ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన మొత్తం 162 మంది అభ్యర్థుల్లో 14 మందిని మాత్రమే ప్రజలు ఆమోదించారు. మిగిలిన 148 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఢిల్లీలో అత్యధిక ఓటింగ్ శాతం తూర్పు ఢిల్లీ స్థానంలో 62.89గా నమోదయ్యింది. న్యూ ఢిల్లీ స్థానంలో అత్యల్పంగా 55.43 శాతం ఓటింగ్ నమోదైంది.
న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఎవరైనా అభ్యర్థి డిపాజిట్‌ను కాపాడుకోవాలంటే వారికి 1,40,891 ఓట్లు అవసరం. అదే తూర్పు ఢిల్లీ స్థానంలో అయితే 2,58,180 ఓట్లు అవసరం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ డిపాజిట్‌ను కాపాడుకునేందుకు మొత్తం ఓట్లలో 1/6 ఓట్లు పొందాలి. పోలింగ్ రోజున ఢిల్లీలోని 1,52,01,936 మంది ఓటర్లలో 58.69శాతం అంటే 89,23,536 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఢిల్లీలోని ఏడు స్థానాల్లో న్యూఢిల్లీలో అత్యల్పంగా 8.45 లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ నిబంధనల ప్రకారం డిపాజిట్ కాపాడుకోవడానికి అభ్యర్థికి 1,40,891 లక్షల ఓట్లు అవసరం. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి 17 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. వీరిలో బన్సూరి స్వరాజ్, సోమనాథ్ భారతికి 1.4 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. మిగిలిన 15 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతయ్యింది.
అత్యధిక ఓట్లు పొందిన ఈశాన్య ఢిల్లీ స్థానంలోని 24,63,159 మంది ఓటర్లలో 15,49,80 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థానంపై అభ్యర్థులు తమ డిపాజిట్ కాపాడుకోవడానికి 2,58,180 ఓట్లు అవసరం. ఈశాన్య ఢిల్లీ స్థానానికి 28 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వారిలో మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్ మినహా 26 మంది అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతయ్యింది. మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీ, మహాకూటమి అభ్యర్థులు మినహా మిగిలిన వారందరినీ ప్రజలు తిరస్కరించారు.
ఢిల్లీ మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆయన బహుజన సమాజ్ పార్టీ టిక్కెట్‌పై న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,629 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇది 0.66 శాతం మాత్రమే. రాజ్‌కుమార్ ఆనంద్‌కు పోస్టల్ ఓటు ద్వారా 28 ఓట్లు రాగా, ఈవీఎంల ద్వారా 5,601 ఓట్లు వచ్చాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆనంద్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన న్యూఢిల్లీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment