లోక్‌సభ ఎన్నికల చివరి దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు ఈరోజు(శనివారం) పోలింగ్ జరుగుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో కలిసి సంగ్రూర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో పంజాబ్ సీఎం భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాట్లాడుతూ సాధారణంగా మహిళల ఓటింగ్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి మహిళలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ, నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్రజలకు ఓటు హక్కుపై పూర్తి అవగాహన ఉందని, వారు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని భావిస్తున్నానని అన్నారు. పంజాబీలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి, ఓటు హక్కు వినియోగించుకుని బాధల్లో, సంతోషాల్లో అండగా ఉండే మంచి ప్రతినిధులను ఎన్నుకోవాలని అన్నారు. అలాంటి వారు లోక్‌సభ మెట్లు ఎక్కినప్పుడే మంచి చట్టాలు కూడా వస్తాయన్నారు.
పంజాబ్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 70 నుంచి 80 శాతం ఓటింగ్ నమోదైందని, ఇప్పుడు కూడా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గడచిన 25 రోజుల్లో తాను 122 ర్యాలీలు నిర్వహించానని, ఏ సీటునూ తేలిగ్గా తీసుకోలేదని అన్నారు. తాను అందించిన కరెంటు, నీళ్లు, ఉద్యోగాలు లాంటి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు అడిగానన్నారు. తన మీద ఎన్నికల కమిషన్‌కు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment