2024 లోక్‌సభ ఎన్నికల మూడు దశలు ఇప్పటికీ ముగిశాయి. మిగిలిన నాలుగు దశల ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో పంజాబ్‌లోని భఠిండా లోక్ సభ స్థానంపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఈ స్థానం నుంచి ఐఏఎస్ అధికారి పరమ్‌పాల్ కౌర్ సిద్ధూకు బీజేపీ టికెట్ ఇచ్చింది.
ఈ నేపధ్యంలో ఆమె రాజీనామాను కేంద్ర సిబ్బంది శాఖ ఆమోదించింది. అయితే పంజాబ్ ప్రభుత్వం ఆమెకు మూడు నెలల నోటీసు వ్యవధి నుండి మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. ఉద్యోగంలో కొనసాగాలని కోరింది. అయితే పరమ్‌పల్ కౌర్ ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ తాను ఖచ్చితంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
తనను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసిందని, జూన్ ఒకటిన పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తాను రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెబుతానని ఆమె తెలిపారు. తనకు నోటీసు పంపించి, ఆప్ ప్రభుత్వం సమయాన్ని వృథా చేసుకుంటున్నదని ఆమె ఆరోపించారు. రిటైర్మెంట్ తర్వాత ఏమి చేయాలన్నది తన ఇష్టమని ఆమె పేర్కొన్నారు.
పంజాబ్ ప్రభుత్వం పరమ్‌పాల్ కౌర్ సిద్ధూకు పంపిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం రూల్ 16 (2) ప్రకారం మూడు నెలల నోటీసు వ్యవధిని మినహాయించలేమని, అందుకే వీఆర్‌ఎస్ ఆమోదించడానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేమని పేర్కొంది. ఆమెను రిటైర్డ్‌గా పరిగణించలేమని, ఆమె వెంటనే విధులకు హాజరు కావాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment