యువతులతో పబ్స్ యజమానుల భారీ స్కామ్
వీటి ద్వారా వ్యాపారులు, బడాబాబులకు ఎర
పథకం ప్రకారం పబ్బులకు రప్పిస్తూ కథలు
మద్యం తాగకున్నా తాగినట్లు సీన్ క్రియేట్
ఈ పేరుతో భారీగా బిల్లులు వడ్డిస్తున్న వైనం
హైటెక్ సిటీలోని మోష్ పబ్‌ఉదంతంలో వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: డేటింగ్ యాప్స్ కేంద్రంగా పబ్స్ యజమానులు, కొందరు యువతులు చేస్తున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు, బడా బాబులకు ఎర వేయడం, వాళ్లను పబ్స్‌కు రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లుల్ని మాత్రం వెంట వచి్చన వారికి ఇస్తాయి. ఇలా వచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవరూ బయటపడలేదు. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్‌లో మోసపోయిన వ్యాపారి సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచి్చంది. ఓ యువతి వలలో పడి రూ.40,505 బిల్లు చెల్లించిన ఆ బాధితుడి వ్యధ ఇది..
టిండర్ యాప్ ద్వారా పరిచయం..
నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఈమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌ను
మీటింగ్ పాయింట్‌గా చెప్పింది. సోమవారం సాయంత్రం అక్కడకు వచ్చిన వ్యాపారిని కలిసిన రితిక కొద్దిసేపటికి సమీపంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న పబ్‌కు వెళ్దామని చెప్పింది. అక్కడకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరిచడంతో వెయిటర్‌ను కలిసి ఆ పబ్‌లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, పడిన వారిని పబ్‌కు తీసుకురావాలని పబ్ యజమానులు–యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘పబ్స్ అండ్ గారల్స్’ కలిసి వినూత్న స్కామ్‌కు తెరలేపారు.
మద్యం పేరుతో కూల్‌డ్రింక్స్ సరఫరా..
వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించే పబ్ నిర్వాహకులు వెయిటర్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా.. గ్లాసుల్లో సరఫరా చేసేది మాత్రం కూల్‌డ్రింకే. రితిక సైతం ఆ రోజు ఒక్కో పెగ్గు రూ.1,799 ఖరీదు చేసే పది పెగ్గుల మద్యం ఆర్డర్ చేసింది. ఈ పేరుతో పబ్ నిర్వాహకులు సరఫరా చేసిన కూల్‌డ్రింక్ తాగుతూపోయింది. దీంతో రూ.20 ఖరీదు చేసే కూల్‌డ్రింక్‌కు యువతి సహకారంతో మద్యం రంగుపూసిన నిర్వాహకులు రూ.1,799 చొప్పున వసూలు చేశారు. ఈ ‘మద్యం’తో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి రూ.40,505 (పన్నులతో కలిపి) బిల్లు చేసింది. చివరకు వెయిటర్ బిల్లు తీసుకువచి్చన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టిన యువతి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానంటూ ఉడాయించింది. దాదాపు పది పెగ్గులు తాగిన ఆ యువతిలో ఎలాంటి తేడా లేకపోవడం, తూలకుండా నేరుగా నడిచి వెళ్లడంతో పాటు ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ అయ్యాడు.
అక్కడ వేదనలు నిత్యకృత్యం
సదరు పబ్‌లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలిబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్‌లో ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి రూ.16 వేలు, మరో వ్యక్తి రూ.24 వేలు, ఇంకొకరు రూ.20 వేలు చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్‌లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లుకు అదనం. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచి్చన మొత్తంలో యువతులు కొంత కమీషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మోష్ పబ్‌పై కేసు నమోదు
హైటెక్ సిటీలోని మోష్ పబ్ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్సై ఎన్‌వీ రమణ తెలిపారు. కొన్ని ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా యువతులకు, పబ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధితుల భయమే వీరికి వరం
ఇలా యువతుల వల్లో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా.. యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువుపోతుందని భయపడుతున్నారు. దీంతో కొందరు మాత్రం పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్‌లో విషయం పొందుపరుస్తున్నా.. అనేక మంది మిన్నకుండిపోతున్నారు. ఇదే అటు పబ్ నిర్వాహకులు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందాలో ఆ ఒక్క పబ్‌లోనే కాదని, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిలోకి ఈ ‘జంటలు’ ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి, నమోదు చేసుకుంటున్నారు. ఈ హనీట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలా చేయడం కచి్చతంగా నేరమే అని, దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులని స్పష్టం చేస్తున్నారు. బాధితులుగా మారిన ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment