జనసేన నుంచి కొణతాలకు అవకాశం
గంటా, అయ్యన్నలకు మొండిచేయి
ఇప్పటికే సంకేతాలు పంపిన చంద్రబాబు
పదవి కోసం పైరవీలు ప్రారంభించిన మరికొందరు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో అమాత్య యోగం సీనియర్లకు దక్కే సూచనలు కనిపించడం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో తమకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న సీనియర్లకు నిరాశే ఎదురుకానున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సామాజికవర్గాల వారీగా ఎస్సీ, బీసీ కోటాలో ఇద్దరికి అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎస్సీ కోటాలో పాయకరావు పేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనితతో పాటు గాజువాక నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావులకు బీసీ (యాదవ) కోటాలో మంత్రి హోదా దక్కనున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే వీరిద్దరికీ కూడా సమాచారం అందినట్టు ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, అయ్యన్న మాత్రం పట్టువదలకుండా తనకు మంత్రి పదవి కావాల్సిందేనని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా మంత్రి పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో భారీగా పోటీ నెలకొంది. ఇక జనసేన తరపున అనకాపల్లి నుంచి గెలుపొందిన కొణతాల రామకృష్ణ పోటీలో ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ఆశిస్తున్నారు. అయితే ఆయనకు కష్టమేనని తెలుస్తోంది.
సీనియర్లను పక్కన పెట్టి...
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీగా సీట్లను సాధించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ నుంచి మినహా మిగిలిన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మంత్రి పదవుల కోసం భారీగా పోటీ నెలకొని ఉంది. అయితే ఈ సారి మంత్రి వర్గంలో తన మార్క్ స్పష్టంగా కనిపించేందుకు వీలుగా పూర్తిస్థాయిలో సీనియర్లను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్లగా ఉన్న గంటా శ్రీనివాసరావు, అయ్యన్న, బండారులను పరిగణనలోనికి తీసుకునే అవకాశం లేదని సమాచారం.
ఇందులో బండారు, గంటాలకు సీటు కేటాయించే సమయంలోనే మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అయ్యన్నకు మాత్రం కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అయితే సీనియర్లను పక్కన పెట్టే ఉద్దేశంతో శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడుకు ఇవ్వడం లేదని సమాచారం. ఇదే కోవలో ఇక్కడ కూడా అయ్యన్న పాత్రుడిని పరిగణనలోనికి తీసుకోవడం లేదని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో కాకుండా మరో విధంగా గౌరవం కల్పిస్తానని అయ్యన్నను బుజ్జగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా సీనియర్లను పక్కన పెట్టి తన మార్క్ పూర్తిస్థాయిలో ఉండే విధంగా చంద్రబాబు వ్యవహరించనున్నట్టు మాత్రం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జనసేనలోనూ పోటా పోటీ...
జనసేన నుంచి కూడా మంత్రి పదవుల కోసం పోటీ నెలకొని ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన కొణతాలతో పాటు పంచకర్ల, సుందరపు విజయ్‌కుమార్, వంశీకృష్ణలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటికే యాదవ సామాజికవర్గం నుంచి పల్లాకు బెర్తు ఉండటంతో వంశీకృష్ణకు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు మొదటిసారిగా గెలిచిన సుందరపు విజయ్‌కుమార్‌కు కూడా కష్టమేనని సమాచారం.
ప్రధానంగా కొణతాలతో పాటు పంచకర్ల రమేష్‌బాబుల మధ్య పోటీ ఉంది. అయితే గవర సామాజికవర్గానికి చెందిన కొణతాల వైపే పవన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కాపు కోటాలో పంచకర్ల కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు ఎవరికి యోగం వరించనుందో మరో రెండు, మూడు రోజుల్లో తేలనుంది. మొత్తంగా అధికారపక్షంలో అమాత్యుల కోసం భారీగా పోటీ నెలకొని... ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమై ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment