
భద్రతకు ఎన్నికల కమిషన్ మరిన్ని చర్యలు తీసుకోవాలి
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు, శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలి
పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలి
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరిగే పోలింగ్ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో హింసకు పాల్పడేందుకు టీపీపీ కుట్ర పన్నిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో భద్రతకు ఎన్నికల సంఘం మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమైన నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, ఏజెంట్ల ద్వారా హింసకు ఆ పార్టీ ప్లాన్ చేసిందని తెలిపారు.
దీనికి సంబంధించి చంద్రబాబు ఇప్పటికే ఆపార్టీ నాయకులకు డైరెక్షన్ ఇచ్చినట్టుగా తమ వద్ద సమాచారం ఉందన్నారు. హింసకు పాల్పడి, ఆ ఘటనలకు అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం కల్పించి, ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టివేయాలని వ్యూహం పన్నారని తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారంతో ఓటర్లను ప్రభావితం చేయడానికి, పోలింగ్ స్టేషన్లలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారన్నారు.
ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఫ్రస్టేషన్లో టీడీపీ ఇలాంటి కుట్రలు పన్నుతోందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు టీడీపీ పాల్పడినా, హింసను ప్రేరేపించేందుకు యత్నించినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు, శ్రేణులు పూర్తి సంయమనంతో వ్యవహరించాలని కోరారు. పోలింగ్ అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని చెప్పారు.