ఎలాగైనా ఆ సీటు మళ్లీ గెలవాల్సిందే: సీఎం | Focus on winning Jalandhar at any cost, CM Mann to party leaders, MLAs | Sakshi
Sakshi News home page

ఎలాగైనా ఆ సీటు మళ్లీ గెలవాల్సిందే: సీఎం

Published Mon, Apr 8 2024 8:50 AM | Last Updated on Mon, Apr 8 2024 10:33 AM

winning Jalandhar at any cost cm Mann to party leaders MLAs - Sakshi

జలంధర్‌: లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదివారం జలంధర్‌లోని స్థానిక హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు.

కేబినెట్ మంత్రి బల్కర్ సింగ్, నకోదర్ ఎమ్మెల్యే ఇంద్రజిత్ కౌర్, జలంధర్ సెంట్రల్ ఎమ్మెల్యే రమణ్ అరోరా, జలంధర్ లోక్‌సభ సీటు పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల ముగ్గురు ఇన్‌ఛార్జ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఆమ్ ఆద్మీ పార్టీ మార్చి 14న జలంధర్ అభ్యర్థిగా తమ సిట్టింగ్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూను ప్రకటించింది. అయితే, రింకూ మార్చి 27న పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. రింకూతో పాటు ఆప్ జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్ కూడా రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరారు. గత ఏడాది జరిగిన జలంధర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో రింకు 58,691 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆయన దోబా ప్రాంతంలో కీలక దళిత నాయకుడిగా ఎదిగారు.

ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా భావించే దళితుల ప్రాబల్యం ఉన్న జలంధర్ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి సమిష్టి కృషి చేయాలని సీఎం భగవంత్‌ మాన్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. "జలంధర్ లోక్‌సభ స్థానంపై దృష్టి అంతా ఉంది. పార్టీ ఎలాగైనా ఈ సీటును మళ్లీ గెలవాలనుకుంటోంది" అని సీఎం మాన్‌ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement