బంగ్లాదేశ్‌లో ఎవరి ప్రయోజనాలేంటి? | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో ఎవరి ప్రయోజనాలేంటి?

Published Sat, Jul 1 2023 12:42 AM

Beneath symbolism and praises, Bangladeshs ties with U S - Sakshi

బంగ్లాదేశ్‌ను అస్థిరంగా ఉంచాలని అమెరికా చూస్తుంది. ఈ పరిస్థితి తన తూర్పు రాష్ట్రాల్లోకి లక్షలాది మంది వలసలకు కారణం అవుతుంది కాబట్టి దాన్ని భారత్‌ నిరోధించడానికి ప్రయత్నిస్తుంది. చైనాకు సంబంధించినంతవరకూ, ఢిల్లీ హసీనాను ఒత్తిడి చేస్తుంది. కానీ ఆమె అధికారాన్ని నిలుపు కోవడంలో సహాయపడుతుంది.

మరోవైపు, హసీనా వరుసగా నాలుగోసారి గెలుపొందే విషయం పట్ల అమెరికా ఉత్సాహంగా లేదు. బలమైన దేశీయ మద్దతు ఉన్న నాయకులు అమెరికా ఆదేశాలను తిప్పికొట్టడం దానికి కారణం. అమెరికాలాగా భారత్‌ కూడా, చైనా వ్యతిరేక శిబిరంలో బంగ్లాదేశ్‌ ఉండాలని కోరుకుంటోంది. అయితే బంగాళాఖాతంలో స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అమెరికాతో ఢిల్లీ ఎంత దూరం వెళ్తుందనేది అనిశ్చితం.  

1975లో తమ వ్యవస్థాపక అధ్యక్షుడు షేఖ్‌ ముజీబుర్‌ రహమాన్‌ హత్య వెనుక అమెరికా హస్తం ఉందని బంగ్లాదేశ్‌లోని చాలామంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ముజీబుర్‌ రహమాన్‌ను పడగొట్టిన సైనిక తిరుగుబాటులో వాషింగ్టన్‌ పాత్ర పోషించిందా లేదా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఈ దక్షిణాసియా దేశ తొలి సైనిక పాలకుడు జనరల్‌ జియావుర్‌ రహమాన్‌కు అమెరికా మద్దతునిచ్చింది. 

ఇప్పుడు, దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, హత్యకు గురైన అధ్యక్షుడి కుమార్తె, ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా, అమెరికా తనను పడగొట్టి తన ప్రత్యర్థి, మాజీ ప్రధాని, జియావుర్‌ రహమాన్‌ వితంతువు అయిన ఖలీదా జియాను అధికారంలోకి తేవాలనుకుంటోందని ఆరోపిస్తున్నారు. ‘‘అమెరికన్లు నేను అధికారంలో కొనసాగాలను కోవడం లేదు,’’ అని ఆమె ఇటీవల ‘బీబీసీ’తో అన్నారు. ఇంకా దారు ణంగా, ఆమె ఏప్రిల్‌లో పార్లమెంటులో మాట్లాడుతూ, ‘‘ఎటువంటి ప్రజాస్వామ్య ఉనికిని కలిగి ఉండని ప్రభుత్వాన్ని ఇక్కడ తేవాలని అమెరికా భావిస్తోంది’’ అని ఆమె ఆరోపించారు.

గత సంవత్సరం, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై వాషింగ్టన్, హసీనా ప్రభుత్వంలోని పలువురు అధికారులపై, భద్రతా దళాలపై ఆంక్షలు విధించింది. కానీ బంగ్లాదేశ్‌లో తమ అనుకూల సైనిక పాలనా కాలంలో, సరైన విచారణ లేకుండానే వందలాదిమంది తిరుగుబాటు సైనికులను ఉరితీసినప్పుడు మాత్రం ఇలాంటి చర్య లను అమెరికా చేపట్టలేదు. ఇటీవలే, రాబోయే జాతీయ ఎన్నికలను మలినపర్చడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటివారిని దేశంలో అడుగుపెట్టకుండా తిరస్కరిస్తానని అమెరికా బెదిరించింది.

ఇలాంటి బెదిరింపులు బంగ్లాదేశ్‌లో కనీవినీ ఎరుగని రాజకీయ సుడిగుండాన్ని సృష్టించాయి. ఇది రాడికల్‌ ఇస్లామిక్‌ సంస్థలతో సహా అనేక శక్తులను నిద్రాణస్థితి నుండి బయటకు లాగి, దాదాపు 16.5 కోట్లమంది బెంగాలీలు గల దేశాన్ని కేవలం ఒక దశాబ్దం క్రితం కొత్త అఫ్గానిస్తాన్‌గా మార్చివేసింది. అయితే, చట్టవిరుద్ధమైన వ్యూహాలను ఉపయోగించినప్పటికీ, వాషింగ్టన్, ఢిల్లీ నుండి ఆమోదం పొందిన తర్వాత హసీనా వారిని దాదాపుగా అణచివేశారు. హసీనాపై అమెరికా ఆరోపిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల మూలాలు, తీవ్రవాద మతశక్తులపై ఆమె సాగించిన అణిచివేతలో దాగి ఉన్నాయి. వాస్త వానికి, ఆమె మరింత విస్తృతమైన వల వేశారు. అదేక్రమంలో తన రాజకీయ ప్రత్యర్థులను కూడా తుడిచిపెట్టారు.

1971 వరకు బంగ్లాదేశ్‌ భాగమై ఉన్న పాకిస్తాన్‌ లో సైనిక నియంతలకు మద్దతు ఇచ్చిన అమెరికా, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే పేరుతో హసీనాపై ఇప్పుడు లాఠీని ప్రయోగిస్తోంది. ఢాకాలో ఈ సిద్ధాంతం చెల్లుబాటవడం కష్టమే. వాషింగ్టన్‌ ప్రజాస్వామ్య చర్చ తమను మభ్యపెట్టడానికేననీ, దానిలో వారి సొంత ప్రయోజనాలు దాగి ఉన్నాయనీ బంగ్లాదేశీయులు భావిస్తున్నారు.

నిజానికి, చైనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో హసీనాను తమవైపు తిప్పుకోవడమే అమెరికా అసలు లక్ష్యం. చైనా ప్రపంచ శక్తిగా ఎదగడం, మరింత ప్రభావం కోసం బీజింగ్‌ వ్యక్తపరుస్తున్న ఆకాంక్షను భగ్నం చేయడానికి అమెరికా యత్నిస్తోంది. బంగాళా ఖాతం సమీపంలో దాని స్థానం కారణంగా బంగ్లాదేశ్‌ వ్యూహాత్మకంగా మారింది. బంగాళాఖాతంలోని బంగ్లాదేశ్‌ ద్వీపంలో అమెరికా తమ నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఇద్దరు వామపక్ష పార్లమెంటు సభ్యులు ఇటీవల పేర్కొన్నారు.

ఇటువంటి స్థావరం వల్ల ఐరోపా, మధ్యప్రాచ్య దేశాలకు చైనా సముద్ర వాణిజ్య మార్గాన్ని అమెరికా సులభంగా నిరోధిస్తుంది. అది చైనా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే వాషింగ్టన్‌ కు అలాంటి ఆలోచనే లేదని ఢాకా లోని అమెరికా రాయబార కార్యాలయం నిర్ద్వంద్వంగా ఖండించింది. అమెరికాలాగా భారత్‌ కూడా, చైనా వ్యతిరేక శిబిరంలో బంగ్లా దేశ్‌ ఉండాలని కోరుకుంటోంది.

అయితే వాషింగ్టన్‌ నిజంగానేబంగాళాఖాతంలో స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అమెరికాతో ఢిల్లీ ఎంత దూరం వెళ్తుందనేది అనిశ్చితం. దాని పెరట్లో అమెరికా సైనిక స్థావరం ఉండటం ఇష్టపడదు. హసీనా విషయానికి వస్తే, ఆమె భారత్, అమెరికాల ఒత్తిడికి తలొగ్గి, ‘పెద్దన్నలను’ తృప్తిపరచడానికి బీజింగ్‌కు సురక్షితమైన దూరంలో ఉండవచ్చు.

బెంగాలీలు ఒక సమూహంగా ఏదైనా సైనిక కూటమిలో చేర డాన్ని వ్యతిరేకిస్తున్నారు. భారత్‌ లేదా అమెరికా బంగ్లాదేశ్‌ వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి తగినంత డబ్బు ఇవ్వలేవు. ఈ పరిస్థి తుల్లో చైనా రక్షకుడిగా కనిపిస్తోంది. అత్యంత విభేదాలతో ఉండే బంగ్లాదేశీయులు అందరూ అంగీకరించే విషయం ఏదైనా ఉందంటే, అది ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే. కాబట్టి దేశాన్ని ఎవరు పాలించినా, చైనాతో బంగ్లాదేశ్‌ బలమైన బంధం కొనసాగే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్‌లో భారత ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా ఉంటాయి. భారతదేశ ప్రధాన లక్ష్యం దాని తూర్పు పార్శ్వంలో భద్రత. హసీనా దశాబ్దాలుగా దీనికి సహాయం చేశారు. బంగ్లాదేశ్‌ రాజకీయ దృశ్యంలో అన్ని పువ్వులు వికసించడాన్ని అమె రికా చూడాలనుకోవచ్చు. కానీ ఇస్లామిక్‌ రాడికల్స్‌ పట్ల భారత్‌కు కని కరం లేదు. ఖలీదా జియాపై న్యూఢిల్లీ అవిశ్వాసంతో వ్యవహరిస్తుంది. బంగ్లా దేశ్‌ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఢిల్లీ చేసిన ఫిర్యాదులను తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖలీదా జియా తోసిపుచ్చి భారత్‌కు ఆగ్రహం తెప్పించారు. 

బంగ్లాదేశ్‌ను అస్థిరంగా ఉంచాలని అమెరికా చూస్తుంది. అయితే ఈ పరిస్థితి తన తూర్పు రాష్ట్రాల్లోకి లక్షలాది మంది వలసలకు కారణం అవుతుంది కాబట్టి దాన్ని భారత్‌ నిరోధించడానికి ప్రయ త్నిస్తుంది. చైనాకు సంబంధించినంతవరకూ, ఢిల్లీ హసీనాను ఒత్తిడి చేస్తుంది. కానీ ఆమె అధికారాన్ని నిలుపుకోవడంలో సహాయపడు
తుంది. మరోవైపు, ఈ ఏడాది ఎన్నికల్లో హసీనా వరుసగా నాలుగో సారి గెలుపొందే విషయం పట్ల అమెరికా ఉత్సాహంగా లేదు. బల మైన దేశీయ మద్దతు ఉన్న నాయకులు అమెరికా ఆదేశాలను తిప్పి కొట్టడం దానికి కారణం.

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, హంగరీకి చెందిన విక్టర్‌ ఓర్బన్‌ దీనికి  ఉదాహరణలు. కాబట్టి దాని వినాశ కరమైన హింసాత్మక పాలన–మార్పు సూత్రాన్ని వదిలి వేసి, బ్యాలెట్‌ బాక్స్‌ ద్వారా పాలన మార్పును తేవడానికి అమెరికా యత్నిస్తోంది. దీంతో బంగ్లాదేశ్‌కు సంబంధించినంత వరకూ భారత్‌తో అమె రికా విభేదిస్తోంది. భారత్‌ ప్రణాళికలు విజయవంతమైతే, బంగ్లా దేశ్‌లో మళ్లీ అంత స్నేహపూర్వకంగా లేని పరిస్థితిని అమెరికా ఎదు ర్కొంటుంది.

బంగ్లాదేశ్‌ ఆవిర్భవించినప్పటినుంచి ఇది ఉనికిలో ఉన్నదే. విదేశీ ఒత్తిడికి తలొగ్గబోననీ, వాషింగ్టన్‌  పరోక్ష దూకుడుకు లొంగిపోననీ హసీనా ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తామనే వాక్చాతుర్యం కంటే నిశ్శబ్ద దౌత్యం, శిక్షకు సంబంధించిన ముప్పు హసీనాపై మెరుగ్గా పని చేస్తాయి. కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ బంగ్లా ప్రధాని మౌలికంగా అమెరికాకు వ్యతిరేకం కాకపోవచ్చు.

వాస్తవానికి, ఆమె 2009లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత,  ముస్లిం ప్రపంచానికి ఢాకా నుండి ప్రసంగాన్ని అందించాలంటూ  అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను రహస్యంగా ఆహ్వానించ డానికి ప్రయత్నించారు. వ్యక్తిగత స్థాయిలో ఈ ఆసియా ఉక్కు మహిళ అమెరికాతో కుటుంబ సంబంధాలను కలిగి ఉన్నారు. ఆమె తన కోడలు అయిన అమెరికన్‌ మహిళను అరాధిస్తారు.

ప్రతిపక్ష సభ్యుడు ఆమె మతాన్ని గురించి ప్రశ్నించినప్పుడు హసీనా పార్లమెంటులో తన కోడలిని బహిరంగంగా సమర్థించారు. బెంగాలీ సంస్కృతిలో, వ్యక్తి గత సంబంధాలు అధికారిక మర్యాదలను అధిగమిస్తాయి.

బి.జెడ్‌. ఖస్రూ
వ్యాసకర్త, పాత్రికేయుడు, యుద్ధ వ్యవహారాల నిపుణుడు
(‘ద స్టేట్స్‌మన్‌’ సౌజన్యంతో) 

Advertisement
 
Advertisement
 
Advertisement