కాపుగాస్తామంటూనే..కక్షసాధింపు
సాక్షి, విజయవాడ : కాపు సామాజిక వర్గం సమస్యలను పరిష్కరిస్తామంటూనే రాష్ట్ర ప్రభుత్వం వారిపై కక్షసాధింపు చర్యలకు సన్నద్ధమవుతోంది. ఒకపక్క కాపు గర్జనకు సారథ్యం వహించిన నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూనే.. మరోపక్క ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాపు గర్జనకు జిల్లా నుంచి వెళ్లిన, జన సమీకరణ చేసిన వారి వివరాలను నిఘా వర్గాలు రహస్యంగా సేకరిస్తున్నాయి. అదే సమయంలో అక్కడ ఆందోళనలోను, రైలు దగ్ధం ఘటనలోను పాల్గొన్న వారిలో ఎవరెవరు ఉన్నారనే వివరాలు తెలుసుకునేందుకు ఫొటోలు, వీడియోలను సేకరించి పరిశీలించే యత్నాల్లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై కాపు సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు విజయవాడ నుంచి 1500 మంది... కాపు గర్జనకు విజయవాడ నగరం నుంచి 1500 మంది వరకు వెళ్లినట్లు నిఘా విభాగాలు ఒక నిర్ధారణకు వచ్చాయి. దీనికి రెండు మూడు రెట్లు ఎక్కువ మంది జిల్లా నుంచి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. జిల్లాలోనూ అవనిగడ్డ, గుడివాడ, బందరు, పెడన, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది యువకులు, కాపు సంఘాలకు చెందిన ప్రతినిధులు తుని బయలుదేరి వెళ్లినట్లు ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసుకున్నట్లు సమాచారం.
తుని వెళ్లిన వారిలోనూ ఆవేశంగా ఉండేవారు, గతంలో కేసులు ఉన్నవారి వివరాలు, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలుగా చలామణి అవుతున్నవారి వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్, వాహనాలు, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టినవారు జిల్లాలో ఎవరైనా ఉన్నారా అని అక్కడికి వెళ్లివచ్చిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ నేతలే టార్గెట్...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసేవారు, పార్టీ సానుభూతిపరులు ఆదివారం ఎక్కడెక్కడ ఉన్నారో సేకరించే పనిలో పోలీసు శాఖలోని ఒక వర్గం ఉన్నట్లు సమాచారం. వారు ఆందోళనలో పాల్గొన్నట్లు ఆధారాలు లభిస్తే తక్షణం విచారించి కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. జిల్లాలోని వైఎస్సార్ సీపీకి చెందిన ముఖ్య నేతల అనుచరులు, కాపు నేతల అనుచరుల గురించి వాకబు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో తమకు ఇబ్బంది కలిగించే వైఎస్సార్ సీపీ నేతలు ఆదివారం ఎక్కడ ఉన్నది తెలుగుదేశం నేతలు సేకరించి పోలీసులకు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో తుని దుర్ఘటనకు సంబంధించి ఎంతమందిపై కేసులు నమోదు చేస్తారోనన్న అనుమానం కాపు సంఘాల నేతల్లో వ్యక్తమవుతోంది. అక్కడ చర్చలు... ఇక్కడ కేసులా? ఉద్యమాన్ని చల్లార్చేందుకు కాపు నేతలతో ఒకవైపు చర్చలు జరుపుతూ.. మరోవైపు ఇక్కడ నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని కేసులు నమోదు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధపడటం చాలా దారుణమని, ఈ విషయంలోనూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్నే పాటిస్తున్నారంటూ నగరానికి చెందిన ఒక కాపు నేత వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు సాధించటమే లక్ష్యమని, తాము చంద్రబాబు పెట్టే కేసులకు ఏ మాత్రం భయపడబోమని చెప్పారు.