షాకింగ్‌ లేఆఫ్‌.. ఇంతకంటే దారుణమైన తొలగింపు ఉంటుందా? | Google lays off employee working on Gemini AI model - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ లేఆఫ్‌.. ఇంతకంటే దారుణమైన తొలగింపు ఉంటుందా?

Published Thu, Feb 22 2024 3:28 PM

Google shocking layoff Employee working on Gemini fired - Sakshi

Google shocking layoff: టెక్‌ పరిశ్రమలో ఇప్పుడు తొలగింపులు సాధారణంగా మారిపోతున్నాయి. అయితే గూగుల్‌ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్‌ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. గూగుల్‌ తనను ఎంత దారుణంగా తొలగించిందో ఓ ఉద్యోగి సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు.

ముందు యాక్సెస్‌ పోయింది.. తర్వాత మెసేజ్‌
జెమిని ఏఐ మోడల్ అల్గారిథమ్‌లపై పని చేసే తనను గూగుల్‌ తొలగించిన క్రమాన్ని అలెక్స్ కోహెన్ అనే ఉద్యోగి ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్)లో షేర్ చేసిన పోస్ట్‌లో వివరించారు. "గూగుల్‌ నన్ను ఈ రోజు  తొలగించిందని పంచుకోవడం విచారంగా ఉంది. జెమిని కోసం అల్గారిథమ్‌ల రూపకల్పనకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న నాకు ఈరోజు ఉన్నట్టుండి హ్యాంగ్‌అవుట్స్‌, గూగుల్ డ్రైవ్‌కు యాక్సెస్‌ పోయింది. ఆ తర్వాత నన్ను తొలగించినట్లు మేనేజర్ నుంచి మెసేజ్‌ వచ్చింది" అని అలెక్స్ కోహెన్ వాపోయాడు.

అయితే తాను 12 నెలల తొలగింపు పరిహారాన్ని (సుమారు రూ.22 కోట్లు ) అందుకుంటున్నానని, ఇది చేతికందిన తర్వాత తాను తదుపరి ఏమి చేయాలో నిర్ణయించుకుంటానని అలెక్స్ కోహెన్ తెలియజేశారు. అయితే గత 5 నెలల్లో ఎల్‌ఎల్‌ఎంల గురించి, ఏఐ గురించి ఎంతో నేర్చుకున్నానని, ఆ ప్రయాణం బాగుందని రాసుకొచ్చారు.

కాగా ఇంతకుముందు గూగుల్ ఒకప్పుడు ఏఐ విభాగంతో ప్రత్యక్ష ప్రమేయం లేని 'సెర్చ్ టీమ్'లో భాగమైన ఒక ఉద్యోగికి జీతంలో 300 శాతం పెంపును అందించిందని పర్ప్లెక్సిటీ ఏఐ సీఈవో అరవింద్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ "కఠినమైన ఎంపికలు" చేయాల్సిన అవసరం ఉన్నందున మరిన్ని ఉద్యోగాల కోతలు ఉంటాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement