
కోయంబత్తూర్/కొచ్చి: భారతీయ నేవీలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు తమిళనాడులోకి చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ప్రారంభించిన నిఘా రెండో రోజూ కొనసాగింది. ‘ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమా చారం మేరకు నేవీ.. సముద్రాలు, తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ను విధించింది’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు శ్రీలం క నుంచి సముద్ర మార్గం ద్వారా రాష్ట్రంలోకి చొర బడి వివిధ నగరాలకు వెళ్లినట్లు సమాచారం అందడంతో తమిళనాడులో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలిపే రోడ్లు, రహదారుల్లో వెళ్లే వాహనాలను ఆర్మీ బలగాలు నిశితంగా తనిఖీలు చేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పా రు.
గుజరాత్ తీరంలో పాక్ పడవలు
గుజరాత్‌లోని కచ్ జిల్లాకు సమీపంలో గల హరామి నాలా ప్రాంతంలో పాక్‌కు చెందిన 2 మత్స్యకారుల పడవలను సరిహద్దు భద్రతాసిబ్బంది శనివారం గుర్తించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు.