హిమాచల్‌లో ఎన్నికల సిబ్బంది సాహసం
అది హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఓ గ్రామం. పేరు బారా – భంగల్. సముద్ర మట్టానికి 2,575 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాన్ని ఆనుకునే రావి నదీ ప్రవాహం సాగిపోతుంటుంది.ఆ ఊరికి రోడ్డు మార్గం లేదు. చేరుకోవాలంటే ట్రెక్కింగ్ ద్వారానే సాధ్యం. పైగా అందుకు మూడు నాలుగు రోజులు పాటు సాహసయాత్ర చేయాల్సిందే!
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా బైజంత్ సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న ఈ కుగ్రామంలో 468 మంది ఓటర్లున్నారు. హిమాలయాల్లో ఎక్కడో మూలన విసిరేసినట్టుండే ఈ గ్రామం ఏడాదిలో ఆర్నెల్ల పాటు పూర్తిగా మంచుమయంగా మారుతుంది. దాంతో నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా స్థానికులు కూడా సమీపంలోని బిర్‌కు వలస పోతారు. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే మే నెల నుంచి అక్టోబర్ మధ్యే సాధ్యం!
అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ గ్రామంలో అందరూ ఓటేయడం విశేషం! ప్రతికూల వాతావరణం వల్ల ఆ ఎన్నికలప్పుడు హెలికాప్టర్‌ను వాడటం కుదర్లేదు. దాంతో 18 మందితో కూడిన ఎన్నికల బృందం 40 కిలోమీటర్లు ట్రెక్ చేసి మరీ గ్రామానికి చేరుకుంది! ఈసారి కూడా ఎన్నికల సిబ్బంది ట్రెక్కింగ్‌నే నమ్ముకుంటున్నారు. ‘‘వారు పోలింగ్‌కు కొన్ని రోజుల ముందే బయల్దేరతారు. రోడ్డు మార్గంలో రాజ్‌గుండ్ దాకా చేరుకుంటారు. అక్కడి నుంచి మూడు రోజులు ట్రెక్ చేసి బారా భంగల్ చేరతారు’’ అని కాంగ్రా జిల్లా ఎన్నికల అధికారి హేమ్‌రాజ్ బైర్వా వివరించారు.
ఈవీఎం తదితర పోలింగ్ సామగ్రి తరలింపు కోసం హెలికాప్టర్ సమకూర్చాలని కోరనున్నామన్నారు. ‘‘గ్రామస్తుల్లో బారా భంగల్‌లో ఎవరున్నారు, బిర్‌లో ఎవరున్నారో ఎన్నికల ముందు సర్వే చేసి తెలుసుకుంటాం. తదనుగుణంగా ఓటర్ల జాబితాను వేరు చేసి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన తెలిపారు. అన్నట్టూ, ఈ ఊళ్లో సెల్ నెట్‌వర్క్ కూడా ఉండదు. దాంతో ఎన్నికల సిబ్బంది శాటిలైట్ ఫోన్లు వాడతారు. ఇక్కడ జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment