లక్ష్యాల సాధనకు సంస్కరణలు చేపట్టిన సీఎం జగన్ ప్రపంచానికే ఆదర్శం
నున్నగా ఉండే రోడ్లు, భవనాలు అభివృద్ధికి కొలమానం కాదు
గతంలో అభివృద్ధి చూడని ప్రజలు నేడు అనేక పథకాలతో లబ్ధి పొందుతున్నారు
గత ప్రభుత్వాల విధానాలతో నేటికీ పేదరిక నిర్మూలన గురించి చర్చిస్తున్నాం
చాలా సమస్యలను సీఎం జగన్ రూపు మార్చారు
సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజన్ పాలసీ,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాజీ డైరెక్టర్ ఆచార్య కె. రాజమోహన్ రావు,
ఏఎన్‌యూ: ఐక్యరాజ్య సమితి కాంక్షించే సుస్థిర అభివృద్ధికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వేదికగా మారిందని, సుస్థిర అభివృద్ధిని అంగీకరించని వారు నిజమైన అభివృద్ధికి వ్యతిరేకులేనని ఆర్థిక రంగ నిపుణులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (కేంద్రీయ విశ్వవిద్యాలయం) సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజన్ పాలసీ మాజీ డైరెక్టర్ ఆచార్య కె. రాజమోహన్‌రావు అన్నారు.
ఆర్థిక, సామాజిక రంగ విధానాల రూపకల్పన కోసం ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రత్యేక సదస్సులో భారత దేశం నుంచి ప్రతినిధిగా హాజరవ్వడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా 8 దేశాలలో పర్యటించి అక్కడి ఆర్థిక అంశాలను అధ్యయనం చేసిన ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు
సమాజాభివృద్ధికి ఏపీ విధానాలు దోహదం
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సంపూర్ణ సమాజాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. సమాజంలో కొన్ని వర్గాలకే పరిమితమైతే అది నిజమైన అభివృద్ధి కాదనేది ఆర్థిక, సామాజిక రంగాలపై అవగాహన ఉన్న వారెవరైనా ఒప్పుకుంటారు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాల సంపూర్ణ సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. అందమైన భవనాలో, కొందరికో ఉపయోగపడే రెండు రంగాలకు ప్రాధాన్యమిచ్చి సంపదంతా అందులో పెట్టేయడమో, నున్నగా ఉండే రోడ్లో అభివృద్ధి కాదు.
మానవ వనరుల అభివృద్ధే నిజమైన అభివృద్ధి. ఈ ప్రపంచంలో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య వంటి 17 లక్ష్యాలను రూపొందించింది. ఆ లక్ష్యాల సాధన, అణగారిన వర్గాల అభివృద్ధికి అంకితభావంతో కూడిన సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రజల్లో విద్య, వైద్యం మానసిక స్థైర్యాన్ని పెంపొదిస్తాయి
సంక్షేమం, అభివృద్ధి రెండూ వేరు కాదనే విషయం గుర్తించాలి. ఏపీలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలతో మిశ్రమ ప్రయోజనాలు ఉన్నాయి. అమ్మ ఒడి, ఆసరా, డ్వాక్రా మహిళలకు రుణాల వంటి పథకాలకు ఇస్తున్న ఆర్థిక ప్రోత్సాహం వారి సంక్షేమం, అభివృద్ధికి, వారిలో కొనుగోలు శక్తిని పెంపునకు దోహదం చేస్తున్నాయి.
2022–23 మధ్య ఏపీలో పెరిగిన అభివృద్ధి రేటు
ఏపీలో 2018–19 సంవత్సరం నాటికి, 2022–23 సంవత్సరానికి మధ్య పలు రంగాల్లో ఎంతో వృద్ధి రేటు నమోదయింది. జీఎస్‌డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడెక్ట్) వృద్ధి రేటు 11 శాతం నుంచి 16.2 శాతానికి, వ్యవసాయాభివృద్ధి 5.4 శాతం నుంచి 14.9 శాతానికి, పారిశ్రామికాభివృద్ధి రేటు 10.4 శాతం నుంచి 16.3 శాతానికి, సేవారంగ వృద్ధి రేటు 12.7 శాతం నుంచి 20.5 శాతానికి పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం రూ.1,38,299 ఉండగా ఈ ప్రభుత్వ కాలంలో రూ.2,19,518కి పెరిగింది.
ప్రజల అవసరాలు, పాలనా సంస్కరణల అమలు పేరుతో ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు అప్పులు చేశాయి. అవి కొద్ది మందికే ప్రయోజనాన్ని కలిగించాయి. ప్రస్తుత ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు రాయితీలు, స్వయం ఉపాధి ప్రోత్సాహ పథకాలు వంటి వాటి ద్వారా మన రాష్ట్రంలో నిజమైన వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతోంది. ఇప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉన్న చాలా మంది ప్రజలు నేడు పలు పథకాల ద్వారా ఏపీలో లబ్ధి పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment