తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వాన్ని నిరసిస్తూ గురువారం బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. అన్నాసాలైలో రోడ్డుపై వలలు విసిరి చేపల్ని వేటాడుతూ, శ్రీలంక సేనల తీరును నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ నిరసనతో అన్నా సాలైలో ఉద్రిక్తత నెలకొనడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
సాక్షి, చెన్నై:
రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ విరుచుకు పడుతోంది. జాలర్లను పట్టుకెళ్లి శ్రీలంక చెరలో బందిస్తోంది. సుమారు 300 మంది జాలర్ల వరకు ఆ దేశ చెరల్లో మగ్గుతున్నారు. ఆ కుటుంబాలు తీవ్ర మనో వేదనలో ఉన్నాయి. వీరి విడుదలకు డిమాండ్ చేస్తూ, నాగపట్నం, రామేశ్వరం, వేధారణ్యం, కారైక్కాల్ జాలర్లు ఆందోళన బాట పట్టారు. వీరికి మద్దతుగా రాజకీయ పక్షాలు గళం విప్పుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలో వినూత్న నిరసనకు పిలుపు నిచ్చారు.
చేపల వేట: గురువారం ఉదయాన్నే ఓ మినీ లారీలో అతి చిన్న పడవను ఎక్కించుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అన్నా సాలైకు చేరుకున్నారు. ఆ పార్టీ నాయకుడు సతీష్ కుమార్, కొరట్టూరు మోహన్ నేతృత్వంలో వలల్ని చేత బట్టి మరో బృందం అక్కడికి చేరుకుంది. అన్నా సాలైలోని దివంగత నేత అన్నా విగ్రహం వద్ద ఆందోళన కారులు కాసేపు బైఠాయించారు. అనంతరం చేతిలో ఉన్న వలల్ని రోడ్డుపై విసిరి చేపల వేటకు సిద్ధం అయ్యారు. వలలో పడ్డ చిన్న పెద్ద చేపల్ని చేత బట్టి శ్రీలంక సేనలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. జాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాలర్లపై దాడుల పరంపర కొనసాగుతూ ఉన్నా కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని శివాలెత్తారు. ఈ నిరసనతో అన్నా సాలైలో కాసేపు రాకపోకలు నిలిచిపోయూరుు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన కారుల్ని బుజ్జగించే యత్నం చేశారు. తగ్గేది లేదన్నట్టుగా నిరసన కారులు చేపల్ని చేత బట్టి ర్యాలీగా ముందుకు కదిలారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఉద్రిక్తత నెలకొనడంతో చివరకు బలవంతంగా అందర్నీ అరెస్టు చేశారు.
అన్నా సాలైలో ఉద్రిక్తత
Published Fri, Dec 20 2013 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement