అటు బీజేపీ తరఫున ఐదుగురు
ముఖ్యమంత్రులు, ప్రధాని ప్రచారం
ఇటు ఒక్కడే విస్తృత ప్రచారం చేసిన
కమలకూటమి వెన్నువిరిచిన గిరిజన నేత
సాక్షి, నేషనల్ డెస్క్: హేమంత్ సోరెన్. జార్ఖండ్ అత్యంత యువ ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించిన గిరిజన నేత. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతుండగానే ఎన్నో సవాళ్లు. భూవివాదంలో చిక్కుకుని ఈడీ అరెస్ట్‌తో జైలుపాలైనా, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్ట మసకబారినా, వదిన సీత సోరెన్, అత్యంత ఆప్తుడైన నేత చంపయీ సోరెన్ పార్టీని వీడి తిరుగుబాటు జెండా ఎగరేసినా అన్నింటినీ తట్టుకుని సవాళ్లకు ఎదురొడ్డి జార్ఖండ్ శాసనసభ సమరంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)ను విజయతీరాలకు చేర్చి జార్ఖండ్ గిరిజన కోటపై తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు.
హేమంత్ సోరెన్ ఒక్కడే అంతా తానై, అన్నింటా ముందుండి నడిపించిన జేఎంఎం, కాంగ్రెస్ కూటమికి ఘన విజయం దక్కేలా చేసి తన రాజకీయపటిమను మరోసారి చాటిచెప్పారు. విపక్ష బీజేపీ కూటమి తరఫున ప్రధాని మోదీ మొదలు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ తదితరులు కాళ్లకు బలపం కట్టుకుని విస్తృతస్థాయి ప్రచారం చేసినా హేమంత్ సోరెన్ ప్రభ ముందు అదంతా కొట్టుకుపోయింది. జేఎంఎం మిత్రపక్షం కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ఖర్గే కొన్ని చోట్ల ప్రచారం చేసినా కూటమి తరఫున పూర్తి ప్రచార బాధ్యతల్ని హేమంత్ తన భుజస్కంధాలపై మోపి కూటమిని విజయశిఖరాలపై నిలిపారు.
తన అరెస్ట్‌తో ఆదివాసీ సెంటిమెంట్‌ను తెరమీదకు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జేఎంఎం మాత్రమే పాటుపడగలదని ప్రచారంచేసి మెజారిటీ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. తండ్రి, జేఎంఎం దిగ్గజం శిబూసోరెన్ నుంచి రాజకీయ వారసత్వం పొందినా తొలినాళ్ల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి సిసలైన సీఎంగా పేరు తెచ్చుకున్నారు.
2009లో రాజ్యసభలో అడుగుపెట్టి..
మూడోసారి ముఖ్యమంత్రిగా దాదాపు ఖరారైన హేమంత్ రాజకీయ ప్రస్థానం శాసనసభకు బదులు రాజ్యసభలో మొదలైంది. 2009లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే అనివార్యకారణాల వల్ల కొద్దికాలానికే రాజీనామాచేయాల్సి
వచి్చంది. నాటి మిత్రపక్షంగా బీజేపీ సారథ్యంలోని అర్జున్‌ముండా ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రెండేళ్లకే ప్రభుత్వం కుప్పకూలడం రాష్ట్రపతిపాలన అమలుకావడంతో సోరెన్ జేఎంఎం పగ్గాలు చేపట్టారు. తర్వాత
కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతులో 2013లో 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే ఏడాదికే పదవిని కోల్పోవాల్సి వచి్చంది. 2014లో అధికార పీఠాన్ని బీజేపీ హస్తగతంచేసుకోవడంతో సోరెన్ విపక్షనేత బాధ్యతలు నెత్తినేసుకున్నారు.
మలుపుతిప్పిన 2016..
2016లో నాటి బీజేపీ ప్రభుత్వం జార్ఖండ్‌లో గిరిజన అటవీ భూములను సులభంగా వ్యవసాయేతర అవసరాలకు బదలాయించేందుకు వీలుగా అత్యంత వివాదాస్పద ‘చోటానాగ్‌పూర్ టెనెన్సీ యాక్ట్ 1908(సవరణ)ఆర్డినెన్స్, సంథాల్ పరగణ టెనెన్సీ యాక్ట్ 1949(సవరణ) ఆర్డినెన్స్‌లను తీసుకొచి్చంది. గిరిజనులు అధికంగా ఉండే రాష్ట్రంలో వారి భూములను ప్రభుత్వం అన్యాయంగా స్వా«దీనంచేసుకుని సొంత వ్యక్తులు, బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తోందని హేమంత్ సోరెన్ 2016లో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం లేవదీశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం చేసిన ఈ ఉద్యమం విజయవంతమవడంతో సోరెన్ శక్తివంత గిరిజన నేతగా అవతరించారు.
2019లో కొనసాగిన హవా
కాంగ్రెస్, ఆర్జేడీల మద్దతుతో 2019లో హేమంత్ మరోసారి సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. 81 సీట్లున్న అసెంబ్లీలో జేఎంఎం పార్టీ ఒక్కటే ఏకంగా 30 సీట్లను కైవసం చేసుకోవడంలో హేమంత్ కృషి దాగిఉంది. అయితే 2023లో భూవివాదంలో మనీలాండరింగ్ జరిగిందంటూ హేమంత్‌ను అరెస్ట్‌చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కటకటాల వెనక్కి నెట్టింది. జనవరి 31న అరెస్ట్‌కు ముందు సీఎం పదవికి రాజీనామాచేసి పారీ్టలో అత్యంత నమ్మకస్తుడైన చంపయీ సోరెన్‌కు పగ్గాలు అప్పజెప్పి జైలుకెళ్లారు. జార్ఖండ్ హైకోర్టు జూన్‌లో బెయిల్ ఇవ్వడంతో మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే తనను అవమానకర రీతిలో సీఎం పదవి నుంచి కిందకు తోశారని చంపయీ సోరెన్, పారీ్టలో విలువ ఇవ్వట్లేరని వదిన సీతా సోరెన్ జేఎంఎంను వీడి హేమంత్‌కు తలనొప్పిగా మారారు.
ప్రజలకు చేరువగా పథకాలు
పలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేసి ప్రజారంజక నేతగా హేమంత్ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి మయ్యాన్ సమ్మాన్ యోజన ఆర్థిక ప్రయోజనం లబ్ధిని పెంచారు. 18–51 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా రూ.1,000 ఆర్థికసాయం అందేలా చేశారు. దాదాపు 1.75 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసి రైతన్నల మన్ననలు అందుకున్నారు. గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారు. సహజవనరులతో తులతూగే జార్ఖండ్ నుంచి సహజసంపదను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యథేచ్ఛగా దోచేస్తోందని ప్రచారకార్యక్రమాల్లో ప్రధానంగా ప్రస్తావించి బీజేపీ పట్ల ఓటర్లలో ఆగ్రహం పెంచారు. బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి మోదీ సర్కార్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1.36 లక్షల కోట్ల బకాయిలపై నిలదీసి గిరిజనులకు అండగా తానొక్కడినే ఉన్నానని ఓటర్ల మనసుల్లో ముద్రవేశారు. 2022లో సొంతంగా మైనింగ్ లీజుకు ఇచ్చుకున్నాడనే అపవాదుతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే ప్రమాదం నుంచి కాస్తలో తప్పించుకున్నారు. జార్ఖండ్ పేదలను మోదీ సర్కార్ తన స్వప్రయోజనాల కోసం నిమ్మకాయ పిండినట్లు పిండుతోందని హేమంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తెగ పాపులర్ అయ్యాయి. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు, నమ్మకస్తులైన ఓటర్లు
అంతా కలిసి హేమంత్‌కు మరోసారి ఘన విజయమాల వేశారు.
Comments
Please login to add a commentAdd a comment