హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

Published Fri, Feb 9 2024 3:08 AM

NIA conducts searches in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు గురువారం హైదరాబాద్‌లో వీక్షణం పత్రిక ఎడిటర్, వరవరరావు అల్లుడు ఎన్‌. వేణుగోపాల్‌తోపాటు రచయిత, పౌరహక్కుల నేత రవిశర్మ నివాసాల్లో సోదాలు జరిపారు. తెల్లవారుజామున 4 గంటలకే హిమాయత్‌నగర్‌లోని ఎన్‌. వేణుగోపాల్‌ ఇంటితోపాటు ఎల్బీ నగర్‌ శ్రీనివాసనగర్‌ కాలనీలోని రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు పుస్తకాలు, కొన్ని అనుమానాస్పద డా­క్యు­మెంట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నె­ల 10న గచ్చిబౌలిలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి వి­చారణ కోసం హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. 

ఆ కేసు ఆధారంగా దర్యాప్తు...  
మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సంజయ్‌ దీపక్‌రావును గతేడాది సెప్టెంబర్‌ 15న కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలోని మలేసియా టౌన్‌షిప్‌లో సైబరాబాద్‌ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ ఏడాది జనవరి 3న ఎన్‌ఐఏ అధికారులు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సంజయ్‌ దీపక్‌రావుతో ఎన్‌. వేణుగోపాల్, రవిశర్మకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల దృష్ట్యానే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం.

ఈ కేసులో వేణుగోపాల్‌ను 22వ నిందితుడిగా పేర్కొన్న ఎన్‌ఐఏ... రవిశర్మతోపాటు కేరళకు చెందిన మరో ముగ్గురిని సైతం నిందితులుగా చేర్చింది. కబలి దళం పేరిట సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా గురువారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ సోదాలు నిర్వహించినట్టు ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సోదాల్లో మావోయిస్టు సాహిత్యంతో పాటు ఆరు సెల్‌ఫోన్లు, రూ. 1,37,210 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు. 

పౌరహక్కుల సంఘాల ఖండన 
వేణుగోపాల్, రవిశర్మ ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులను పౌరహక్కుల సంఘాల నాయకులు ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా దాడులు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేయగా అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయా­ల­ని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫె­సర్‌ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్‌ నారాయణరావు డిమాండ్‌ చేశారు. నిర్బంద వ్యతిరేక వేదిక తెలంగాణ సైతం ఈ అరెస్టులను ఖండించింది. 

విచారణకు హాజరవ్వాలన్నారు: రవిశర్మ 
మన్సూరాబాద్‌: రవిశర్మ మీడియాతో మాట్లాడుతూ 10న విచారణకు హాజరుకావాలని ఎన్‌ఐఏ అధికారులు ఆదేశించారని చెప్పారు. 2016­లో జనజీవన స్రవంతిలో కలిసినప్పటి నుంచి తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. 2019లో స్థానిక పోలీసులు, 2021లో ఎన్‌ఐఎ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తుచేశారు. 

ఇది పూర్తిగా అబద్ధపు కేసు: ఎన్‌.వేణుగోపాల్‌ 
ఎన్‌ఐఏ అధికారులు తనపై నమోదు చేసినది పూర్తిగా అబద్ధపు కేసని వీక్షణం పత్రిక ఎడిటర్‌ ఎన్‌. వేణుగోపాల్‌ ఆరోపించారు. ‘నేను ఒక మాస పత్రిక నడుపుతున్నాను. నేను ప్రస్తుతం విరసంలో లేను’అని మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన పేర్కొన్నారు. 2013లో నయీం బెదిరింపు లేఖలపై తాను రాసిన పుస్తకాలను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. తన మొబైల్‌ ఫోన్‌ను సీజ్‌ చేశారని, ఈ నెల 10న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు ఇచ్చారని వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement