నీరు–చెట్టు పనుల్లో అవినీతి దందా
నియోజకవర్గంలో ఏ పనిచేయాలన్నా కమీషన్ ఇవ్వాల్సిందే
ప్రతి పనికి రేటు...
ముక్కుపిండి మరీ వసూలు
అభివృద్ధిని అటకెక్కించి అక్రమాలకు తలుపులుతెరచిన నేత
ఎర్రమట్టి తవ్వకాలతో కోట్లకు పడగలు.. చెరువుల పూడికతీతలోనూ చిలక్కొట్టుడు
అర్హులకు సంక్షేమ పథకాలు అందాలన్నా సిఫార్సు లేఖ ఉండాల్సిందే
నాటి రోజులు తలుచుకుని దడుసుకుంటున్న ప్రజలు
ఈ నేత మాకొద్దు బాబోయ్ అంటున్న నియోజకవర్గ ప్రజలు
శ్రీశైలం మల్లన్న సాక్షిగా... కర్నూలు జిల్లాకు చెందిన ఈ టీడీపీ నేత నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. నైతికంగా దిగజారిపోయాక నాకేంటి సిగ్గన్నట్టు అవినీతికి తెగించేశారు. పాలు తాగి రొమ్ము తన్నేసిన ఈ నేత చంద్రబాబు 23 సంఖ్యలో భాగస్వామి. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి, నమ్మిన పారీ్టకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ పంచన చేరిపోయారు. తన నియోజకవర్గాన్ని అవినీతికి అడ్డాగా మార్చేశారు. రోడ్లు, డ్రైన్లు, ఎర్రమట్టి తవ్వకాలు, నీరు–చెట్టు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు... ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశైలం కొండంత. తన మాట వినని వారిపై దాడులు, బెదిరింపులకు పాల్పడడం అతనికి అతి సాధారణం.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఈ నేత ఇంట్లో సిరుల వర్షం కురిసింది. ప్రధానంగా నీరు– చెట్టు పనులు ఈ నేతకు కల్పతరువులా మారాయి. ప్రతి పనికి 10 నుంచి 15 శాతం కమీషన్లు చెల్లిస్తేనే పనులు మంజూరు అయ్యేవి. నీరు–చెట్టు పనులకు మండలానికి రూ.50 కోట్లు మంజూరయ్యేవి. ఆత్మకూరు, బండి ఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాల్లో ఈ పనులు చేయాలంటే ఈ నేతకు కప్పం కట్టాల్సిందే. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా సార్ గారికి నచ్చదు. ఇతన్ని కాదని అధికారులు ముందుకు వచ్చే వారు కాదు. ఒక్క నీరు–చెట్టు పనుల్లోనే దాదాపు రూ.30 కోట్ల మేర దండుకున్నారు.
నాసిరకం పనులు...
ఆత్మకూరు మండలంలో ఈ అవినీతి తారస్థాయికి చేరింది. కురుకుంద, ముష్టపల్లి, సిద్ధపల్లి, కృష్ణాపురం తదితర గ్రామాల్లో దాదాపు రూ.60 కోట్లకు పైగా పనులు జరిగాయి. రైతుల పచ్చని పొలాల్లో పంటలను ధ్వంసం చేసి రహదారులు ఏర్పాటు చేశారు. సిద్ధపల్లి గ్రామంలో సాగులో ఉన్న వరి, మిరప, ఆముదాలు లాంటి పంటలను ప్రొక్లెయిన్లతో ధ్వంసం చేసి మట్టి రోడ్లు నిరి్మంచారు. కళ్ల ముందర చేతికి వచి్చన పంటలను నాశనం చేయొద్దని రైతులు అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకుని బతిమాలినా ఏమాత్రం చలించలేదు. కురుకుంద గ్రామంలో చెరువు పూడిక తీత పనుల్లో అనుమతికి మించి మట్టిని కొల్లగొట్టి రూ.10 లక్షల బిల్లులు మంజూరు చేయించుకున్నారు. అదే చెరువులో మరోసారి పూడిక తీసి మరికొన్ని లక్షలు దండుకున్నారు.
👉 వెలుగోడు మండలంలో ఈ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఒకరు రూ.10 లక్షల పనికి లక్షకు రూ.15 వేల చొప్పున కమీషన్ వసూలు చేశారు. పంట పొలాలకు వెళ్లే రహదారులు, పంట కాల్వల్లో పూడిక తీత పనులు, మట్టి రోడ్ల మరమ్మతులు, తెలుగు గంగ పరిధిలో రాస్తా పనులు, కేసీ కెనాల్ పరిధిలో చేపట్టిన ప్రతి పనిలోనూ కమీషన్లు దండారు.
👉 బండి ఆత్మకూరు మండలంలో రూ.50 కోట్లకు పైగా పనులు మంజూరు అయ్యాయి. కేసీ కెనాల్, కుందు ఆయకట్టు రోడ్ల అభివృద్ధి పేరుతో నిధులు మంజూరు చేయించుకొని దాదాపు 20 నుంచి 30 శాతం కమీషన్లు వసూలు చేశారు. కుందు నది వెడల్పు 50 మీటర్లు ఉంటే మొత్తం పూడిక తీసినట్లు కొలతలు వేసి బిల్లులు స్వాహా చేశారు. మద్దిలేరు, పోతుల వాగు, సంకలవాగు, అభివృద్ధి పనులు కూడా తూతూ మంత్రంగా చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.
👉 మహానంది మండలంలో సీసీ రోడ్లు, ఎర్రమట్టి తవ్వకాలతో ప్రభుత్వ ఖజానాను గుల్ల చేశారు. రహదారులు, చెరువులు, కుంటల పూడికతీతకు రూ.11.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు చేసిన స్థానిక టీడీపీ నాయకులు తమ నేతకు 15 నుంచి 20 శాతం ముడుపులు చెల్లించారు. గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి తరలింపులో స్థానిక ఎమ్మెల్యే 60 శాతం, అప్పటి జిల్లా మంత్రిగా ఉన్న నేత 40 శాతం మేర డబ్బులు పంచుకున్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు.
అన్ని అర్హతలున్నా రెండు నెలల మొత్తం ముందుగా ఇస్తేనే పింఛను మంజూరు చేస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు బహిరంగంగానే వసూలు చేశారు. ఆదరణ పథకం కింద కుల వృత్తి దారులకు సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే వాషింగ్ మిషన్లు, ఇతర పరికరాలపై కూడా కమీషన్లు వసూలు చేశారు. నాటి పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుందని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు.
క్రిమినల్ కేసులు
ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులున్నాయి. బెదిరింపులు, దాడులు తదితర నేరాలపై ఐపీసీ 504, 506 సెక్షన్ 155(3), ఐపీసీ 143, 341, 149, 324, 506, 34, సీఆర్‌పీసీ 151 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment