సెలబ్రిటీ శారీ డ్రేపర్‌: ఎంత చార్జ్‌ చేస్తుందో తెలుసా..! | Sakshi
Sakshi News home page

Celebrity Saree Draper: సెలబ్రిటీ శారీ డ్రేపర్‌: ఎంత చార్జ్‌ చేస్తుందో తెలుసా..!

Published Sun, Apr 14 2024 4:48 PM

The Celebrity Saree Draper Who Charges Rs.2 Lakh - Sakshi

సెలబ్రిటీలకు స్టయిల్‌ని అద్ది.. వాళ్లను ఫ్యాషన్‌ స్టార్స్‌గా తీర్చిదిద్దే స్టయిలిస్ట్‌లు ఉంటారు. ముఖ్యంగా చీర కట్టు అనేది ఎప్పటికీ స్పెషల్‌. దీన్ని ప్రోషెషన్‌గా ఎంచుకుని సినీ సెలబ్రిటీలకు కట్టే స్థాయికి వెళ్లింది స్టార్‌ స్టయిలిస్ట్‌ డాలీ జైన్‌. ఆమె ఎలా శారీ డ్రేపర్‌గా మారిందో తెలుసుకుందామా..!

‘ఆరు గజాల ప్రతి చీరా నాకు 360 రకాల కట్టుతీరుల్ని, కుచ్చిళ్లను పరిచయం చేస్తున్నట్టనిపిస్తుంది’ అంటుందీ చీరకట్టు స్పెషలిస్ట్‌. దీపికా పదుకోణ్, ఆలియా భట్, ప్రియంకా చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్‌ కపూర్, నీతా అంబానీ, ఈషా అంబానీ, శ్లోకా అంబానీ, రవీనా టండన్‌ వంటి సెలబ్రిటీలందరూ ఏ చిన్న ఫంక్షన్‌కి అటెండ్‌ కావాలన్నా డాలీ జైన్‌కి కబురు పెడతారు. ఆమె చేత చీర కట్టించుకుంటారు.

అంతలా  చీరకట్టును ఓ ప్రొఫెషన్‌ స్థాయికి తీసుకెళ్లిన డాలీ.. పెళ్లయిన కొత్తలో చీరంటే యమ చిరాకు పడేదట. బెంగళూరులో పుట్టిపెరిగిన ఆమె పెళ్లయ్యే వరకు జీన్స్‌.. టీ షర్ట్స్, కుర్తీలే ధరించేది. కానీ అత్తారింట్లో క్యాజువల్‌ వేర్‌ నుంచి అకేషనల్‌ వేర్‌ దాకా అన్నిటికీ చీరే మస్ట్‌ అని ఆమె సాసుమా ఆర్డర్‌ పాస్‌ చేశారు. తప్పక చీరకట్టుతో కుస్తీపట్టడం మొదలుపెట్టింది డాలీ. రోజూ ముప్పావు గంట పట్టేదట చీర కట్టుకునేసరికి. ఇప్పుడు రికార్డ్‌ రేంజ్‌లో 18.5 సెకన్లలో కట్టేస్తుంది.. కట్టిస్తుంది. 

ప్రొఫెషన్‌గా ఎలా మారింది?
కారణం సినీతార శ్రీదేవే అనే ఆన్సర్‌ ఇస్తుంది డాలీ. చీరే కట్టుకోవాలి అని రూల్‌ పెట్టిన అత్తగారు.. కోడలు పడుతున్న అవస్థ చూసి జాలిపడి ‘కుర్తీలు వేసుకో’ అంటూ నియమాన్ని సడలించింది. అయితే అప్పటికే డాలీకి చీర మీద మోజు మొదలైంది. సో.. చీరనే కంటిన్యూ చేసింది. ఇంట్లో.. ఇరుగుపొరుగు.. బంధువుల్లో ఏ శుభకార్యం జరిగినా చీరకట్టడంలో అతివలకు సాయపడటమూ స్టార్ట్‌ చేసింది. అలాంటి ఒక సందర్భంలో ఆమె మేనమామ ఒక పార్టీ ఇచ్చాడు. అతను సినీతార శ్రీదేవి ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఉండేవాడట. అందుకని శ్రీదేవినీ ఆహ్వానించాడు.

డాలీ కూడా వెళ్లింది. పార్టీలో శ్రీదేవి చీర మీద జ్యూస్‌ ఒలికిందట. ఆమె ఇబ్బందిపడుతుంటే డాలీ చొరవ తీసుకుని గబగబా మేనమామ భార్య చీరొకటి తెచ్చి.. శ్రీదేవికి ఇచ్చిందట. అంతేకాదు ఆమె చీరకట్టుకుంటూంటే.. కుచ్చిళ్లు పెట్టడంలో.. పల్లూ సెట్‌ చేయడంలో సహాయపడిందట కూడా. డాలీ చీరకట్టే నేర్పరితనానికి శ్రీదేవి అబ్బురపడుతూ ‘ఇన్నేళ్లుగా చీర కట్టుకుంటున్నాను.. ఇంతబాగా కుదిరిందిలేదెప్పుడూ! దీన్ని ఒక ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చుగా?’ అంటూ కాంప్లిమెంట్‌ ఇచ్చిందట. ఆలస్యం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్‌ చేసి ఇదిగో ఇలా ఫేమస్‌ అయింది డాలీ.

వందల్లోంచి లక్షల్లోకి...
దాదాపు 20 ఏళ్లుగా శారీ డ్రేపర్‌ ప్రొఫెషన్‌లో కొనసాగుతూన్న డాలీ జైన్‌..  తొలి పారితోషికం రూ. 250. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు చార్జ్‌ చేస్తుంది. ఆమె దగ్గర 20 మంది సభ్యులతో కూడిన టీమ్‌ ఉంటుంది. చీరనే కాదు.. హాఫ్‌ శారీ, దుపట్టా.. ఇలా అన్నిటినీ సెట్‌ చేస్తుంది. ఈ స్టయిలింగ్‌లో ట్రైనింగ్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీలేం లేవు ఆమెకు. కేవలం చీర కట్టు మీద తనకున్న మమకారం.. సృజనతోనే ఈ స్థాయికి ఎదిగింది. తనలాంటి గృహిణులు ఎందరికో స్ఫూర్తిని పంచుతోంది. 

బాలీవుడ్‌లోకి  ఎంట్రీ?
డాలీ జైన్‌ టాలెంట్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ సందీప్‌ ఖోస్లా దృష్టిలో పడింది. నీతా అంబానీ 50 వ పుట్టిన రోజు ఫంక్షన్‌లో ఆమెకు చీర కట్టేందుకు డాలీని రికమెండ్‌ చేశాడు అతను. ఆ వేడుకలో మరెందరో సెలబ్రిటీల దృష్టిలోపడి బాలీవుడ్‌ ప్రవేశాన్ని సాధించింది. ఆమె ఫస్ట్‌ బాలీవుడ్‌ సెలబ్రిటీ వేడుక.. సల్మాన్‌ ఖాన్‌ చెల్లెలు అర్పితా ఖాన్‌ వెడ్డింగ్‌. అక్కణ్ణించి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ఎందరికో డాలీ ఫేవరేట్‌ శారీ డ్రేపర్‌ అయిపోయింది.  

Advertisement
Advertisement