గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటిపై దాడి
కార్లలో కత్తులు, రాళ్లు తీసుకొచ్చి విధ్వంసం
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు దాడులు, బూతులతో వీరంగం
అపార్ట్‌మెంట్, సమీపంలోని ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు
పలు కార్లు, ఇళ్ల అద్దాలు ధ్వంసం
అడ్డుకోబోయిన పోలీసులనూ తరిమిన టీడీపీ శ్రేణులు
రంగంలోకి సీఆర్‌పీఎఫ్.. లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపులోకి
పోలీసుల అదుపులో పలువురు టీడీపీ కార్యకర్తలు
అల్లరి మూకలకు మరింత రెచ్చగొట్టిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
విజయవాడ: బెజవాడలో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు విధ్వంసకాండకు దిగారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై దాడికి విఫలయత్నం చేశాయి. నగరంలోని లబ్బీపేట మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రాత్రి వరకు ఈ విధ్వంసకాండ కొనసాగింది.
అరుపులు, కేకలు, బూతులతో ఆ ప్రాంతాన్ని అట్టుడికించారు. పోలీసులనూ తరిమేశారు. చివరకు సీఆర్‌పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచి్చంది. ఇటీవలి ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అక్కడికి వచ్చి అల్లరి మూకలకు మరింతగా రెచ్చగొట్టడం గమనార్హం.
ముందస్తు వ్యూహంతోనే దాడి
టీడీపీ అధినాయకత్వం అండతో, ముందస్తు వ్యూహంతోనే విజయవాడ సెంట్రల్, తూర్పు, గన్నవరం నియోజకవర్గాల నుంచి గంజాయి, మద్యంతో పాటు ఇతర మత్తు పదార్థాలు సేవించిన టీడీపీకి చెందిన యువకులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. తొలుత మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాలుగు కార్లలో కత్తులు, ఇటుకలు, కంకర రాళ్లు, కర్రలతో కొందరు టీడీపీ కార్యకర్తలు వంశీ ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. వస్తూనే బూతులు తిడుతూ కార్లలో తెచ్చుకున్న రాళ్లను విసిరారు. రాళ్ల దాడిలో వంశీ కారుతో పాటు ఆ ప్రాంతంలోని కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు, సమీపంలోని ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
కొందరు సమీపంలోని ఇళ్లలోకి చొరబడి కర్రలతో కుండీలు, కిటికీలు పగలకొట్టి భీభత్సాన్ని సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవి్వంపు చర్యలకు దిగారు. బూతులు, అరుపులతో అక్కడున్న అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. అపార్ట్‌మెంట్ గోడ దూకి సెల్లార్‌లో ఉన్న పలు కార్ల అద్దాలను పగులగొట్టారు. ప్రతి అర గంటకు మరికొందరు అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతం పూర్తిగా టీడీపీ వారితో నిండిపోయింది. 300 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నారు. ఒక్కసారిగా భీభత్సం సృష్టించడంతో స్థానికులు భయకంపితులయ్యారు.
పలువురు మహిళలు భయాందోళనకు గురయ్యారు. పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదేశాలతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూడగానే అల్లరి మూకలు మరింతగా రెచి్చపోయాయి. విధ్వంసాన్ని అదుపు చేసేందుకు వచి్చన పోలీసులను వెంటబడి తరిమారు. పరిస్థితి అదుపు తప్పడంతో సీఆర్‌పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి.
సీఆర్‌పీఎఫ్ పోలీసులు వచ్చీ రాగానే లాఠీచార్జీ ప్రారంభించడంతో టీడీపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. దాడులకు పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు సమీపంలోని ఇళ్లలోకి దూరి దాక్కున్నారు. పోలీసులు వారిని వెతికి పట్టుకుని మరీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విధ్వంసానికి ఆజ్యం పోసిన యార్లగడ్డ
టీడీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడకు చేరుకుని విధ్వంసానికి ఆజ్యం పోసేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకుంటున్న వారిని అక్కడే వదిలేయాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. పోలీసులు ససేమిరా అనడంతో వారితో వాగ్వాదానికి దిగారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతోనే ఈ దాడికి దిగినట్లు చెప్పడంతో అక్కడున్న పోలీసులు సైతం నివ్వెరపోయారు. స్వయంగా చంద్రబాబు వచ్చి విడిపిస్తారంటూ అరెస్ట్ అయిన వారిని మరింత రెచ్చగొట్టేందుకు వెంకట్రావు ప్రయత్నం చేశారు. పోలీసులు అక్కడివారిని తరిమేస్తున్నా అక్కడే తిరుగుతూ కవి్వంపు చర్యలు కొనసాగించారు. అర్ధరాత్రి వరకు పరిస్థితి ఇలానే కొనసాగింది.
గవర్నర్ కార్యాలయ ఉద్యోగి వాహనం ధ్వంసం
టీడీపీ కార్యకర్తలు మద్యం, గంజాయి మత్తులో విచక్షణరహితంగా చేసిన దాడిలో గవర్నర్ కార్యాలయ ఉద్యోగి కారు కూడా ధ్వంసమైంది. ఆ ఉద్యోగి అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. సెల్లార్‌లో పార్క్ చేసిన ఆయన కారుపై టీడీపీ వారు రాళ్లు రువ్వడంతో అద్దాలన్నీ పూర్తిగా పగిలిపోయాయి.
దేవినేని అవినాశ్‌కు భద్రత పెంపు
గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌కు పోలీసులు భద్రత పెంచారు. విజయవాడ ఏలూరు రోడ్డులోని ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద మాచవరం పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఆయన్ని కలిసేందుకు వచ్చే అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
సమీపంలో అనుమానంగా సంచరించే వారిని గమనిస్తున్నారు. యువకులు గుంపులుగా ఉండకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ అల్లరి మూకలు రాష్ట్రవ్యాప్తంగా విచక్షణరహితంగా విధ్వంసం సృష్టిస్తుండటంతో అవినాశ్‌కు భద్రత పెంచినట్లు మాచవరం పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment