‘మళ్లీ డ్రగ్స్‌ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి | Sakshi
Sakshi News home page

‘మళ్లీ డ్రగ్స్‌ తీసుకున్నాను.. అది టెస్లాకు ఎంతో ఉపయోగపడింది’

Published Tue, Mar 19 2024 1:39 PM

Elon Musk Said His Ketamine Prescription Was Beneficial For Tesla - Sakshi

డ్రగ్స్‌ తీసుకుంటున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై టెస్లా అధినేత ఎలోన్‌ మస్క్‌ స్పందించారు. మాదకద్రవ్యాలను వినియోగించినట్లు ఆయన అంగీకరించారు. డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు డాక్టర్ల సూచన మేరకే ‘కెటమిన్‌’ అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా తాను డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్టుబడి సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఏర్పడలేదని భావిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ తనపై ఎలాంటి ప్రభావం చూపాయనే విషయాన్ని పక్కనపెడితే.. టెస్లా కారు గతేడాది ప్రపంచంలోనే బెస్ట్‌ సెల్లింగ్‌ కారుగా రికార్డు నెలకొల్పిందని మస్క్‌ చెప్పారు.

కొన్నినెలల కొందట తాను మానసిక కంగుబాటుకు గురైనట్లు మస్క్‌ చెప్పారు. ఆ సమయంలో దాన్నుంచి బయటపడేందుకు కెటమిన్‌ అనే డ్రగ్‌ను వినియోగించానన్నారు. వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి చిన్న మొత్తంలో దాన్ని తీసుకునేవాడినని తెలిపారు. ఆయన ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. ‘రోజుకు 16 గంటలు పనిచేస్తాను. దాంతో నాపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. నేను ఎక్కువ కాలం డిప్రెషన్‌లోకి వెళితే దాని ప్రభావం టెస్లా పనితీరుపై పడుతుంది. దాన్ని అధిగమించేందుకు డాక్టర్‌ సూచనతో తగుమోతాదులోనే కెటమిన్‌ డ్రగ్‌ తీసుకున్నాను. అది టెస్లాకు ఎంతో ఉపయోగపడింది. ఒకవేళ ఎవరైనా కెటమిన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏ పనీ సక్రమంగా పూర్తి చేయలేరు’ అని మస్క్‌ చెప్పారు. 

ఇదిలా ఉండగా, తాను డ్రగ్స్‌ తీసుకున్నట్లు మస్క్‌ చెప్పడం ఇది రెండోసారి. గతంలో ఓసారి డ్రగ్స్‌ సేవించిన విషయం నిజమేనని మస్క్‌ అప్పట్లోనే చెప్పారు. ఆ తర్వాత చాలాకాలంపాటు తాను డ్రగ్స్‌ తీసుకోలేదని స్పష్టం చేశారు. నాసా అభ్యర్థనతో టెస్లా ఆఫీసును డ్రగ్స్ రహితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ అభ్యర్థన మేరకు గత మూడేళ్లుగా తాను వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఈ మూడేళ్లలో తన శరీరంలో డ్రగ్స్ కానీ, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లూ గుర్తించలేదన్నారు. 

ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్‌ కొత్త నిబంధన..?

రెండు నెలల క్రితం మస్క్‌ డ్రగ్స్‌ వినియోగంపై వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ తరచుగా పాల్గొంటూ నిషేధిత డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని దానిలో పేర్కొంది. ఈ విషయంపై టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. దీని వల్ల మస్క్‌ ఆరోగ్యంతోపాటు ఆయన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నదని ఆ సంస్థల డైరెక్టర్ల బోర్డు సభ్యులు చెప్పినట్లు ఆ కథనంలో ప్రచురించారు. తాజాగా డ్రగ్స్‌ వినియోగంపై స్వయంగా మస్క్‌ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
 
Advertisement