Sakshi News home page

‘మమ్మల్ని ఆదుకోండి సార్‌’.. రతన్‌ టాటాకు చేరిన పైలెట్ల పంచాయితీ!

Published Wed, Apr 26 2023 12:08 PM

Air India Pilots Seek Ratan Tata Help To Salary And Services Conditions Issues - Sakshi

మానవ వనరుల విభాగం (hr) ఏకపక్షనిర్ణయాలతో తమకు అన్యాయం జరుగుతోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎయిరిండియా పైలెట్లు, క్యాబిన్‌ క్రూ సిబ్బంది 1500 సంతకాలతో కూడిన పిటిషన్‌ను ఎయిరిండియా మాతృసంస్థ, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు పంపారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 17న పైలెట్లు, క్యాబిన్‌ క్రూ సిబ్బందికి చెల్లించే జీతాలు, కాంట్రాక్ట్‌లను ఎయిండియా సవరించింది. ఈ నిర్ణయాన్ని పైలెట్ల యూనియన్లు ఇండియన్‌ కమర్షియల్‌ పైలెట్‌ అసోషియేషన్‌ (icpa), ఇండియన్‌ పైలెట్స్‌ గిల్డ్‌ (ipg) లు వ్యతిరేకించాయి. తమని సంప్రదించకుండా హెచ్‌ఆర్‌ విభాగం కాంట్రాక్ట్‌ సవరణ, జీతభత్యాలపై నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి.ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త చెల్లింపుల్ని అంగీకరించబోమని స్పష్టం చేశాయి.    

రతన్‌ టాటాకు పంపిన పిటిషన్‌లో ఎయిరిండియా హెచ్‌ఆర్‌ విభాగం తీరుపై పైలెట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో తమకు విలువ లేదని, శ్రమకు తగ్గ గౌరవం లేదని వాపోయారు. ఆ కారణంతోనే విధులు నిర్వహించే సమయంలో శక్తి, సామర్ధ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పిటిషన్‌లో వెల్లడించారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన విమాన‌యాన సంస్థ‌గా తీర్చిదిద్దుతున్న ఎయిరిండియా విజయంలో తాము భాగస్వాములమేనని, ప్రయాణికులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందించేలా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన రంగం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్ని తాము అర్ధం చేసుకున్నామని చెప్పారు. సమస్యల్ని పరిష్కరించుకుంటూ సంస్థతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ‘కానీ మా సమస్యలను హెచ్‌ఆర్ విభాగం పట్టించుకోవడం లేదు. పరిష్కారం చూపించడం లేదని భావిస్తున్నాం. ఉత్పన్నమవుతున్న సమస్యల్ని పరిష్కరించాలని మిమ్మల్ని (రతన్‌ టాటాను) కోరుతున్నామని’ పైలెట్లు రతన్‌ టాటాకు ఇచ్చిన పిటిషన్‌లో తెలిపారని నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement