మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..! | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..!

Published Fri, Mar 8 2024 11:15 AM

Maha Shivaratri 2024 special story - Sakshi

మహాకవి ధూర్జటి 'శ్రీ కాళహస్తీశ్వర శతకం'లో శివనామ ప్రాభవం, ప్రభావం గురించి అద్భుతమైన పద్యం చెప్పాడు. "పవి పుష్పంబగు,అగ్ని మంచగు.. శత్రుం డతిమిత్రుడౌ..విషము దివ్యాహారమౌ..." అని అంటాడు. "శివ శివ" అంటూ శివుడిని తలుచుకుంటే చాలు! అన్నీ నీకు వశమవుతాయని అంటాడు. మహాశక్తివంతమైన వజ్రాయుధం లలిత లావణ్యమైన పుష్పంగా రూపు మార్చుకుంటుంది. అగ్ని పర్వతం కూడా మంచు పర్వతంగా మారిపోతుంది, సముద్రమంతా ఇంకిపోయి, మామూలు నేలగా మారిపోతుంది.

పరమశత్రువు కూడా అత్యంత స్నేహితుడవుతాడు, విషము దివ్యమైన ఆహారంగా మారిపోతుంది. ఇలా...ఎన్నో జరుగతాయని, అనూహ్యమైన ఫలితాలు, పరిణామాలు ఎన్నెన్నో సంభవిస్తాయని ఈ పద్యం అందించే తాత్పర్యం. అంతటి వశీకరణ శక్తి శివనామానికి వుంది. అతి శీఘ్రంగా భక్తులను కరుణించి, వరాల వర్షాలు కురిపించే సులక్షణభూషితుడు హరుడు.

భోళాశంకరుడు, భక్తవశంకరుడు శివదేవుడు. పాల్కురికి సోమనాథుడు నుంచి శ్రీనాథుడు వరకూ,పోతన నుంచి విశ్వనాథ వరకూ,ధూర్జటి నుంచి కొప్పరపు కవుల వరకూ మహాకవులెందరో శివుడిని ఆరాధించినవారే. పంచాక్షరీ మంత్రోపాసనలో పరవశించినవారే. కవులందరూ శివులే. భవ్యకవితావేశంతో శివమెత్తినవారే. శివరాత్రి వేళ స్త్రీ,బాల, వృద్ధులందరూ ఉరిమే ఉత్సాహంతో శివమెత్తి నర్తిస్తారు. ఆ ఉత్సాహం ఉత్సవమవుతుంది. హిందువులకు,ముఖ్యంగా శివారాధకులకు 'మహాశివరాత్రి' గొప్ప పండుగరోజు. శివపార్వతుల కల్యాణ శుభదినంగా, శివతాండవం జరిగే విశేషరాత్రిగా పరమపవిత్రంగా పాటించి వేడుకలు జరుపుకోవడం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. శివపురాణం ప్రకారం శివుడు లింగాకారుడుగా మారే రోజుగా శివపురాణం చెబుతోంది.

ఏ రీతిన చూసినా, ఏ తీరున చెప్పినా, ఏ లీలగా భావించినా ఇది పుణ్యదినం, భక్తులకు ధన్యదినం. శివరాత్రి నాడు ఉపవాసం ఉండడం, రాత్రంతా జాగారం చేయడం, శివ తపో ధ్యానాలతో తన్మయులవడం సర్వత్రా దర్శనమవుతూ ఉంటాయి. శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా విశేషాల కథా పారాయణలు  కోట్లాదిమంది ప్రపంచమంతా జరుపుతారు. బిల్వపత్రాలతో అర్చన చేస్తే శివుడు అత్యంతంగా ఆనందిస్తాడని భక్తులు నమ్ముతారు. "మా రేడు నీవని ఏరేరి తేనా? మారేడు దళములు నీ పూజకు " అన్నాడు వేటూరి.

ప్రపంచంలో ఏ దేశంలో వున్నా, శివభక్తులు  తెల్లవారుజామునే లేవడం క్రమశిక్షణగా పాటిస్తారు. విభూతి ధారణ చేసి  "ఓం నమఃశివాయ" అంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే ఎంతో శక్తి చేకూరుతుందని, ఎన్నో విశేషఫలితాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. తపస్సు, యోగాభ్యాసం, ధ్యానం గొప్ప ఫలితాలను అందిస్తాయన్నది అనాదిగా పెద్దలు చెబుతున్నది. మంత్రోపాసనలు గొప్ప వైభవాన్ని, రక్షణను కలిగిస్తాయని ఆర్యవాక్కు. పంచాక్షరీ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం విశేషంగా భావిస్తారు. శివుడిని ప్రధానంగా యోగకారకుడుగా అభివర్ణిస్తారు. మహాశివరాత్రి నాడు జాగరణ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆధ్యాత్మిక శోభ, గొప్ప ఆరోగ్యం లభిస్తాయనే విశ్వాసంతో కోట్లాదిమంది

తరతరాల నుంచి మహాశివరాత్రిని పరమనిష్ఠగా జరుపుకుంటున్నారు. రాత్రంతా సంగీత,సాహిత్య, నాటక,కళా ప్రదర్శనలతో మార్మోగి పోతుంది.  ఎంతోమంది ద్వాదశ లింగాల దర్శనానికి సమాయిత్తమవుతారు. రుద్రాభిషేకం విశేషంగా జరుపుకోవడం పరిపాటి. తెలుగునాట ఎన్నో సుప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలోని కోటప్పకొండ ప్రభ తీరే వేరు. కోటప్పకొండ తిరునాళ్ల చాలా ప్రసిద్ధి. శ్రీశైలం,శ్రీకాళహస్తి, భీమేశ్వరం వంటి క్షేత్రాలలో జరిగే విశేషపూజలు, భక్తుల కోలాహలం చెప్పనలవి కాదు. తెలంగాణలో రుద్రేశ్వరస్వామి వెయ్యి స్థంభాల ఆలయం, కీసరగుట్ట, వేములవాడ మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఐశ్వర్యప్రదాతలై విలసిల్లుతున్నాయి. శివుని ఆరాధన సర్వశక్తికరం, సర్వముక్తిప్రదం. శివరాత్రి నాడు జరిగే పూజలను దర్శించుకున్నా పుణ్యప్రదం.

నాలుగు యామాలుగా పూజలు నిర్వహిస్తారు. అత్యంత శక్తివంతమైన శివ పంచాక్షరీ మంత్రం ప్రకృతిలో భాగమైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో ముడిపెట్టుకొని ఉంటుంది. శివుడిని పంచముఖునిగా, పంచబ్రహ్మలుగా భావిస్తారు. చైతన్యం దీని మూలసూత్రం.

శివతత్త్వమే పరమోన్నతం. నిస్వార్థం, నిరాడంబరత ఆయన సుగుణధనాలు.  మహాశివస్మరణ సంబంధియైన మహాశివరాత్రి అర్చనలు మానసిక ప్రశాంతతకు మూలం, శారీరక శక్తికి కేంద్రం, ముక్తికి సోపానం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కాశీ నుంచి కాళహస్తి దాకా, నేపాల్ నుంచి పాకిస్తాన్ దాకా కోటి ప్రభలతో,కొంగ్రొత్త శోభలతో కోలాహలంగా సాగే 'మహాశివరాత్రి' ధరిత్రిని పవిత్రంగా నిలిపే పుణ్యరాత్రి, శివగాత్రి.

పాకిస్తాన్ లోని కరాచీలో శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంతో ప్రసిద్ధం. కొన్ని వేలమంది ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మన వలె ఉపవాస దీక్ష ఆచరిస్తారు, సముద్రస్నానం చేస్తారు. శివరాత్రిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరకంగా పిలుచుకుంటారు. కశ్మీర్ లో 'హరరాత్రి' అంటారు. ఒరిస్సావారు 'జాగరా' అంటారు. జాగరా అంటే జాగారం చేయడం, అంటే నిద్రపోకుండా మేల్కొని ఉండడం.  పంజాబ్‌లో  శోభాయాత్రలు నిర్వహిస్తారు. ఇలా ఏ పేరుతో కొలిచినా, తలచేది శివుడినే. దివ్యశివరాత్రి మనలో భవ్య భావనలు నింపుగాక!


మాశర్మ, సీనియర్‌ జర్నలిస్టు

Advertisement
Advertisement