కింద కేసు కేసు నమోదు చేశారు. రైలు దహనం ఘటనలో ముద్రగడతోపాటు మరికొంతమంది (ముద్రగడ పద్మనాభం అండ్ అదర్స్)పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసు అధికారులు చెప్పారు. కాపు నేతల్లో ఆగ్రహం కాపు ఐక్య గర్జనకు తాను బాధ్యుడినని, రైలు దహనంతోపాటు జరిగిన దుర్ఘటనలకు రాష్ట్రప్రభుత్వానిదే బాధ్యతని ముద్రగడ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయనపైనే కేసు నమోదు చేయడం కాపు సామాజిక వర్గం నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. -
కాపుగాస్తామంటూనే..కక్షసాధింపు
సాక్షి, విజయవాడ : కాపు సామాజిక వర్గం సమస్యలను పరిష్కరిస్తామంటూనే రాష్ట్ర ప్రభుత్వం వారిపై కక్షసాధింపు చర్యలకు సన్నద్ధమవుతోంది. ఒకపక్క కాపు గర్జనకు సారథ్యం వహించిన నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూనే.. మరోపక్క ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాపు గర్జనకు జిల్లా నుంచి వెళ్లిన, జన సమీకరణ చేసిన వారి వివరాలను నిఘా వర్గాలు రహస్యంగా సేకరిస్తున్నాయి. అదే సమయంలో అక్కడ ఆందోళనలోను, రైలు దగ్ధం ఘటనలోను పాల్గొన్న వారిలో ఎవరెవరు ఉన్నారనే వివరాలు తెలుసుకునేందుకు ఫొటోలు, వీడియోలను సేకరించి పరిశీలించే యత్నాల్లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై కాపు సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు విజయవాడ నుంచి 1500 మంది... కాపు గర్జనకు విజయవాడ నగరం నుంచి 1500 మంది వరకు వెళ్లినట్లు నిఘా విభాగాలు ఒక నిర్ధారణకు వచ్చాయి. దీనికి రెండు మూడు రెట్లు ఎక్కువ మంది జిల్లా నుంచి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. జిల్లాలోనూ అవనిగడ్డ, గుడివాడ, బందరు, పెడన, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది యువకులు, కాపు సంఘాలకు చెందిన ప్రతినిధులు తుని బయలుదేరి వెళ్లినట్లు ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసుకున్నట్లు సమాచారం. తుని వెళ్లిన వారిలోనూ ఆవేశంగా ఉండేవారు, గతంలో కేసులు ఉన్నవారి వివరాలు, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలుగా చలామణి అవుతున్నవారి వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్, వాహనాలు, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టినవారు జిల్లాలో ఎవరైనా ఉన్నారా అని అక్కడికి వెళ్లివచ్చిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ నేతలే టార్గెట్...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసేవారు, పార్టీ సానుభూతిపరులు ఆదివారం ఎక్కడెక్కడ ఉన్నారో సేకరించే పనిలో పోలీసు శాఖలోని ఒక వర్గం ఉన్నట్లు సమాచారం. వారు ఆందోళనలో పాల్గొన్నట్లు ఆధారాలు లభిస్తే తక్షణం విచారించి కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. జిల్లాలోని వైఎస్సార్ సీపీకి చెందిన ముఖ్య నేతల అనుచరులు, కాపు నేతల అనుచరుల గురించి వాకబు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో తమకు ఇబ్బంది కలిగించే వైఎస్సార్ సీపీ నేతలు ఆదివారం ఎక్కడ ఉన్నది తెలుగుదేశం నేతలు సేకరించి పోలీసులకు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో తుని దుర్ఘటనకు సంబంధించి ఎంతమందిపై కేసులు నమోదు చేస్తారోనన్న అనుమానం కాపు సంఘాల నేతల్లో వ్యక్తమవుతోంది. అక్కడ చర్చలు... ఇక్కడ కేసులా? ఉద్యమాన్ని చల్లార్చేందుకు కాపు నేతలతో ఒకవైపు చర్చలు జరుపుతూ.. మరోవైపు ఇక్కడ నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని కేసులు నమోదు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధపడటం చాలా దారుణమని, ఈ విషయంలోనూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్నే పాటిస్తున్నారంటూ నగరానికి చెందిన ఒక కాపు నేత వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు సాధించటమే లక్ష్యమని, తాము చంద్రబాబు పెట్టే కేసులకు ఏ మాత్రం భయపడబోమని చెప్పారు. -
కాలి బూడిదైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన కాపు ఐక్యగర్జన రత్నాచల్‌పై రాళ్ల వర్షం, ఇంజన్ ధ్వంసం, బోగీలకు నిప్పు సాక్షి, తుని: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో జాతీయ రహదారి-16 సమీపంలో తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామం వద్ద ఆదివారం జరిగిన కాపు ఐక్యగర్జన తీవ్ర పరిణామాలకు దారితీసింది. సభకు హాజరైన లక్షలాదిమంది కాపు సామాజిక వర్గీయులు.. ఐక్యగర్జన సారథి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపుతో రాకపోకలను దిగ్బంధం చేయడానికి జాతీయ రహదారిపైకి పరుగులు తీశారు. ఈ క్రమంలోనే కొందరు రైల్‌రోకో చేసేందుకు తుని రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపైకి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడవైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఆగకుండా ముందుకు దూసుకురావడంతో రాళ్ల వర్షం కురిపించారు. ఇంజన్‌ను ధ్వంసం చేశారు. ప్రయాణికులను కిందకు దింపేసి రైలుకు నిప్పు పెట్టారు. మరో పక్క అనేక పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ భవనంతో పాటు ఇంకా ప్రారంభానికి నోచుకోని డిగ్రీ కళాశాల భవనానికి నిప్పు పెట్టారు. పోలీసులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. మీడియా సిబ్బందిపై దాడికి దిగి వారి చేతుల్లో ఉన్న కెమెరాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు రోడ్‌పై బైఠాయించడంతో జాతీయ రహదారి-16కు ఇరువైపులా కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచి పోయింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకొని రాళ్ల వర్షం కురిపించారు. ఈ హఠాత్పరిణామంతో ైరైలులో ఉన్న ప్రయాణికులు ఎవరికి వారు ట్రైన్లో నుంచి దూకేసి భయాందోళనలతో పరుగులు తీశారు. సుమారు రెండుగంటల పాటు రత్నాచల్‌ను అడ్డగించిన ఆందోళనకారులు ఊహించని రీతిలో ట్రైన్‌కు నిప్పుపెట్టారు. కొద్దిసమయంలో బోగీలన్నీ అంటుకుని మంటలు చెలరేగాయి. అప్పటి వరకు కొద్ది దూరంలో వేచి ఉన్న ప్రయాణికులు ట్రైన్‌కు నిప్పు పెట్టడంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పిల్లాపాపలతో రోడ్లపైకి పరుగులు తీశారు. రైలు నుంచి ఉవ్వెత్తున ఎగసిన పొగ జాతీయ రహదారిపై, పక్కనే ఉన వెలమకొత్తూరు గ్రామంపై నల్లగా కమ్మేసింది. పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన ఏఎస్పీలు, డీఎస్పీలపై ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించారు. దీంతో వారు చేసేది లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. జాతీయ రహదారిపై టైర్లకు నిప్పులు పెట్టిన ఆందోళనకారులు కళాశాల గ్రౌండ్స్‌లో ఉన్న పోలీసులను తరిమికొట్టారు. వారిలో కొందరు పక్కనే ఉన్న కళాశాల భవనంలోకి చేరుకోగా తలుపులకు తాళాలు వేసి కళాశాల ప్రాంగణంలో ఉన్న సుమారు 30కి పోలీసు జీపులు, వ్యాన్లకు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా జాతీయ రహదారి పక్కనే ఉన్న తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న జీపులతో సహా పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. రూరల్ స్టేషన్లో ఉన్న 100కు పైగా ద్విచక్ర వాహనాలు కాలిబూడిదయ్యాయి. దగ్ధమవుతున్న వాహనాల నుంచి టైర్లు, ట్యాంకర్లు పేలుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. వెలమకొత్తూరు వాసులు గ్రామం పూర్తిగా ఖాళీ చేసి చేతికి దొరికిన వస్తువులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. జాతీయ రహదారిపై కూడా ఎక్కడికక్కడ టైర్లు, ఇతర పనికిరాని వస్తువులకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బంది బంక్‌ను మూసేసి పరుగులు తీశారు. ఆందోళనకారుల దాడుల్లో పోలీస్ ఉన్నతాధికారులతో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గర్జన ప్రాంగణం నుంచి తుని పట్టణంలోకి వచ్చిన ఆందోళనకారులు పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూడా నిప్పు పెట్టారు. కానిస్టేబుళ్లకు గాయాలు రైల్వే, పోలీస్ స్టేషన్లపై దాడి సందర్భంలో పలువురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారులు పోలీసులను పరుగులు తీరుుంచి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో కాకినాడకు చెందిన ప్రసాద్, కె.లోవరాజు, జడ్డంగికి చెందిన కానిస్టేబుల్ వరహాలు, మరో ఐదుగురు రైల్వే కానిస్టేబుళ్లు గాయపడ్డారు. కాకినాడ, జడ్డంగికి చెందిన కానిస్టేబుళ్లు ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కాగా ఆందోళనకారుల దాడిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందినట్టు వదంతి వ్యాపించింది. అరుుతే దానిపై స్పష్టత ఇవ్వడానికి పోలీసు అధికారులు అందుబాటులో లేరు. ఇద్దరు విలేకరులు గాయాల పాలయ్యారు. హైవేపై రాకపోకలను అడ్డుకునేందుకు ఆందోళనకారుల ఇనుపచట్రాలను అడ్డుగా వేశారు. -
తుని ఘటనతో రైల్వే శాఖ అత్యవసర సమావేశం
- ఏపీ సీఎస్, డీజీపీలతో మాట్లాడిన రైల్వే జీఎం గుప్తా సాక్షి, హైదరాబాద్ః తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనమైన ఘటనలో దక్షిణ మధ్య రైల్వే ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి రైల్వే జీఎం గుప్తా అత్యవసర సమావేశం నిర్వహించి విజయవాడ-విశాఖ మార్గంలో నడిచే రైళ్లన్నీ నిలిపేయాలని ఆదేశాలిచ్చారు. ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖలలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ సీఎస్ టక్కర్, డీజీపీ రాముడుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫారెస్ట్ ఏడీ అరెస్ట్
విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువతి పట్ల అటవీశాఖ (ఫారెస్ట్) ఏడి రమణమూర్తి శనివారం అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో యువతితోపాటు తోటి ప్రయాణీకులు సామర్లకోటలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రమణమూర్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.