జార్ఖండ్‌లో నేడే తొలి దశ
4 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లే
గిరిజనుల ఆధిపత్యమే ఎక్కువ
తూర్పు భారతంలో కీలక రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఎన్నికల పర్వానికి రంగం సిద్ధమైంది. సోమవారం తొలి దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం 4 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కేంద్ర గిరిజన శాఖ మంత్రి, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా, మాజీ సీఎం మధు కోడా భార్య గీత, మాజీ డీజీపీ విష్ణు దయాళ్ రామ్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
10 జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ నాలుగూ రిజర్వ్‌డ్ స్థానాలే కావడం విశేషం. పలాము ఎస్సీ, మిగతా మూడు ఎస్టీ నియోజకవర్గాలు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తదితరులు ఇక్కడ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో పోటీ ప్రధానంగా బీజేపీ; కాంగ్రెస్, జేఎంఎంలతో కూడిన విపక్ష ఇండియా కూటమి మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాల్లో మూడు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ నెగ్గాయి...
ఖుంటీ
కేంద్ర మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్జున్ ముండా మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండాపై కేవలం 1,445 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారాయన. కాంగ్రెస్ నుంచి మళ్లీ కాళీచరణే బరిలో ఉన్నారు. ఖుంటీ బీజేపీ కంచుకోట. ఆ పార్టీ నేత కరియా ముండా ఇక్కడ ఏకంగా ఎనిమిదిసార్లు గెలిచారు. గిరిజనుల ఆరాధ్యుడు బిర్సా ముండా స్వగ్రామం ఉలిహట్ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. గత నంబర్‌లో మోదీ ఈ గ్రామాన్ని సందర్శించి బిర్సా ముండాకు నివాళులర్పించారు. పేదరికం, మానవ అక్రమ
రవాణా, మావోయిజం, నల్లమందు సాగు ఇక్కడి ప్రధాన సమస్యలు. కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్‌కు గిరిజనుల్లో పలుకుబడి ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. కూటమి భాగస్వామి జేఎంఎం మాజీ ఎమ్మెల్యే బసంత్ కుమార్ లోంగా రెబల్‌గా పోటీ చేస్తున్నారు. దాంతో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌కు ఓట్ల బదిలీ ఏ మేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
సింగ్‌భమ్
కాంగ్రెస్ పారీ్టకి బలమైన స్థానమిది. ఐదుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు బీజేపీ, ఒసారి జేఎంఎం, ఐదుసార్లు జార్ఖండ్ పార్టీ గెలిచాయి. సింగ్‌భమ్‌లో మాజీ సీఎం మధు కోడా కుటుంబానికి గట్టి పట్టుంది. 2009లో మధు కోడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2014లో మాత్రం బీజేపీ నేత లక్ష్మణ్ గిలువా చేతిలో ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో మధు కోడా భార్య గీత కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం ఇదే. కానీ గీత గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ దీన్ని జేఎంఎంకు కేటాయించింది. దీంతో ఇక్కడ గెలుపును జేఎంఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రిగా చేసిన ఐదుసార్లు ఎమ్మెల్యే జోబా మాంఝిని రంగంలోకి దింపింది.
లోహర్దగ
ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. అయితే సిట్టింగ్ ఎంపీ సుదర్శన్ భగత్‌ను పక్కన పెట్టి సమీర్ ఒరాన్‌కు టికెటిచి్చంది. గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి సుఖ్‌దేవ్ భగత్ ఈసారీ బరిలో ఉన్నారు. జార్ఖండ్ పార్టీ నుంచి దియోకుమార్ ధాన్ పోటీ చేస్తున్నారు. బిష్ణుపూర్ జేఎంఎం ఎమ్మెల్యే చమ్రా లిండా కూడా ఇండిపెండెంట్‌గా బరిలో ఉండటం విశేషం! ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. ఈ నియోజకవర్గంలో 70 శాతానికి పైగా గిరిజన జనాభాయే.
పలాము
రాష్ట్రంలో ఏకైక ఎస్సీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానం. మాజీ డీజీపీ విష్ణు దయాళ్ రామ్ బీజేపీ టికెట్‌పై 2019లో 4.77 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి ఆర్జేడీ తరఫున మమతా భూయాన్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2009లో జేఎంఎం గెలవగా 2014లో విష్ణు దయాళ్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి నెగ్గారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ పలాములో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మమతా భూయాన్ రాజకీయాలకు కొత్తయినా ఇక్కడ ఆమె సామాజిక వర్గం ఓటర్లు 4.5 లక్షలకు పైగా ఉంటారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేపీ చేతిలోనే ఉన్నాయి.
అక్కడ తొలిసారి ఓటింగ్
సింగ్‌భమ్ లోక్‌సభ స్థానం పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. దాంతో మారుమూల గ్రామాల్లోని వారికి ఓటేసే అవకాశం ఉండేది కాదు. అడవులు, కొండల్లోని అలాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలు కూడా దశాబ్దాల విరామం తర్వాత ఈసారి ఓటేయనున్నారు. అనేక కష్టనష్టాలకోర్చి అక్కడ 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలింగ్ సిబ్బంది కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లారు. దట్టమైన అడవిలో ఉన్న సరండ అనే మారుమూల గ్రామానికైతే హెలికాప్టర్ ద్వారా ఎన్నికల సామగ్రిని తరలించారు. ఏ ఓటరూ ఓటింగ్‌కు దూరంగా ఉండొద్దన్నది తమ సంకల్పమని వెస్ట్ సింగ్‌భమ్ జిల్లా ఎన్నికల అధికారి కులదీప్ చౌదరి తెలిపారు.
మహిళల ఓట్లే కీలకం
సింగ్‌భమ్, ఖుంటి, లోహర్దగ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం మహిళల చేతుల్లో ఉందని చెప్పాలి! ఎందుకంటే అక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. జార్ఖండ్‌లో గిరిజన మహిళలు పురుషులతో సమానంగా సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఓటింగ్‌లోనూ చురుకైన పాత్ర పోషిస్తుంటారు. దాంతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలూ చేశాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment