పంజాబ్ ‘సర్దార్’‌ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది? | What is the Equation on the 6 hot seats in Punjab? | Sakshi
Sakshi News home page

పంజాబ్ ‘సర్దార్’‌ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?

Published Tue, May 28 2024 7:08 AM | Last Updated on Tue, May 28 2024 9:18 AM

What is the Equation on the 6 hot seats in Punjab?

దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్‌ ముగియగా, ఇంకా  ఏడవ, చివరి దశ ఓటింగ్‌ జూన్‌ ఒకటిన జరగాల్సివుంది. కాగా పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది.

పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, అకాలీదళ్, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన సత్తాను పునరావృతం చేస్తుందా? లేక గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చూపిన పనితీరు మరోసారి పునరావృతం అవుతుందా అనే దానిపై చర్చ జరుగుతోంది. పంజాబ్‌లోని ఆరు హాట్ సీట్లలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు?

అమృత్‌సర్: ఈ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో హాట్‌సీట్‌లుగా పరిగణిస్తున్న స్థానాల్లో అమృత్‌సర్ మొదటి స్థానంలో నిలిచింది. అమృత్‌సర్‌లో ఆల్ రౌండ్ పోటీ నెలకొంది. 1989 ఎన్నికల తర్వాత తొలిసారిగా పంజాబ్‌లో ఇటువంటి పోటీ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో సిక్కుయేతర ఓట్లపై బీజేపీ దృష్టి సారించింది. అమృత్‌సర్‌లో హిందువుల జనాభా నిర్ణయాత్మక రీతిలోనే ఉంది.

పటియాలా: ఈసారి పటియాలాలో జరిగే ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. రెండు సార్లు కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయం సాధించిన ప్రణీత్ కౌర్ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై గెలిచిన ధరమ్‌వీర్ గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలోనే ఉన్నారు. అయితే అమరీందర్ సింగ్‌ ఈ సారి గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నారని విశ్లేషకులు అంటున్నారు.

జలంధర్: ఈ లోక్‌సభ స్థానంలో హిందువుల జనాభా 40 శాతానికి పైగా ఉంది. ఈ జనాభాపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, గత సారి  ఆమ్‌ ఆమ్ ఆద్మీ పార్టీపై మొగ్గు చూపిన ఓటర్లు  ఈసారి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారా? అనే  ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. 

భటిండా: గత మూడు ఎన్నికల్లో అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ గెలుపొందారు. అయితే ఈసారి సమీకరణలు మారిపోయాయి. అకాలీదళ్‌పై విశ్వసనీయత గణనీయంగా తగ్గిపోయిందంటున్నారు. బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోరాటానికి పూర్తిగా సిద్ధమైంది.

లూథియానా: గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన రవ్‌నీత్ సింగ్ బిట్టు ఢిల్లీకి ప్రమోట్‌ అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో సమీకరణలు మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రవ్‌నీత్ సింగ్ బిట్టు బరిలోకి దిగారు. లూథియానాలో కూడా, హిందూ ఓటు బ్యాంకు, రవ్‌నీత్ సింగ్ బిట్టు ఓటు బేస్ సహాయంతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ కోరుకుంటోంది.    

గురుదాస్‌పూర్‌: గత రెండు దఫాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సినీ తారలను బీజేపీ బరిలోకి దించలేదు. గురుదాస్‌పూర్ సీటును నిలబెట్టుకునేందుకు నటుడు సన్నీ డియోల్ అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టలేదు.

పంజాబ్‌లో ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయాలు నడుస్తాయి. 2014లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ జరగ్గా ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వచ్చాయి. 2019లో ఎన్డీఏ ఓడిపోయి కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అన్నివైపుల నుంచి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచే కాకుండా ఆమ్ ఆద్మీ నుంచి కూడా విపరీతమైన పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది. పంజాబ్ రాష్ట్రంలో 58 శాతం సిక్కు జనాభా, 38 శాతం హిందూ జనాభా, 32 శాతం దళిత జనాభా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌లో రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement