tamil fishermens
-
ఉరి నుంచి విముక్తి
తమిళనాడు ప్రజల నుంచి భారతీయ జనతా పార్టీ మంచి మార్కులే కొట్టేసింది. ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు యావత్తూ జేజేలు పలుకుతోంది. శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధించిన ఐదుగురు తమిళ జాలర్లలకు ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే విముక్తి ప్రసాదించడమే ఇందుకు కారణం. * జాలర్ల ఉరిశిక్ష రద్దు * శ్రీలంక మంత్రి వెల్లడి * రాష్ట్రంలో హర్షాతిరేకాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యల్లో శ్రీలంక, తమిళ జాలర్ల మధ్య నడుస్తున్న వివాదం ప్రధానమైనది. తమిళ జాలర్లకు కష్టం కలిగినపుడు కేవలం జాలర్ల కుటుంబాలేగాక రాష్ట్రం యావత్తూ తీవ్రంగా స్పందిస్తోంది. రాజ కీయ పార్టీలన్నీ ఏకమవుతాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన హయాంలో కేంద్రంతో ఉత్తరాల యుద్ధమే నడిపారు. తమిళనాడులో బీజేపీ జరిపిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మత్స్యకారుల సమస్యను ప్రధాన అస్త్రంగా ఎం చుకున్నారు. తాము అధికారంలోకి వస్తే జాలర్ల సమస్యకు శాశ్వత ముగింపు ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే పాత సమస్యల మాట అటుం చి ఐదుగురు తమిళజాలర్లకు ఉరిశిక్ష విధింపుతో కేంద్రానికి సరికొత్త చిక్కు వచ్చిపడింది. రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపం తంగచ్చిమండపానికి చెందిన ఎనిమిది మంది జాలర్లు హరాయిన్ మత్తుపదార్థాలను చేరవేస్తున్నారంటూ 2011 నవంబర్ 28న శ్రీలంక గస్తీదళాలు అరెస్ట్ చేశాయి. కేసు వాదోపవాదాల నేపథ్యంలో35 నెలలుగా 8 మంది జాలర్లు శ్రీలంక జైలులోనే మగ్గుతున్నారు. పట్టుబడిన 8 మంది తమిళ జాలర్లలో అగస్టస్, ఎవర్సన్, లింగ్లెట్, ప్రసాద్, విల్సన్ ఉన్నారు. ఈ మత్స్యకారులకు ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30వ తేదీన శ్రీలంక కోర్టు తీర్పుచెప్పింది. ఈనెల 14వ తేదీలోగా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. దీనిపై ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రెండుసార్లు ప్రధానికి ఉత్తరాలు రాశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం రాష్ట్రంలోని పరిస్థితి తీవ్రతను విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని ప్రధాని గుర్తుచేసుకున్నారో ఏమో వెంటనే స్పందించారు. శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయా న్ని యుద్ధప్రాతిపదికన పురమాయించారు. ఉరిశిక్షపై శ్రీలంక హైకోర్టులో అప్పీలు వేయిం చారు. అంతేగాక శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 9వ తేదీన టెలిఫోన్ ద్వారా సంభాషించారు. అప్పటి చర్చల ఫలితంగా ఐదుగురు జాలర్లను భారత దేశానికి తరలించేందుకు రాజపక్సే అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు తమిళ జాలర్ల ఉరిశిక్షను రాజపక్సే రద్దుచేసినట్లు శ్రీలంక మంత్రి సెంథిల్ తొండమాన్ శుక్రవారం ప్రకటించారు. ఉరిశిక్షపై భారత రాయబార కార్యాలయం శ్రీలంక హై కోర్టులో దాఖలు చేసిన అప్పీలు కేసును ఉపసంహరించుకోగానే ఉరిశిక్ష రద్దు ఆదేశాలు అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈరాన్ నుంచి ఐదుగురు విడుదల: తమ సరిహద్దులో చేపలవేట సాగిస్తున్నారని ఆరోపిస్తూ కన్యాకుమారి జిల్లాకు చెందిన ఐదుగురు జాలర్లను ఈరాన్ దేశం అరెస్ట్ చేసింది. శ్రీలంకలో ఉరిశిక్ష పడిన ఐదుగురు జాలర్లు విడుదల కానున్న పక్షంలో ఈరాన్ సైతం తమ ఆధీనంలో ఉన్న ఐదుగురు జాలర్లను విడుదల చేసింది. ఈరాన్ చెరలో 55 రోజులు గడిపిన జాలర్లు త్వరలో తమిళనాడుకు చేరనున్నారు. హర్షం తమిళ జాలర్లకు ఉరిశిక్ష పడిన వార్త వెలువడగానే అట్టుడికిపోయిన రాజకీయ పార్టీలు శుక్రవారం హర్షం ప్రకటించాయి. ఉరిశిక్ష రద్దు వార్తతో మనస్సులో ప్రశాంతత ఏర్పడిందని కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ చెప్పారు. తమిళనాడు ప్రజల వేడుకోలును ప్రధాని మోదీ మన్నించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని డీఎంకే అధినేత కరుణానిధి అన్నారు. -
జాలర్లకు శాటిలైట్ ఫోన్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి : కచ్చదీవుల సరిహద్దు సమస్యను అడ్డంపెట్టుకుని తమిళనాడు నుంచి చేపలవేటకు వెళ్లే తమిళ జాలర్లపై శ్రీలంక సముద్రతీర గస్తీదళాలు తరచూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. జాలర్ల పడవలను, వలలను ధ్వసం చేయడం, వేటాడి పట్టుకున్న జల సంపదను సముద్రంలో విసిరివేయడం, మత్స్యకారులను జైళ్లలోకి నెట్టడం శ్రీలంక దినచర్యలో భాగమైపోయింది. శ్రీలంక, తమిళనాడు మధ్య రగులుతున్న విధ్వేషాగ్నిని చల్లార్చే ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. పదేళ్లపాటు అధికారంలో ఉండిన యూపీఏ నాన్చుడు ధోరణిని అవలంభించింది. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై తమిళ జాలర్లు ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం కాళ్లావేళ్లా పడేకంటే తమకు తామే ఆత్మరక్షణ చర్యలు చేపట్టడం మేలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని 13 సముద్రతీర జిల్లాలు లక్ష్యంగా మూడు దశల్లో కార్యక్రమాలను అమలుచేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయిలో ఎమర్జన్సీ సెల్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోలు రూములు, సహాయ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. 13 జిల్లాల్లో 439 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రమాద హెచ్చరికల కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి ఈ కంట్రోలు రూములను అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం 439 ప్రాంతాలను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతోందని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రాంతాల గుర్తింపు పూర్తయిన తరువాత కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేపల వేటకు వెళ్లే వారికి వైర్లెస్ శాటిలైట్ ఫోన్లను అందజేయనున్నామని చెప్పారు. సముద్రంలో జాలర్లు వెళ్లే దూరాన్ని బట్టి వారికిచ్చే శాటిలైట్ ఫోన్ల సిగ్నల్ సామర్థ్య ఉంటుందని అన్నారు. ఈ శాటిలైట్ ఫోన్ల వల్ల జాలర్లు ఏ ప్రాంతంలో ఉండేదీ తాము తెలుసుకోవచ్చని, వారిచ్చే సంకేతాల వల్ల సముద్రంలో తప్పిపోకుండా ఒడ్డుకు చేరుకునేలా ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రీలంక గస్తీదళాలు మత్స్యకారులపై సముద్రంలో విరుచుకుపడే సమయంలో వెంటనే శాటిలైట్ ఫోన్ల ద్వారా అధికారులకు తెలిపేందుకు వీటిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. -
మళ్లీ వీరంగం
32 మందిని పట్టుకెళ్లిన లంక సేన జగదాపట్నం జాలర్లలో ఆందోళన సాక్షి, చెన్నై: రెండో విడత చర్చల తేదీ ప్రకటించి కొన్ని గంట లైనా కాక ముందే 32 మంది తమిళ జాలర్లపై వీరంగం చేసిన శ్రీలంక నావికాదళం వారిని పట్టుకెళ్లింది. ఈ ఘటనతో పుదుకోట్టై జిల్లా జగదాపట్నం జాలర్లు తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర జాలర్లపై శ్రీలంక సేనల దాడులకు ముగింపు పలికే రీతిలో రెండు దేశాల జాలర్లు, అధికారులతో చర్చలకు ఏర్పాట్లు చేశారు. తొలి విడత చర్చ చెన్నైలో జరగ్గా, మలి విడత చర్చకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈనెల 13న కొలంబో వేదికగా చర్చలు జరగబోతున్నట్టు సోమవారం ప్రకటించారు. దీంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చర్చలతో తమ సమస్య ఓ కొలిక్కి వస్తుంద న్న ఆశలో పడ్డారు. అయితే, చర్చల తేదీని అటు ప్రకటించారో లేదో ఇటు 32 మంది జాలర్లను బంధీలుగా లంక సేనలు పట్టుకెళ్లడం ఆగ్రహం కలిగిస్తోంది. మళ్లీ బంధీ:పుదుకోట్టైజిల్లా జగదాపట్నానికి చెందిన జాలర్లు సోమవారం రాత్రి చేపల వేటకు కడలిలోకి వెళ్లారు. 30 పడవలు సముద్రంలోకి వెళ్లాయి. కడలిలో వేటలో ఉన్న వీరిపై అర్ధరాత్రి వేళ లంక నావికాదళం విరుచుకు పడింది. తమ సరిహద్దుల్లోకి వచ్చారంటూ చుట్టు ముట్టే యత్నం చేసింది. కొన్ని పడవలు వారి దాడి నుంచి తప్పించుకుని ఒడ్డుకు తిరుగు ముఖం పట్టాయి. అయితే, ఎనిమిది పడవలను పూర్తిగా లంక సేనలు చుట్టుముట్టారుు. అందులో ఉన్న జాలర్లను చితక బాదడంతో పాటుగా, వాళ్లు పట్టిన చేపలను సముద్రంలో పడేశారు. ఆ పడవల్లో ఉన్న 32 మందిని బంధీలుగా తమ దేశానికి పట్టుకెళ్లారు. వీరిలో జగదాపట్నానికి చెందిన వీరసు, వీరకుమార్, సుబ్రమణ్యన్, వివేక్, శివ పెరుమాల్, మురుగన్, మారియప్పన్, బాబు, గణేషన్ తదితరులు ఉన్నారు. వీరిని అక్కడి జైళ్లో బంధించి ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీలంక మత్స్య శాఖ అధికారి నరేంద్ర రాజపక్సే భారత కోస్టుగార్డు అధికారులకు చేరవేశారు. హద్దులు దాటి తమ దేశ సరిహద్దుల్లోకి చొరబడటం వల్లే వీరందర్నీ అరెస్టు చేశామని నరేంద్ర రాజపక్సే పేర్కొన్నారు. అయితే, భారత సరిహద్దుల్లో తాము వేటలో ఉన్నామని, సరిహద్దు దాటి వచ్చి మరీ పడవలను, అందులో ఉన్న వాళ్లను బలవంతంగా శ్రీలంక సేనలు పట్టుకెళ్లారంటూ మిగిలిన జాలర్లు పేర్కొనడం గమనార్హం. -
అన్నా సాలైలో ఉద్రిక్తత
తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వాన్ని నిరసిస్తూ గురువారం బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. అన్నాసాలైలో రోడ్డుపై వలలు విసిరి చేపల్ని వేటాడుతూ, శ్రీలంక సేనల తీరును నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ నిరసనతో అన్నా సాలైలో ఉద్రిక్తత నెలకొనడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ విరుచుకు పడుతోంది. జాలర్లను పట్టుకెళ్లి శ్రీలంక చెరలో బందిస్తోంది. సుమారు 300 మంది జాలర్ల వరకు ఆ దేశ చెరల్లో మగ్గుతున్నారు. ఆ కుటుంబాలు తీవ్ర మనో వేదనలో ఉన్నాయి. వీరి విడుదలకు డిమాండ్ చేస్తూ, నాగపట్నం, రామేశ్వరం, వేధారణ్యం, కారైక్కాల్ జాలర్లు ఆందోళన బాట పట్టారు. వీరికి మద్దతుగా రాజకీయ పక్షాలు గళం విప్పుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలో వినూత్న నిరసనకు పిలుపు నిచ్చారు. చేపల వేట: గురువారం ఉదయాన్నే ఓ మినీ లారీలో అతి చిన్న పడవను ఎక్కించుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అన్నా సాలైకు చేరుకున్నారు. ఆ పార్టీ నాయకుడు సతీష్ కుమార్, కొరట్టూరు మోహన్ నేతృత్వంలో వలల్ని చేత బట్టి మరో బృందం అక్కడికి చేరుకుంది. అన్నా సాలైలోని దివంగత నేత అన్నా విగ్రహం వద్ద ఆందోళన కారులు కాసేపు బైఠాయించారు. అనంతరం చేతిలో ఉన్న వలల్ని రోడ్డుపై విసిరి చేపల వేటకు సిద్ధం అయ్యారు. వలలో పడ్డ చిన్న పెద్ద చేపల్ని చేత బట్టి శ్రీలంక సేనలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. జాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాలర్లపై దాడుల పరంపర కొనసాగుతూ ఉన్నా కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని శివాలెత్తారు. ఈ నిరసనతో అన్నా సాలైలో కాసేపు రాకపోకలు నిలిచిపోయూరుు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన కారుల్ని బుజ్జగించే యత్నం చేశారు. తగ్గేది లేదన్నట్టుగా నిరసన కారులు చేపల్ని చేత బట్టి ర్యాలీగా ముందుకు కదిలారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఉద్రిక్తత నెలకొనడంతో చివరకు బలవంతంగా అందర్నీ అరెస్టు చేశారు.