మాటు వేసి.. మట్టుబెట్టే కుట్ర | Sakshi
Sakshi News home page

మాటు వేసి.. మట్టుబెట్టే కుట్ర

Published Mon, Apr 15 2024 4:01 AM

Vijayawada CP analyzed and confirmed manner of attack On CM Jagan - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడి దాడి 

దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించి నిర్థారించిన పోలీసులు 

‘మేమంతా సిద్ధం’ రూట్‌ మ్యాప్‌ ఆధారంగా పక్కాగా రెక్కీ 

వ్యూహాత్మకంగా వివేకానంద స్కూల్‌–గంగానమ్మ గుడి మధ్య  ప్రాంతం ఎంపిక 

చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చనే.. స్కూల్‌ ప్రాంగణంలో నక్కి 45 డిగ్రీల కోణంలో బలంగా దాడి 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రోడ్డుకు కుడివైపున జనసందోహానికి అభివాదం చేస్తుండగా ఎడమ వైపు నుంచి ఆగంతకుడి దాడి 

క్యాటర్‌బాల్‌ లేదా ఎయిర్‌గన్‌ వినియోగించినట్లు నిర్ధారణ 

వెలంపల్లి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు 

అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం.. సిట్‌ ఏర్పాటు 

సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలన.. సెల్‌ టవర్‌ పరిధిలో ఫోన్‌ కాల్స్‌ డేటా సేకరణ.. కీలక ఆధారాలు లభ్యం.. 

పోలీసుల అదుపులో కొందరు అనుమానితులు  

కేసులో కొంత పురోగతి సాధించామన్న విజయవాడ సీపీ కాంతిరాణా టాటా..

సీఎంపై దాడి ఘటన మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు నివేదిక    

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేసేందుకే పక్కా పన్నాగంతో ఆయనపై ఆగంతకుడు దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ముందుగా రెక్కీ నిర్వహించి సమీపం నుంచి దాడి చేసి తప్పించుకునేందుకు అనువుగా ఉందనే విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లోని డాబా కొట్ల జంక్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లు నిర్దారణ అయింది. క్యాటర్‌ బాల్‌ / ఎయిర్‌గన్‌ లాంటి పరికరం ద్వారా పదునైన రాయి లాంటి వస్తువుతో దాడికి పాల్పడ్డాడు.

కణతపైగానీ తల వెనుక దిగువ భాగంపైగానీ తీవ్రంగా దాడి చేయడం ద్వారా ముఖ్యమంత్రిని అంతమొందించాలన్నదే దుండగుల లక్ష్యమని వెల్లడైంది. దాడిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తోపాటు తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఐపీసీ సెక్షన్‌ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై ఆగంతకుడు ఎక్కడ నుంచి ఏ విధంగా దాడికి పాల్పడ్డాడనే దానిపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలు, టవర్‌ పరిధిలోని సెల్‌ ఫోన్ల డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. అనుమానితులపై నిఘా పెట్టడంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా సీఎం జగన్‌ పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు నివేదిక సమర్పించారు.

హత్య చేసేందుకే పక్కాగా రెక్కీ..
ముఖ్యమంత్రి జగన్‌పై ఆగంతకుడి దాడి లక్ష్యం ఆయన్ని అంతం చేయడమేనని పోలీసులు నిర్ధారించారు. సీఎం జగన్‌ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ యాత్ర విజయవాడలో కొనసాగే వివిధ ప్రాంతాల్లో ఆగంతకుడితోపాటు ఈ కుట్రలో ఇతర పాత్రధారులు రెక్కీ నిర్వహించారు. సమీపం నుంచి దాడి చేసి తప్పించుకునేందుకు డాబా కొట్ల జంక్షన్‌ను ఎంపిక చేసుకున్నారు. కాస్త ఇరుకుగా ఉండే ఆ రోడ్డులో కుడివైపు ఇళ్లు, దుకాణాలున్నాయి.



అక్కడ ప్రజలు భారీగా గుమిగూడతారు. ఎడమ వైపున వివేకానంద స్కూల్‌ భవనం ఉంది. అటువైపు జన సంచారం ఉండదు. సీఎం జగన్‌ తన వాహనంపై నుంచి కుడివైపు ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వెళతారు. ఎడమ వైపు ఎవరూ దృష్టి సారించరు. అంతేకాకుండా ఆ జంక్షన్‌లోనే ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది. సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న భారీ ప్రచార వాహనం వెళ్లేందుకు వీలుగా ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తారని గుర్తించారు. దీంతో స్కూల్‌ భవనం వైపు పూర్తిగా చీకటి కమ్ముకుని ఉంటుంది.

ప్రహరి లోపల స్కూల్‌ భవనానికి, ఆ పక్కనే ఉన్న గంగానమ్మ ఆలయానికి మధ్యలో ఖాళీ స్థలంలో నిందితులు మాటు వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. స్కూల్‌ ప్రాంగణం వెనుక వైపు నుంచి తూర్పు దిశలో ఉన్న చిన్న ఇనుప గేటు దాటి మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోకి వెళ్లి సులభంగా తప్పించుకునేందుకు అవకాశం ఉంది.  సీఎం జగన్‌ యాత్రకు సంఘీభావంగా హాజరైన భారీ జనసందోహంలో కలసిపోతే ఎవరూ గుర్తించ లేరు. ఇన్ని రకాలుగా కసరత్తు చేసిన అనంతరమే వివేకానంద స్కూల్‌ ప్రాంగణం నుంచి దాడి చేసేందుకు ఆగంతకుడు తెగబడ్డాడు.

వీడియో ఫుటేజీ విశ్లేషణ..
ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో వీడియో ఫుటేజీని పోలీసులు విశ్లేషించారు. వివేకానంద స్కూల్‌ ప్రాంగణం నుంచి 45 డిగ్రీల కోణంలో బలమైన రాయి లాంటి వస్తువు అత్యంత వేగంగా దూసుకొచ్చి సీఎం జగన్‌ ఎడమ కనుబొమ్మ పైభాగంలో బలంగా తాకినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఆయనకు తగిలి అనంతరం ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి  శ్రీనివాస్‌ కంటికి కూడా బలంగా తాకింది. సీఎం జగన్‌కు ఎడమ కనుబొమ్మ పైభాగంలో తీవ్ర గాయం కాగా ఎమ్మెల్యే వెలంపల్లి కంటికి కూడా తీవ్ర గాయమైంది.

ఆ ప్రదేశంలో రోడ్డువైపు నుంచి వివేకానంద స్కూల్‌ ప్రహరి గోడ ఆరు అడుగుల ఎత్తు ఉంది. స్కూల్‌ ప్రాంగణంలో నేల ఎత్తు చేయడంతో లోపల వైపు నుంచి ప్రహరి కేవలం మూడు అడుగుల ఎత్తే ఉంది. అక్కడి నుంచి సీఎం వాహనం వచ్చే రోడ్డు కేవలం 20 అడుగుల దూరమే ఉంది. ఆ ప్రహరి లోపల ముందుగానే మాటు వేసిన ఆగంతకుడు సీఎం వాహనం అక్కడికి చేరుకోగానే బలమైన రాయిని క్యాటర్‌ బాల్‌తోగానీ ఎయిర్‌గన్‌ వంటి పరికరంతోగానీ బలంగా గురి చూసి కొట్టాడు. 45 డిగ్రీల కోణంలో బలంగా వచ్చిన రాయి సీఎం జగన్‌కు తగిలింది.

సీఎం జగన్‌ రోడ్డుకు కుడివైపున ఉన్న జనసందోహాన్ని చూస్తూ అభివాదం చేస్తుండగా దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఎడమ కణతపైగానీ తల వెనుక కింద భాగంలోగానీ దాడి చేయాలన్నది ఆగంతకుడి ఉద్దేశమన్నది స్పష్టమైంది. ఎందుకంటే కణతపైగానీ తల వెనుక కింద భాగంలోగానీ బలంగా దాడి చేస్తే మెదడుకు తీవ్రగాయం /మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కణత ప్రాంతంలో మెత్తగా ఉండే ఎముక విరిగి మెదడుకు గుచ్చుకునే ప్రమాదం ఉంది. దాంతో మెదడులో రక్తస్రావమై ప్రాణాపాయం సంభవించవచ్చు.

తల వెనుక కింద భాగంలో తగిలినా, మెదడు దెబ్బతిన్నా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను అంతమొందించాలనే పక్కా ప్రణాళికతోనే ఆగంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కుడివైపు ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్‌ తలను కాస్త పక్కకు తిప్పడంతో ఆ బలమైన రాయి ఆయన కణతకు, తల వెనుక కింద భాగంలో కాకుండా ఎడమ కనుబొమ్మ పైభాగంలో తగిలింది. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

కీలక ఆధారాలు లభ్యం
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. శనివారం రాత్రి నుంచి అజిత్‌సింగ్‌ నగర్‌లోని డాబా కొట్ల జంక్షన్‌ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తదితర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించి దాడి ఎలా జరిగిందనే అంశంపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు కోసం  ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఆదివారం ఏర్పాటు చేశారు.

అదనపు ఎస్పీ శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌లో ఆరు టాస్క్‌ఫోర్స్‌ బృందాలున్నాయి. దాడి జరిగిన ప్రదేశాన్ని డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించి ఆగంతకుడు ఏ మార్గాల్లో తప్పించుకునేందుకు అవకాశం ఉంది? ఎంత దూరం వెళ్లి ఉండవచ్చు? అనే కోణాల్లో విశ్లేషిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న 24 సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. గంగానమ్మ గుడి ప్రాంతంలో ఉన్న సెల్‌ టవర్‌  పరిధిలోని మొబైల్‌ ఫోన్ల డేటాను విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక బలగాలను మోహరించి ఆ ప్రాంతంలో విస్లృతంగా తనిఖీలు చేపట్టారు.

డాబా కొట్ల జంక్షన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో నేర చరిత్ర ఉన్నవారి వివరాలను ఆరా తీస్తున్నారు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ తరహా దాడులకు పాల్పడ్డ నేరగాళ్ల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గతంలో విజయవాడలో దాడులకు పాల్పడిన వారి ఆచూకీపై ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్‌ డేటా రికార్డులు, ఇతర శాస్త్రీయ ఆధారాల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి పోలీసులు ఈ కేసులో ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారి నుంచి కీలక వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కుట్ర కోణంపై దృష్టి
సీఎం జగన్‌పై దాడికి పాల్పడ్డ ఆగంతకుడితోపాటు నిందితుడి వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరనే కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. ఈ కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసులు ఇప్పటికే కీలక పురోగతి సాధించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసు దర్యాప్తులో స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతరం అసలు కుట్రదారులెవరనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తామని చెబుతున్నారు. 

త్వరలోనే ఛేదిస్తాం
సీఎం వైఎస్‌ జగన్‌పై హత్యా­యత్నం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. సీసీ టీవీ ఫుటేజీలు, కాల్‌ డాటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను విశ్లేషిస్తూ  దర్యాప్తు చేస్తున్నాం.  కేసులో ఇప్పటికే కొంత పురోగతి సాధించాం.  
    – కాంతి రాణా టాటా, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌  

Advertisement
Advertisement