Pudami Sakshiga : పైకి కనపడవు గానీ, ఈ బుజ్జి పిట్టల అల్లరి అంతా ఇంతాకాదు | Sakshi
Sakshi News home page

పైకి కనపడవు గానీ, ఈ బుజ్జి పిట్టల అల్లరి అంతా ఇంతా కాదు!

Published Mon, Feb 12 2024 1:36 PM

Pudami Sakshiga Give some tree the gift of green again Let one bird sing special story

వసంత రుతువు రాగానే చెట్లన్నీ పల్లవిస్తే, ఆ హరిత పల్లవాల లోంచి వినిపించే కోకిల గానం గురించి కవులు చెబుతారు. కాని, కాస్తంత ఆకుపచ్చదనం కనిపిస్తే చాలు, అనేక రకాల పక్షులు వచ్చి సంబరాలు చేసుకుంటాయి. జనావాసాల మధ్య పక్షులు ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్ పై  సునీత పొత్తూరి ప్రత్యేక  కథనం..

పచ్చని  ప్రకృతికి బహుమతిగా మళ్లీ  కొన్ని చెట్లనిద్దాం...చిన్ని పక్షిని పాడనిద్దాం -ఫైజ్ అహ్మద్ ఫైజ్

మేం టెర్రెస్ గార్డెన్ మొదలు పెట్టాక, మాకు ఈ చిన్ని అతిథుల సందడి పెరిగిందని చెప్పాలి. ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్(Asian green bee eaters)అన్ని రకాల పిట్టల లోనూ ఇదొక ఆకుపచ్చని ఆకర్షణ! ఈ మధ్య వీటి హాడావుడి ఎక్కువే అయింది. సాధారణ పిచుకల పరిమాణంలో ఉండే ఈ పక్షులు ఆకుపచ్చ రంగులో, కంఠం దగ్గర నీలంగాను, తలపైన పింగళవర్ణం(మిశ్రమ రాగి వర్ణం)తోను, తోక సన్నగా పుల్లలా సాగి, ఉంటుంది. తోక తో కలిపి  9 అంగుళాలు (పూర్వపుభాషలో అయితే జానా బెత్తెడు) ఉంటుంది.

ఎంత తేలిక అంటే వెదురు కొమ్మ మీద అర డజను పిట్డలు దర్జాగావాలిపోతాయి! ఇందుకు అనుగుణం గా వాటి కాలి గోళ్లు కలసి ఉండటం వల్ల కొమ్మలపైన పట్డు నిలుస్తుందిట. కొమ్మ కదలకుండా ఒకదానికొకటి ఒరుసుకుని కూర్చున్న తీరు నులి వెచ్చని ఎండ లో చలి కాగుతున్నట్డుఉంటుంది.వెదురు మొక్క కొమ్మలకి అటు ఇటూ.. వాలి, పచ్చని తోరణంలా కనువిందు చేస్తుంటాయి. ఫ్లై కాచర్ అన్న పేరుకు తగ్గట్టు చిన్న చిన్న పురుగులను, తేనెటీగలనూ పట్టి తింటాయి.

అయితే వేటాడే విధానం..అదొక కళ లా, ప్రత్యేకం గా ఉంటుంది. గాలిలో ఉండగానే తమ ఆహారాన్ని నోటికి అంకించుకుంటాయి. అలా అనిచటుక్కున మింగవు. నింపాదిగా ఇలా ఓ చెట్టుకొమ్మ మీద వాలి, తన ఆహారాన్ని పొడిచి వేరుచేసి తింటాయి. వీటి గూళ్లను మానవ సమూహాలకు దూరంగా లోతట్డు గా ఉండే పొదలు, గడ్డి భూములలో ఏర్పాటుచేసుకుంటాయిట. ఇవి వలస పక్షులు కావు. అంతరించి పోతున్న జాతుల లెక్కలోనూ లేవు. కాని,మాకు వానాకాలం లో కంటే, ఇలా శీతా కాలం లో మా ప్రాంతంలో ఎక్కువగా చూస్తాను. ఉదయం, సాయంత్రంవేళల్లో కోలహాలంగా గుంపులుగా వచ్చే వాటి అరుపు అనునాసికంగా, తంత్రీ వాద్యంలా ట్రిం...ట్రిం.. అంటూ ఉంటుంది.  కొమ్మల మీదనుండి ఒక్కసారిగా ఎగిరి పోయేటప్పుడు  చేసే శబ్దం మాత్రం అధికంగా ఉంటుంది.

ఇది కాక, క్రిమి కీటకాలను వేటాడే పక్షుల నిత్య సందడి సూర్యోదయానికి ముందే మొదలౌతుంది. తేనె పిట్డలు, జిట్టంగి పిట్టలు, బుల్ బుల్(పిగిలి పిట్ట), తేనిటీగల్ని, పురుగుల్ని పట్టితినే పాసరైన్స్, వేటి కవే నిత్యంతమ కలకూజితాలతో- మధురారవాలతో ఉదయస్తమయాలు రాగరంజితం చేస్తుంటాయి.  చలికాలం లో మా ముంగిట్లో  ఉన్న కోవిదార చెట్టు (Bauhinia) సుందరంగా పూస్తుంది. వీటి మీద ఎగురుతూ తేనెపిట్టలు, passerines చేసే సందడి అంతా ఇంతా కాదు. కనిపించవు గాని, కొమ్మకొమ్మ కో సన్నాయీ...! ఆపిలుపులన్నీ పూలవేనేమో అనిపిస్తాయిసన్ బర్డ్స్ మందార పూలమీద అలా వాలి, ఇలా చటుక్కున తేనె సంగ్రహించి పోతుంటాయి. కెమెరాకి ‘యాక్షన్’ చెప్పేఅవకాశమే ఇవ్వవు.  ఈ బుల్లి పిట్టలు గొంతు విప్పితే చెవులు చిల్లుపడాల్సిందే. పిట్ట కొంచెం కూత ఘనం అంటారుకదా.. అలా!

పిగిలి పిట్టలు(Bulbul)- గుబురు తలల తో తోక కింద ఎర్రగా ఉండే ఈ పక్షులు మా టెర్రస్ పైన చేసే సందడి తక్కువేంకాదు. మీకు అలారం క్లాక్ అవసరం లేదు. తెల్లవారు జామునే మొదలు .. కిసకిసలు!బ్లాక్ రాబిన్– ఓ సారి నా నడక దారిలో  ఓచిత్రం చూసాను. బ్లాక్ రాబిన్ తన ప్లమేజ్  లో ఆకుపచ్చని గడ్డిపరకలుటక్ చేసుకుని లాన్ లో తిరుగుతూ కనబడింది.  ఫోటో తీద్దామనే ప్రయత్నం ఫలించలేదు. కింగ్ ఫిషర్  ఒకటి ఒకే సమయానికి దర్శనం ఇస్తూంటుంది. రివ్వున వాలి, కావలసినదేదో దొరకపుచ్చుకుని దూరంగా లైట్ స్తంభం మీదకి గెంతి .. కాస్త తాళి, ఎగిరెళ్లిపోతుంది.  కన్నుమూసి తెరచేంతలోనే ఈ విన్యాసాలన్నీ..!  ఒక నీలి ఈకను మాత్రం ఓసారి బహుమతి చేసింది.

జిట్టంగి పక్షులు.– ఇళ్ల కప్పులెక్కి, ఈల వేస్తూ హెచ్చరిస్తూ సందడి చేస్తూంటాయి ఉదయాస్తమయాల వేళల్లో. సిల్వర్ బిల్ మునియాలు.  గుంపుగా వచ్చి,  తమ చిన్ని ముక్కులను నీటి లో తడుపుకొని, జలకాలాడుతూ తెగ సందడి చేస్తాయి. వెదురు ఆకులను ఒడుపుగా చీల్చి గూటికోసం తీసుకుని పోతూంటాయి.

అరగదీసినట్లు నునుపు దేలిన ముక్కు(bill), పొట్ట భాగం లో స్కేలింగ్ వుండి కాస్త బ్రౌన్గా ఉండే  ఈ పిచుకల్లాటి మునియాలు గార్డెన్ లో చెట్ల కొమ్మల్లో జంటలుగా వచ్చి వాలుతాయి. మన ఇళ్ల దగ్గర ప్రమాదస్థాయిలో బ్రీడింగ్ అవుతున్న మరో పక్షి పావురం. పావురాళ్లు గూడు పెట్టని చోటు లేదు. వాటి సంతతి పెరిగిపోతూనే ఉండటంతో, కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పావురాలకు ధాన్యపు గింజలను వేయడం వల్ల సహజమైన ఆహారవేటను ఆపేసాయంటారు. ఏదేమైనా చిన్న చిన్నపావురాల కువకువలు మాత్రం  బాగుంటాయి.

ఇక పోతే కాకులూ, పిచికలూ ఒకప్పుడు మనకి సర్వసాధారణంగా కనిపించే పక్షులు. మన సంస్కృతి లో భాగం.పిచికలకు ముంగిట్లో ధాన్యపు కంకులను వేలాడదీసేవారు. కాకులు సరేసరి. మన పితృదేవతలు కాకిరూపం లోవచ్చి పిండం ముట్టి పోతాయని నమ్మకం.కాని ఇవీ ఇపుడు అరుదైపోయాయిఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా సెల్ టవర్స్ నిర్మింవడం వల్ల, ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ కి,  దాదాపు ఊర పిచుకలు తుడిచి పెట్డుకుని పోయాయి. అలాగే కాకులు కూడా, పట్టణీకరణ పేరుతో వాటి ఆవాసాలనుంచి,వాటికి అనుకూలమైన చోట గూళ్లు ఏర్పరుచుకుని, సంతానోత్పత్తి చేయడానికి వీలు లేకుండా తరిమి వేయబడ్డాయి. పక్షులు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయి అన్నది ప్రత్యేకించి ఎవరికీ చెప్పనక్కరలేదు. క్రిమి కీటకాల బెడదనుంచి పంటలను కాపాడ్డం తో బాటు, పాలినేషన్‌కు విత్తనాల విస్తరణకు పక్షుల ఉనికిఅవసరమన్నది అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిమీద జరిపిన తిరుగుబాటు వల్ల కలిగిన దుష్పరిణామం ఏమిటో చైనా ఉదంతం ఒకటి చెబుతారు.

ఆహారధాన్యాలను పిచుకలు తింటున్నాయని, పిచుకలను పట్డి చంపిస్తారు చైర్మన్ మావో సమయంలో.  తర్వాత వాటి పొట్ట కోసి చూసి తెల్లబోయారట శాస్త్రజ్ణులు. ఆహారధాన్యాల కంటే ఎక్కువ క్రిమి కీటకాలను పట్టి తింటాయనితెలిసి. ఆ తరవాత క్రిమికీటకాల అదుపు లేక పంట నష్టం తీవ్రమై కరవు సంభవించిందిట.  మిడ‌త‌ల‌ను చంప‌డానికి క్రిమి కీటకాల నాశకాలను వాడగా, ఫలితంగా భూమిలోని సారం తగ్గిపోయిందిట.  ఇదొక గుణపాఠం.

అయినా...మనిషి మారలేదు; ఆతని కాంక్ష తీరలేదు–అని సినీకవి తీర్పు ఇచ్చినట్టు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.ప్రకృతిలో సమతౌల్యతకు పక్షుల ఉనికి ఎంత అవసరమన్నది మానవాళికి అర్థం అయేసరికి, ఆధునీకరణ పేరుతో చాలా నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. అందుచేత నేడు ఆవాసాల వద్ద ఎంతో కొంత గ్రీనరీ వుండేలా చూసుకోవడంసామాజిక బాధ్యత అయింది.

రచయిత : సునీత పోతూరి
ఫోటో : శ్యాం సుందర్‌

తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters

పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com

Advertisement
 
Advertisement
 
Advertisement