కాలి బూడిదైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన కాపు ఐక్యగర్జన
రత్నాచల్‌పై రాళ్ల వర్షం, ఇంజన్ ధ్వంసం, బోగీలకు నిప్పు
సాక్షి, తుని: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో జాతీయ రహదారి-16 సమీపంలో తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామం వద్ద ఆదివారం జరిగిన కాపు ఐక్యగర్జన తీవ్ర పరిణామాలకు దారితీసింది. సభకు హాజరైన లక్షలాదిమంది కాపు సామాజిక వర్గీయులు.. ఐక్యగర్జన సారథి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపుతో రాకపోకలను దిగ్బంధం చేయడానికి జాతీయ రహదారిపైకి పరుగులు తీశారు. ఈ క్రమంలోనే కొందరు రైల్‌రోకో చేసేందుకు తుని రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపైకి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడవైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఆగకుండా ముందుకు దూసుకురావడంతో రాళ్ల వర్షం కురిపించారు.
ఇంజన్‌ను ధ్వంసం చేశారు. ప్రయాణికులను కిందకు దింపేసి రైలుకు నిప్పు పెట్టారు. మరో పక్క అనేక పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ భవనంతో పాటు ఇంకా ప్రారంభానికి నోచుకోని డిగ్రీ కళాశాల భవనానికి నిప్పు పెట్టారు. పోలీసులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. మీడియా సిబ్బందిపై దాడికి దిగి వారి చేతుల్లో ఉన్న కెమెరాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు రోడ్‌పై బైఠాయించడంతో జాతీయ రహదారి-16కు ఇరువైపులా కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచి పోయింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకొని రాళ్ల వర్షం కురిపించారు.
ఈ హఠాత్పరిణామంతో ైరైలులో ఉన్న ప్రయాణికులు ఎవరికి వారు ట్రైన్‌లో నుంచి దూకేసి భయాందోళనలతో పరుగులు తీశారు. సుమారు రెండుగంటల పాటు రత్నాచల్‌ను అడ్డగించిన ఆందోళనకారులు ఊహించని రీతిలో ట్రైన్‌కు నిప్పుపెట్టారు. కొద్దిసమయంలో బోగీలన్నీ అంటుకుని మంటలు చెలరేగాయి. అప్పటి వరకు కొద్ది దూరంలో వేచి ఉన్న ప్రయాణికులు ట్రైన్‌కు నిప్పు పెట్టడంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పిల్లాపాపలతో రోడ్లపైకి పరుగులు తీశారు.
రైలు నుంచి ఉవ్వెత్తున ఎగసిన పొగ జాతీయ రహదారిపై, పక్కనే ఉన వెలమకొత్తూరు గ్రామంపై నల్లగా కమ్మేసింది. పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన ఏఎస్పీలు, డీఎస్పీలపై ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించారు. దీంతో వారు చేసేది లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. జాతీయ రహదారిపై టైర్లకు నిప్పులు పెట్టిన ఆందోళనకారులు కళాశాల గ్రౌండ్స్‌లో ఉన్న పోలీసులను తరిమికొట్టారు. వారిలో కొందరు పక్కనే ఉన్న కళాశాల భవనంలోకి చేరుకోగా తలుపులకు తాళాలు వేసి కళాశాల ప్రాంగణంలో ఉన్న సుమారు 30కి పోలీసు జీపులు, వ్యాన్లకు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా జాతీయ రహదారి పక్కనే ఉన్న తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న జీపులతో సహా పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు.
రూరల్ స్టేషన్‌లో ఉన్న 100కు పైగా ద్విచక్ర వాహనాలు కాలిబూడిదయ్యాయి. దగ్ధమవుతున్న వాహనాల నుంచి టైర్లు, ట్యాంకర్లు పేలుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. వెలమకొత్తూరు వాసులు గ్రామం పూర్తిగా ఖాళీ చేసి చేతికి దొరికిన వస్తువులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. జాతీయ రహదారిపై కూడా ఎక్కడికక్కడ టైర్లు, ఇతర పనికిరాని వస్తువులకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బంది బంక్‌ను మూసేసి పరుగులు తీశారు. ఆందోళనకారుల దాడుల్లో పోలీస్ ఉన్నతాధికారులతో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గర్జన ప్రాంగణం నుంచి తుని పట్టణంలోకి వచ్చిన ఆందోళనకారులు పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూడా నిప్పు పెట్టారు.
కానిస్టేబుళ్లకు గాయాలు
రైల్వే, పోలీస్ స్టేషన్లపై దాడి సందర్భంలో పలువురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారులు పోలీసులను పరుగులు తీరుుంచి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో కాకినాడకు చెందిన ప్రసాద్, కె.లోవరాజు, జడ్డంగికి చెందిన కానిస్టేబుల్ వరహాలు, మరో ఐదుగురు రైల్వే కానిస్టేబుళ్లు గాయపడ్డారు. కాకినాడ, జడ్డంగికి చెందిన కానిస్టేబుళ్లు ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కాగా ఆందోళనకారుల దాడిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందినట్టు వదంతి వ్యాపించింది. అరుుతే దానిపై స్పష్టత ఇవ్వడానికి పోలీసు అధికారులు అందుబాటులో లేరు. ఇద్దరు విలేకరులు గాయాల పాలయ్యారు. హైవేపై రాకపోకలను అడ్డుకునేందుకు ఆందోళనకారుల ఇనుపచట్రాలను అడ్డుగా వేశారు.