32 మందిని పట్టుకెళ్లిన లంక సేన
జగదాపట్నం జాలర్లలో ఆందోళన
సాక్షి, చెన్నై:
రెండో విడత చర్చల తేదీ ప్రకటించి కొన్ని గంట లైనా కాక ముందే 32 మంది తమిళ జాలర్లపై వీరంగం చేసిన శ్రీలంక నావికాదళం వారిని పట్టుకెళ్లింది. ఈ ఘటనతో పుదుకోట్టై జిల్లా జగదాపట్నం జాలర్లు తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర జాలర్లపై శ్రీలంక సేనల దాడులకు ముగింపు పలికే రీతిలో రెండు దేశాల జాలర్లు, అధికారులతో చర్చలకు ఏర్పాట్లు చేశారు. తొలి విడత చర్చ చెన్నైలో జరగ్గా, మలి విడత చర్చకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈనెల 13న కొలంబో వేదికగా చర్చలు జరగబోతున్నట్టు సోమవారం ప్రకటించారు. దీంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చర్చలతో తమ సమస్య ఓ కొలిక్కి వస్తుంద న్న ఆశలో పడ్డారు. అయితే, చర్చల తేదీని అటు ప్రకటించారో లేదో ఇటు 32 మంది జాలర్లను బంధీలుగా లంక సేనలు పట్టుకెళ్లడం ఆగ్రహం కలిగిస్తోంది.
మళ్లీ బంధీ:పుదుకోట్టైజిల్లా జగదాపట్నానికి చెందిన జాలర్లు సోమవారం రాత్రి
చేపల వేటకు కడలిలోకి వెళ్లారు. 30 పడవలు సముద్రంలోకి వెళ్లాయి. కడలిలో వేటలో ఉన్న వీరిపై అర్ధరాత్రి వేళ లంక నావికాదళం విరుచుకు పడింది. తమ సరిహద్దుల్లోకి వచ్చారంటూ చుట్టు ముట్టే యత్నం చేసింది. కొన్ని పడవలు వారి దాడి నుంచి తప్పించుకుని ఒడ్డుకు తిరుగు ముఖం పట్టాయి. అయితే, ఎనిమిది పడవలను పూర్తిగా లంక సేనలు చుట్టుముట్టారుు. అందులో ఉన్న జాలర్లను చితక బాదడంతో పాటుగా, వాళ్లు పట్టిన చేపలను సముద్రంలో పడేశారు.
ఆ పడవల్లో ఉన్న 32 మందిని బంధీలుగా తమ దేశానికి పట్టుకెళ్లారు. వీరిలో జగదాపట్నానికి చెందిన వీరసు, వీరకుమార్, సుబ్రమణ్యన్, వివేక్, శివ పెరుమాల్, మురుగన్, మారియప్పన్, బాబు, గణేషన్ తదితరులు ఉన్నారు. వీరిని అక్కడి జైళ్లో బంధించి ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీలంక మత్స్య శాఖ అధికారి నరేంద్ర రాజపక్సే భారత కోస్టుగార్డు అధికారులకు చేరవేశారు. హద్దులు దాటి తమ దేశ సరిహద్దుల్లోకి చొరబడటం వల్లే వీరందర్నీ అరెస్టు చేశామని నరేంద్ర రాజపక్సే పేర్కొన్నారు. అయితే, భారత సరిహద్దుల్లో తాము వేటలో ఉన్నామని, సరిహద్దు దాటి వచ్చి మరీ పడవలను, అందులో ఉన్న వాళ్లను బలవంతంగా శ్రీలంక సేనలు పట్టుకెళ్లారంటూ మిగిలిన జాలర్లు పేర్కొనడం గమనార్హం.
మళ్లీ వీరంగం
Published Wed, Mar 5 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement