Satellite phones
-
Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
అది హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఓ గ్రామం. పేరు బారా – భంగల్. సముద్ర మట్టానికి 2,575 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాన్ని ఆనుకునే రావి నదీ ప్రవాహం సాగిపోతుంటుంది.ఆ ఊరికి రోడ్డు మార్గం లేదు. చేరుకోవాలంటే ట్రెక్కింగ్ ద్వారానే సాధ్యం. పైగా అందుకు మూడు నాలుగు రోజులు పాటు సాహసయాత్ర చేయాల్సిందే! హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా బైజంత్ సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న ఈ కుగ్రామంలో 468 మంది ఓటర్లున్నారు. హిమాలయాల్లో ఎక్కడో మూలన విసిరేసినట్టుండే ఈ గ్రామం ఏడాదిలో ఆర్నెల్ల పాటు పూర్తిగా మంచుమయంగా మారుతుంది. దాంతో నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా స్థానికులు కూడా సమీపంలోని బిర్కు వలస పోతారు. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే మే నెల నుంచి అక్టోబర్ మధ్యే సాధ్యం! అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ గ్రామంలో అందరూ ఓటేయడం విశేషం! ప్రతికూల వాతావరణం వల్ల ఆ ఎన్నికలప్పుడు హెలికాప్టర్‌ను వాడటం కుదర్లేదు. దాంతో 18 మందితో కూడిన ఎన్నికల బృందం 40 కిలోమీటర్లు ట్రెక్ చేసి మరీ గ్రామానికి చేరుకుంది! ఈసారి కూడా ఎన్నికల సిబ్బంది ట్రెక్కింగ్నే నమ్ముకుంటున్నారు. ‘‘వారు పోలింగ్‌కు కొన్ని రోజుల ముందే బయల్దేరతారు. రోడ్డు మార్గంలో రాజ్గుండ్ దాకా చేరుకుంటారు. అక్కడి నుంచి మూడు రోజులు ట్రెక్ చేసి బారా భంగల్ చేరతారు’’ అని కాంగ్రా జిల్లా ఎన్నికల అధికారి హేమ్రాజ్ బైర్వా వివరించారు. ఈవీఎం తదితర పోలింగ్ సామగ్రి తరలింపు కోసం హెలికాప్టర్ సమకూర్చాలని కోరనున్నామన్నారు. ‘‘గ్రామస్తుల్లో బారా భంగల్లో ఎవరున్నారు, బిర్‌లో ఎవరున్నారో ఎన్నికల ముందు సర్వే చేసి తెలుసుకుంటాం. తదనుగుణంగా ఓటర్ల జాబితాను వేరు చేసి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన తెలిపారు. అన్నట్టూ, ఈ ఊళ్లో సెల్ నెట్వర్క్ కూడా ఉండదు. దాంతో ఎన్నికల సిబ్బంది శాటిలైట్ ఫోన్లు వాడతారు. ఇక్కడ జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లో శాటిలైట్ ఫోన్లు
శ్రీనగర్: అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శాటిలైట్ ఫోన్లు, థర్మల్ ఇమేజరీ సామగ్రి దొరకడంతో ఈ మేరకు అనుమానాలు నిజమయ్యాయి. ఉత్తరకశ్మీర్ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 15వరకు శాటిలైట్ ఫోన్ సంకేతాల జాడలు కనిపించగా, తాజాగా దక్షిణ కశ్మీర్‌లోనూ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఇవి ఉన్నట్లు తేలిందని అంటున్నారు. అదేవిధంగా, రాత్రి సమయాల్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే వైఫై ఆధారిత థర్మల్ ఇమేజరీ సామగ్రి ఉగ్రస్థావరాల్లో లభ్యమైంది. శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది ఉనికిని ఈ పరికరం గుర్తించి హెచ్చరికలు చేస్తుంది. ఉగ్రవాది దాక్కున్న ప్రాంతం వెలుపలి ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరికరాలు అఫ్గానిస్తాన్‌లో దశాబ్దాలపాటు తిష్టవేసిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు వాడినవేనని తెలిపారు. అనంతరం వీటిని తాలిబన్లు, ఇతర ఉగ్రసంస్థలు చేజిక్కించుకుని, కశ్మీర్ ఉగ్రవాదులకు అందజేసి ఉంటారని అధికారులు అంటున్నారు. అయితే, వీటిని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. శాటిలైట్ ఫోన్ జాడలను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో), డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ)లు ఎప్పటికప్పుడు కనిపెట్టే పనిలోనే ఉన్నాయన్నారు. అదేవిధంగా, థర్మల్ ఇమేజరీ పరికరాలను పనిచేయకుండా ఆపేందుకు భద్రతా బలగాలు జామర్లను ఉపయోగిస్తున్నాయని అన్నారు. వీటిని వినియోగించే వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. దేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కేంద్రం 2012లో పూర్తి నిషేధం విధించింది. -
జవాన్లకు కేంద్రం దీపావళి కానుక
న్యూఢిల్లీ: దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే సాయుధ, పారామిలటరీ బలగాలకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్ ఫోన్లు వాడుకున్నందుకు జవాన్లు ప్రతి నెలా చెల్లిస్తున్న రూ.500 చార్జీలను నేటి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఫోన్ల కాల్ చార్జీలను నిమిషానికి రూ.5 నుంచి రూ.1కి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. జవాన్లు తమ కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయం మాట్లాడటానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. తాజా నిర్ణయం వల్ల కేంద్రంపై రూ.3 నుంచి 4 కోట్ల భారం పడుతుందన్నారు. -
త్వరలో అద్భుత ఫోన్ అందుబాటులోకి..
న్యూఢిల్లీ: మనం కూడా శాటిలైట్ ఫోన్లతో మాట్లాడే రోజు మరెంతో దూరంలో లేదు. వీటి వినియోగంపై ఎటువంటి ఆంక్షలు లేవని, త్వరలోనే ఈ సేవలు మొదలవుతాయని టెలికం శాఖ మంత్రి మనోజ్‌సిన్హా తెలిపారు. ఎవరికి ఆసక్తి ఉంటే వారు ఇంటికి తీసుకోవచ్చన్నారు. అయితే అవసరమైన సందర్భంలో ఈ నెట్‌వర్క్‌ను భద్రతా సంస్థలు తనిఖీ చేస్తాయని చెప్పారు. -
జాలర్లకు శాటిలైట్ ఫోన్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి : కచ్చదీవుల సరిహద్దు సమస్యను అడ్డంపెట్టుకుని తమిళనాడు నుంచి చేపలవేటకు వెళ్లే తమిళ జాలర్లపై శ్రీలంక సముద్రతీర గస్తీదళాలు తరచూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. జాలర్ల పడవలను, వలలను ధ్వసం చేయడం, వేటాడి పట్టుకున్న జల సంపదను సముద్రంలో విసిరివేయడం, మత్స్యకారులను జైళ్లలోకి నెట్టడం శ్రీలంక దినచర్యలో భాగమైపోయింది. శ్రీలంక, తమిళనాడు మధ్య రగులుతున్న విధ్వేషాగ్నిని చల్లార్చే ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. పదేళ్లపాటు అధికారంలో ఉండిన యూపీఏ నాన్చుడు ధోరణిని అవలంభించింది. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై తమిళ జాలర్లు ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం కాళ్లావేళ్లా పడేకంటే తమకు తామే ఆత్మరక్షణ చర్యలు చేపట్టడం మేలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 13 సముద్రతీర జిల్లాలు లక్ష్యంగా మూడు దశల్లో కార్యక్రమాలను అమలుచేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయిలో ఎమర్జన్సీ సెల్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోలు రూములు, సహాయ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. 13 జిల్లాల్లో 439 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రమాద హెచ్చరికల కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి ఈ కంట్రోలు రూములను అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం 439 ప్రాంతాలను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతోందని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రాంతాల గుర్తింపు పూర్తయిన తరువాత కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేపల వేటకు వెళ్లే వారికి వైర్లెస్ శాటిలైట్ ఫోన్లను అందజేయనున్నామని చెప్పారు. సముద్రంలో జాలర్లు వెళ్లే దూరాన్ని బట్టి వారికిచ్చే శాటిలైట్ ఫోన్ల సిగ్నల్ సామర్థ్య ఉంటుందని అన్నారు. ఈ శాటిలైట్ ఫోన్ల వల్ల జాలర్లు ఏ ప్రాంతంలో ఉండేదీ తాము తెలుసుకోవచ్చని, వారిచ్చే సంకేతాల వల్ల సముద్రంలో తప్పిపోకుండా ఒడ్డుకు చేరుకునేలా ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రీలంక గస్తీదళాలు మత్స్యకారులపై సముద్రంలో విరుచుకుపడే సమయంలో వెంటనే శాటిలైట్ ఫోన్ల ద్వారా అధికారులకు తెలిపేందుకు వీటిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. -
తీవ్రవాదుల గురి!
రాజధాని నగరంపై పాకిస్తానీ ముష్కరులు గురి పెట్టారు. పలు చోట్ల పేలుళ్లు జరపడానికి కుట్ర పన్నారు. తమ ఏజెంట్‌ను పంపించి రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చిన ఐఎస్ఐ ఏజెంట్ జాకీర్ హుస్సేన్‌ను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి శాటిలైట్ ఫోన్లు, నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనతో నగరంలో నిఘాను పటిష్టం చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరం చెన్నై ప్రశాంతంగా ఉంటుంది. నిత్యం జనంతో కిక్కిరిసి ఉండే ఈ నగరాన్ని తీవ్ర వాదులు టార్గెట్ చేసినట్టు గతంలో సమాచారం అందింది. అప్పటి నుంచి పటిష్ట నిఘాతో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోనప్పటికీ, తరచూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజల్లో భయాందోళన పుట్టిస్తున్నారుు. ఇటీవల విద్యార్థుల ముసుగులతో తీవ్రవాదులు నక్కి ఉన్న సమాచారం అందింది. అదే సమయంలో అజ్ఞాత తీవ్రవాదులు పట్టుబడడంతో నగర భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఏకంగా ఐఎస్ఐ ఏజెంట్‌గా భావిస్తున్న జాకీర్ హుస్సేన్ నెలలో మూడు సార్లు శ్రీలంక నుంచి చెన్నైకు వచ్చి మరీ పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. అలర్ట్: రెండు రోజుల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్, క్యూ బ్రాంచ్ అలర్ట్ అయింది. నగర పోలీసు యంత్రాంగంలో చురుగ్గా ఉన్న కొందరు అధికారుల సహకారంతో ప్రత్యేక ఆపరేషన్‌కు క్యూబ్రాంచ్ వ్యూహ రచన చేసింది. మఫ్టీలో ఉన్న ఈ బృందాలు మన్నడి, పెరియ మేడు, ట్రిప్లికేన్ పరిసరాల్లో తిష్ట వేశాయి. ఆ పరిసరాల్లోని లాడ్జీలు, విడిది, మ్యాన్షన్లలో రహస్యంగా తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో శ్రీలంక నుంచి వచ్చిన జాకీర్ హుస్సేన్ మన్నడిలోని ఓ లాడ్జీలో దిగినట్టుగా కేంద్ర నిఘా వర్గాలు సమాచారం చేరవేశాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ మంగళవారం రాత్రి ఏడున్నర సమయంలో ఆరంభం అయింది. అతడు ఉన్న లాడ్జీ, పరిసరాల్లో మఫ్టీ సిబ్బంది తిష్ట వేశారు. అయితే, అతడు ఎలా ఉంటాడో తెలియక తికమక పడ్డారు. చివరకు సాహసం చేసి ఆ లాడ్జిలో అతడి వివరాలను రాబట్టారు. అదే సమయంలో అతడు ఆ లాడ్జి నుంచి ఆటోలో బయలు దే రడాన్ని అక్కడి సిబ్బంది గుర్తించి, మఫ్టీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడిని ఆటోల్లో వెంబడించారు. ట్రిప్లికేన్‌లో ఆటో దిగగానే, అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ: రాత్రంతా అతడిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరిపారు. అతడి నుంచి చెన్నై, బెంగళూరు మ్యాప్‌లు, శాటిలైట్ ఫోన్లు, నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తాను శ్రీలంకలోని కండిగైకు చెందిన వ్యక్తినని, పాకిస్తాన్‌లోని కొందరు సహకారంతో, సూచనల మేరకు ఇక్కడికి వచ్చి వెళుతున్నట్లు తేలిందని సమాచారం. నెలలో మూడు సార్లు చొప్పున ఇక్కడికి అతడు పర్యాటక వీసా మీద వచ్చినట్టు తేలింది. జెమిని వంతెన, అమెరికా దౌత్య కార్యాలయం పరిసరాల్లో ఎక్కువగా తిరిగినట్టు, పేలుళ్లే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నట్లు అతడు పేర్కొనడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. నెలలో మూడు సార్లు ఇక్కడికి వచ్చి వెళుతున్న దృష్ట్యా, ఇక్కడి యువతను పాకిస్తాన్‌కు తరలించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతడి వెనకు అదృశ్య శక్తులు ఇక్కడ తిష్ట వేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సముద్ర మార్గం గుండానే శ్రీలంక మీదుగా భారత్‌లోకి తీవ్రవాదులు చొరబడుతున్నట్లు జాకీర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోఎ ఆ మార్గాన తీవ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడ్డారా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ ఇంటిని సైతం అద్దెకు తీసుకునేందుకు జాకీర్ ఏర్పాట్లు చేసి ఉండటం బట్టి చూస్తే, అందరినీ ఒక చోట చేర్చి దాడులకు సిద్ధం చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతోన్నాయి. దీంతో విచారణను మరింత వేగవంతం చేయడానికి క్యూబ్రాంచ్ సిద్ధం అవుతోంది. రిమాండ్ : జాకీర్ హుస్సేన్‌పై 120, 480 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉదయాన్నే ఎగ్మూర్ కోర్టు మేజిస్ట్రేట్ శివ సుబ్రమణ్యం ఎదుట హాజరు పరిచారు. అతడిని పదిహేను రోజుల రిమాండ్ నిమిత్తం పుళ ల్ జైలుకు తరలించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న శాటిలైట్స్ ఫోన్లలో కోడ్ సంకేతాలను సూచిస్తూ, అనేక సమాచారాలు వచ్చి ఉండటం, మరి కొన్ని కోడ్ సమాచారాలను ఇక్కడి నుంచి జాకీర్ పంపించి ఉండటం వెలుగు చూసింది. ఆ కోడ్ భాష ఏమిటో పసిగట్టడంతోపాటుగా రాష్ట్రంలో మరెక్కడైనా పాకిస్తానీ ముష్కరులు తిష్ట వేసి ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరిపేందుకు క్యూబ్రాంచ్ కసరత్తుల్లో పడింది. తమ కస్టడీకి అతడ్ని తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత రహస్యంగా ఆపరేషన్‌ను విజయవంతం చేసి, అన్ని వివరాలను, జాకీర్ హుస్సేన్ ఫొటోను సైతం గోప్యంగా క్యూ బ్రాంచ్ ఉంచడం గమనించాల్సిందే.