నెలరోజుల్లో అనూహ్యంగా పెరిగిన ధరలు
మేలో కిలో టమాటా రూ.16–28లు.. ప్రస్తుతం రూ.60–80
గత నెలలో కిలో ఉల్లి రూ.22–30.. ఇప్పుడు రూ.40–50లు
వంగ, బెండ, బీర తదితర కూరలు సైతం కిలో రూ.50పైనే
క్యారెట్ రూ.75, మిర్చి రూ.85, అల్లం, వెల్లుల్లి రూ.200 పైమాటే
గతేడాది ఇదే రోజులతో పోలిస్తే ఇప్పుడు భారీ వ్యత్యాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం నెలరోజుల వ్యవధిలోనే టమాటా మూడురెట్లు పెరగగా, మిగిలిన వాటి ధరలు 30–50 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం టమాటా కిలో రూ.65కు పైగా పలుకుతుండగా, మిర్చి ధర సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. అలాగే, అల్లం, వెల్లుల్లి డబుల్ సెంచరీ దాటాయి. ఇక అందరూ ఎక్కువగా వినియోగించే వంగ, బెండ, బీర వంటి సాధారణ కూరగాయల ధరలు సైతం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50కు పైగా పలుకుతుండడం ఆందోళన కల్గిస్తోంది. చివరికి ఆకుకూరల ధరలు సైతం అనూహ్యంగా పెరుగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, కర్నూలు వంటి నగరాల్లో బహిరంగ మార్కెట్‌లో ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి.
అనూహ్య పెరుగుదలపై వినియోగదారుల ఆందోళన..
నిజానికి.. ఎన్నికలకు ముందు కిలో రూ.16–28 మధ్య దొరికిన టమాటా ప్రస్తుతం రూ.60–80 మధ్య పలుకుతోంది. కిలో రూ.22–30 మధ్య దొరికిన ఉల్లి సైతం నేడు రూ.40–50 మధ్య పలుకుతోంది. మదనపల్లి మార్కెట్‌లో సోమవారం ఒకటో రకం పది కిలోల టమాటా కనిష్ట ధర రూ.690 ఉండగా గరిష్టం రూ.800లు పలికింది. రెండో రకం కనిష్టం రూ.500 కాగా, గరిష్టం రూ.680లు చొప్పున ధర పలికింది. వచ్చే నాలుగైదు రోజుల్లో కిలో టమాటా సెంచరీ దాటే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక విజయవాడ బహిరంగ మార్కెట్‌లో సోమవారం ధరలు ఎలా ఉన్నాయంటే.. టమాటా రూ.60–70, మిర్చి 70, బంగాళదుంప 40–50, ఉల్లి 50, వంగ 40, బెండ 40, బీర 60–70, కాకర 60–70, క్యారెట్ 60, క్యాబేజి 40, గోరుచిక్కుళ్లు 60, సొర 20, బీట్‌రూట్ 40, కీరదోస 60, బీన్స్ 160–180, క్యాప్సికం రూ.100 పలుకుతున్నాయి. కానీ, బహిరంగ మార్కెట్‌లో ఇలా ధరలు పెరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మరోవైపు.. గత ఏడాది ఇదే రోజుల్లో ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ ఈ నెలరోజుల వ్యవధిలో ఇలా అనూహ్యంగా పెరుగుతుండడంపట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment