చెన్నై, సాక్షి ప్రతినిధి : కచ్చదీవుల సరిహద్దు సమస్యను అడ్డంపెట్టుకుని తమిళనాడు నుంచి చేపలవేటకు వెళ్లే తమిళ జాలర్లపై శ్రీలంక సముద్రతీర గస్తీదళాలు తరచూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. జాలర్ల పడవలను, వలలను ధ్వసం చేయడం, వేటాడి పట్టుకున్న జల సంపదను సముద్రంలో విసిరివేయడం, మత్స్యకారులను జైళ్లలోకి నెట్టడం శ్రీలంక దినచర్యలో భాగమైపోయింది. శ్రీలంక, తమిళనాడు మధ్య రగులుతున్న విధ్వేషాగ్నిని చల్లార్చే ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. పదేళ్లపాటు అధికారంలో ఉండిన యూపీఏ నాన్చుడు ధోరణిని అవలంభించింది. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై తమిళ జాలర్లు ఆశలు పెట్టుకున్నారు.
కేంద్రం కాళ్లావేళ్లా పడేకంటే తమకు తామే ఆత్మరక్షణ చర్యలు చేపట్టడం మేలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 13 సముద్రతీర జిల్లాలు లక్ష్యంగా మూడు దశల్లో కార్యక్రమాలను అమలుచేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయిలో ఎమర్జన్సీ సెల్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోలు రూములు, సహాయ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. 13 జిల్లాల్లో 439 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రమాద హెచ్చరికల కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి ఈ కంట్రోలు రూములను అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం 439 ప్రాంతాలను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతోందని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ప్రాంతాల గుర్తింపు పూర్తయిన తరువాత కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేపల వేటకు వెళ్లే వారికి వైర్‌లెస్ శాటిలైట్ ఫోన్లను అందజేయనున్నామని చెప్పారు. సముద్రంలో జాలర్లు వెళ్లే దూరాన్ని బట్టి వారికిచ్చే శాటిలైట్ ఫోన్ల సిగ్నల్ సామర్థ్య ఉంటుందని అన్నారు. ఈ శాటిలైట్ ఫోన్ల వల్ల జాలర్లు ఏ ప్రాంతంలో ఉండేదీ తాము తెలుసుకోవచ్చని, వారిచ్చే సంకేతాల వల్ల సముద్రంలో తప్పిపోకుండా ఒడ్డుకు చేరుకునేలా ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రీలంక గస్తీదళాలు మత్స్యకారులపై సముద్రంలో విరుచుకుపడే సమయంలో వెంటనే శాటిలైట్ ఫోన్ల ద్వారా అధికారులకు తెలిపేందుకు వీటిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
జాలర్లకు శాటిలైట్ ఫోన్లు
Published Sat, Aug 23 2014 12:10 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement