నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్
రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో అసలు సమరానికి ముందు ఏకైక సన్నాహక మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమైంది. నేడు జరిగే ‘వామప్’ పోరులో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. లీగ్ దశలో తమ తొలి మూడు మ్యాచ్‌లు ఆడే నాసా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే రోహిత్ బృందం ఈ మ్యాచ్ ఆడనుంది.
కొత్తగా నిర్మించిన ఈ స్టేడియం పిచ్‌తో పాటు అటు వాతావరణంపై కూడా ఒక అంచనాకు వచ్చేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతాయి. అందువల్ల అలాంటి స్థితికి అలవాటు పడటం చాలా ముఖ్యం.
ఈ నేపథ్యంలో ఏకైక వామప్ మ్యాచ్ కీలకం కానుంది. మ్యాచ్‌కు ముందు శుక్రవారం ఆటగాళ్లు చివరి నెట్ సెషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ ఈనెలలో జరిగే విఖ్యాత బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్‌బీఏ ఫైనల్స్‌లో విన్నర్స్ జట్టుకు ఇచ్చే ట్రోఫీతో, టి20 వరల్డ్‌కప్‌తో ఫొటో సెషన్‌లో పాల్గొన్నాడు.
అందరూ బరిలోకి...
వామప్ మ్యాచ్ కావడంతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆటగాళ్లందరినీ పరీక్షించేందుకు భారత్‌కు అవకాశం ఉంది. 15 మంది సభ్యుల టీమ్‌లో విరాట్ కోహ్లి మాత్రం శుక్రవారం ఆలస్యంగా చేరాడు. అయితే అతను ఈ మ్యాచ్‌లో ఆడేది సందేహంగానే ఉంది. దాంతో కోహ్లి మినహా ఇతర కూర్పుపై టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టనుంది.
ఐపీఎల్ కారణంగా అంతా మ్యాచ్ ప్రాక్టీస్‌లోనే ఉన్నారు. జట్టులోని సభ్యులంతా తమ టీమ్‌లలో రెగ్యులర్‌గా దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడారు. ప్రధాన టోర్నీలో యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకోవడం, బుమ్రాకు తోడుగా రెండో పేసర్‌గా ఎవరికి అవకాశం కల్పించాలనేదానిపై మేనేజ్‌మెంట్ ప్రధానంగా దృష్టి పెడుతోంది.
రెండో పేసర్‌గా సిరాజ్, అర్ష్ దీప్‌లలో ఒకరికే అవకాశం దక్కుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ టీమ్ పరిస్థితి గొప్పగా లేదు. ఇటీవలే అనూహ్యంగా అమెరికా జట్టు చేతిలో 1–2తో బంగ్లాదేశ్ టి20 సిరీస్ కోల్పోయింది. పైగా ఈ టోర్నీలో బలమైన ‘డి’ గ్రూప్‌లో ఆ జట్టు ఉంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ మ్యాచ్‌తో కాస్త ఆత్మవిశ్వాసం ప్రోదిచేసుకోవడంపై బంగ్లాదేశ్ బృందం దృష్టి సారించింది.
Comments
Please login to add a commentAdd a comment