న్యూఢిల్లీ: చందా మొత్తాన్ని చెల్లించలేదంటూ చాలా మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లో బ్లూ టిక్‌ను తొలగించిన ట్విట్టర్ యాజమాన్యం ఆదివారం కొందరికి బ్లూ టిక్‌ను పునరుద్ధరించింది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్ ఖాతాలకే ఈ మినహాయింపు ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీసహా ప్రముఖ భారతీయ నటులు, రాజకీయనేతలు, క్రీడాకారుల బ్లూ టిక్‌ను ఇటీవల తొలగించగా ఆదివారం ఆ టిక్ మళ్లీ ప్రత్యక్షమైంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉండటం వల్లే వీరందరికి బ్లూ టిక్ ఇచ్చారా ? లేక సబ్‌స్క్రైబ్ చేసుకున్నారా అనేది తెలియరాలేదు.
‘చందా కట్టకున్నా ఆదివారం బ్లూ టిక్ మళ్లీ వచ్చేసింది. మిస్టర్ మస్క్ మీరే నా తరఫున చందా రుసుం కట్టేశారా? ’ అంటూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆదివారం ట్వీట్‌చేశారు. అయితే లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు మాత్రమే వెరిఫైడ్ స్టేటస్(బ్లూ టిక్) హోదా కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే, దివంగతుల ఖాతాలకు టిక్ ప్రత్యక్షమవడం గమనార్హం. మైఖేల్ జాక్సన్, చాడ్విక్ బోస్‌మ్యాన్, కోబె బ్రయాంట్ తదితర సెలబ్రిటీల ఖాతాలు ఇందులో ఉన్నాయి. కాగా బ్లూ టిక్ కోసం చందా కట్టే ప్రసక్తే లేదని ప్రకటించిన కొందరు ప్రముఖుల తరఫున తానే నగదు చెల్లించి టిక్ పునరుద్ధరించినట్లు ట్విట్టర్ యజమాని, కుబేరుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. దిగ్గజ నటుడు విలియం శాట్నర్ తదితరుల తరఫున మస్క్ రుసుం చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment