పంజాబ్‌లోని బఠిండా లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఐఏఎస్ అధికారి పరమ్‌పాల్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. అకాలీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సికందర్ సింగ్ మలుకా కోడలు, పంజాబ్ ఐఏఎస్ అధికారి పరంపాల్ కౌర్ రాజీనామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.
రెండు రోజుల క్రితం పరమ్‌పాల్ కౌర్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే దీనికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ కూడా రాసింది. అయితే పంజాబ్ ప్రభుత్వం పరమ్‌పాల్ కౌర్ వీఆర్‌ఎస్‌ను తిరస్కరించింది. ఆమెను వెంటనే విధుల్లో చేరాలని కోరింది.
ఇటువంటి పరిస్థితిలో పరమ్‌పాల్ కౌర్ నామినేషన్ దాఖలు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. పరంపాల్ కౌర్ స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత తన భర్తతో కలిసి బీజేపీలో చేరారు. ఈ నేపధ్యంలో పార్టీ ఆమెను బఠిండా అభ్యర్థిగా ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వ పర్సనల్ డిపార్ట్‌మెంట్ తన నోటీసులో.. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌లోని రూల్ 16(2) ప్రకారం సమర్థ ప్రీ-డిశ్చార్జ్ కోసం పరమ్‌పాల్ కౌర్ దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వృద్ధురాలైన తల్లిని చూసుకోవడానికి రిటైర్మెంట్ కోరుతున్నట్లు ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు.
పదవీ విరమణ దరఖాస్తు నిబంధనల ప్రకారం మూడు నెలల నోటీసు వ్యవధిని మినహాయించాలని పరమ్‌పాల్ కౌర్ అభ్యర్థించారు. అయితే పంజాబ్ ప్రభుత్వ సిబ్బంది విభాగం పంపిన నోటీసులో పదవీ విరమణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సంబంధిత అధికారికి మూడు నెలల నోటీసు వ్యవధి నుండి మినహాయింపు ఇవ్వగలదని స్పష్టం చేసింది . కేంద్ర ప్రభుత్వానికి ఈ హక్కు లేదని దానిలో పేర్కొంది.
అలాగే తల్లి సంరక్షణకు కోసం పదవీ విరమణ కోరుతున్నట్లు దరఖాస్తులో పేర్కొన్న కారణం నిరాధారమైనదిగా పరిగణిస్తున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. ఆమె దరఖాస్తు సమర్పించాక రాజకీయాలలో చురుకుగా మారారు. అందుకే ఈ కారణం నిరాధారమని సదరు నోటీసులో పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆమె రిలీఫ్ అప్లికేషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆమె తక్షణమే విధుల్లో చేరాలని ఆ నోటీసులో ఆమెకు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment