Ravi River
-
Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
అది హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఓ గ్రామం. పేరు బారా – భంగల్. సముద్ర మట్టానికి 2,575 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాన్ని ఆనుకునే రావి నదీ ప్రవాహం సాగిపోతుంటుంది.ఆ ఊరికి రోడ్డు మార్గం లేదు. చేరుకోవాలంటే ట్రెక్కింగ్ ద్వారానే సాధ్యం. పైగా అందుకు మూడు నాలుగు రోజులు పాటు సాహసయాత్ర చేయాల్సిందే! హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా బైజంత్ సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న ఈ కుగ్రామంలో 468 మంది ఓటర్లున్నారు. హిమాలయాల్లో ఎక్కడో మూలన విసిరేసినట్టుండే ఈ గ్రామం ఏడాదిలో ఆర్నెల్ల పాటు పూర్తిగా మంచుమయంగా మారుతుంది. దాంతో నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా స్థానికులు కూడా సమీపంలోని బిర్కు వలస పోతారు. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే మే నెల నుంచి అక్టోబర్ మధ్యే సాధ్యం! అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ గ్రామంలో అందరూ ఓటేయడం విశేషం! ప్రతికూల వాతావరణం వల్ల ఆ ఎన్నికలప్పుడు హెలికాప్టర్‌ను వాడటం కుదర్లేదు. దాంతో 18 మందితో కూడిన ఎన్నికల బృందం 40 కిలోమీటర్లు ట్రెక్ చేసి మరీ గ్రామానికి చేరుకుంది! ఈసారి కూడా ఎన్నికల సిబ్బంది ట్రెక్కింగ్నే నమ్ముకుంటున్నారు. ‘‘వారు పోలింగ్‌కు కొన్ని రోజుల ముందే బయల్దేరతారు. రోడ్డు మార్గంలో రాజ్గుండ్ దాకా చేరుకుంటారు. అక్కడి నుంచి మూడు రోజులు ట్రెక్ చేసి బారా భంగల్ చేరతారు’’ అని కాంగ్రా జిల్లా ఎన్నికల అధికారి హేమ్రాజ్ బైర్వా వివరించారు. ఈవీఎం తదితర పోలింగ్ సామగ్రి తరలింపు కోసం హెలికాప్టర్ సమకూర్చాలని కోరనున్నామన్నారు. ‘‘గ్రామస్తుల్లో బారా భంగల్లో ఎవరున్నారు, బిర్‌లో ఎవరున్నారో ఎన్నికల ముందు సర్వే చేసి తెలుసుకుంటాం. తదనుగుణంగా ఓటర్ల జాబితాను వేరు చేసి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన తెలిపారు. అన్నట్టూ, ఈ ఊళ్లో సెల్ నెట్వర్క్ కూడా ఉండదు. దాంతో ఎన్నికల సిబ్బంది శాటిలైట్ ఫోన్లు వాడతారు. ఇక్కడ జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్‌కు వెళ్లే భారత్ జలాల మళ్లింపు
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే నదీ జలాలను నిలిపివేయాలని గురువారం నిర్ణయించింది. తూర్పు నదుల నుంచి పాక్‌కు వెళుతున్న జలాలను జమ్మూ కశ్మీర్, పంజాబ్‌లకు మళ్లించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. రావి నదిపై షాపూర్-కంది వద్ద జలాశయం పనులు ప్రారంభయ్యాయని, యూజేహెచ్ ప్రాజెక్టులో నిల్వ చేసే మన జలాలను జమ్మూ కశ్మీర్ కోసం వాడతామని మిగిలిన జలాలను రెండవ రావి-బీఈఏస్ అనుసంధానం ద్వారా ఇతర పరీవాహక రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గడ్కరీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ ఇప్పటికే జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించామని వరుస ట్వీట్లలో గడ్కరీ వెల్లడించారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు ఊతమిస్తున్న పాకిస్తాన్‌కు నదీ జలాల్లో మన వాటాను నిలిపివేయడం ద్వారా గట్టి గుణపాఠం చెప్పినట్టవుతుందని భావిస్తున్నారు. -
ముష్కరులు పాక్ నుంచే వచ్చారు
రావి నది మీదుగా భారత్‌లోకి ఉగ్రవాదులు 15 కి.మీ. రోడ్డుపై దర్జాగా నడుచుకుంటూ వచ్చారు గురుదాస్‌పూర్/న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఉగ్రదాడి చేసి ఏడుగురిని బలితీసుకున్న ముగ్గురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించాయి. జూలై 26-27లలో ముగ్గురు సాయుధులైన టైస్టులు రావి నదిని దాటుకుని అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న పఠాన్‌కోట్‌లోని బమియాల్ గ్రామం మీదుగా ఆదివారం రాత్రి వారు దేశంలోకి చొరబడినట్లు వెల్లడైంది. ఉగ్రవాదులు ఉపయోగించిన రెండు జీపీఎస్ పరికరాలను విశ్లేషించగా ఈ ముగ్గురు సాయుధులు రోడ్డుపై నడుస్తూ వచ్చినట్లు తేలింది. ఈ జీపీఎస్ పరికరాల్లో వాళ్లు ప్రయాణించాల్సిన మార్గాలు.. ఛేదించాల్సిన లక్ష్యాలు కూడా స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. మరింత స్పష్టత కోసం వీటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. టైస్టులు రావి నదిని దాటి బామియాల్ గ్రామంలో ప్రవేశించిన ప్రాంతంలో భద్రత పటిష్టంగా లేదని సైనిక వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా అమృత్సర్-జమ్ము హైవేపై వారు నడుచుకుంటూ రావటం గమనార్హం. పంజాబ్ పోలీస్ చీఫ్ సుమేధ్సింగ్ సైనీ చెప్పిన వివరాల ప్రకారం టైస్టులు అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న ధుస్సీ బంధ్(రావి నది)ని చొరబాటుకు ఎంచుకున్నారు. సరిహద్దులోకి ప్రవేశించగానే అక్కడి రైల్వే ట్రాక్‌పై బాంబులు అమర్చి దీనానగర్‌కు చేరుకున్నారు. భారత్‌లోకి ప్రవేశించిన తరువాత 15 కిలోమీటర్లు నడుచుకుంటే వచ్చారు. దీనానగర్ చేరుకున్నాక ఒక పౌరుడి దగ్గరి నుంచి కారు దొంగిలించి, ఆ కారులోనే దీనానగర్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించారు. జీపీఎస్ పరికరాల విశ్లేషణ ప్రకారం ఉగ్రవాదులు దీనానగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు, రైల్వే ట్రాక్, ఎస్ఎస్పీ, డిప్యూటీ కమిషనర్, గుర్దాస్పూర్లోని ఆర్మీ యూనిట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక జీపీఎస్ పరికరంలో తలవండీ పాయింట్, పర్మానంద్ గ్రామం, దీనానగర్‌లు టార్గెట్లుగా కనిపిస్తే, మరో జీపీఎస్ పరికరం గురుదాస్‌పూర్ సివిల్ లైన్స్‌ను టార్గెట్‌గా చూపించిందని సైనీ తెలిపారు. ఉగ్రవాదుల నుంచి మొత్తం 11 ఉపయోగించని బాంబులను స్వాధీనం చేసుకుని వాటిలో అయిదింటిని నిర్వీర్యం చేసినట్లు సైనీ వివరించారు. మూడు ఏకే-47 తుపాకులు, 17 మ్యాగజైన్లు, 55 క్యాటరిడ్జ్‌లు, ఒక రాకెట్ లాంచర్, మూడు చేతి గ్రెనేడ్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రాత్రి కనిపించే పరికరం, 200 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని సైనీ తెలిపారు. ఉగ్రవాదులకు కలిసొచ్చిన రావి పంజాబ్‌లోకి చొరబడ్డానికి రావి నది ఉగ్రవాదులకు బాగా కలిసివచ్చింది టైస్టులు రావి నదికి సంబంధించి ఒక కాలువ ద్వారా భారత్‌లోకి ప్రవేశించిన తరువాతే తమ దగ్గరున్న జీపీఎస్ పరికరాలను ఆన్ చేశారు. సీసీటీవీ వీడియో..దీనానగర్ పట్టణంలోనికి ఉగ్రవాదులు ప్రవేశించటానికి ముందు తారాగఢ్‌లో ఓ దుకాణదారు తన దుకాణంపై ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజిలోనూ ఉగ్రవాదుల కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. 14 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తెల్లవారుఝామున 4:55గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా రికార్డయింది.