UK Elections: చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమా? | Sakshi
Sakshi News home page

Rishi Sunak Party: చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమా?

Published Thu, Apr 4 2024 3:07 PM

Rishi Sunak Conservative Set For Worst Election Defeat Says Surveys - Sakshi

లండన్‌: కన్జర్వేటివ్‌ పార్టీ.. బ్రిటన్‌లో దాదాపు పదిహేన్లపాటు అధికారంలో కొనసాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా ఆ దేశ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి(ప్రధాని, మంత్రుల రాజీనామాలు.. తొలగింపులు), మరీ ముఖ్యంగా భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఇమేజ్‌ మరింత దిగజారిపోయిందని ఆ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 

వచ్చే ఏడాది ప్రారంభంలో యూకేలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో(తేదీలు ఖరారు కావాల్సి ఉంది) లేబర్‌ పార్టీ ప్రభంజనం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. కన్జర్వేటివ​ పార్టీ గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలీను నెరవేర్చకపోగా.. దేశాన్ని వరుస సంక్షోభాల్లోకి నెట్టేసిందన్న అభిప్రాయంలో ఉన్నారు అక్కడి ప్రజలు. పైగా కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సైతం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 

తాజాగా.. మార్చి 7వ తేదీ నుంచి 27 తేదీ మధ్య YouGov ఓ పబ్లిక్‌ సర్వే నిర్వహించింది. అందులో 18, 761 మంది పౌరులు పాల్గొన్నారు. వాళ్లలో మెజారిటీ పౌరులు.. లేబర్‌ పార్టీకే ఓటేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్‌లో.. అధికారం చేపట్టాలంటే 326 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే యూజీవోవీ సర్వేలో లేబర్‌ పార్టీకి 403 స్థానాలు, కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం 155 స్థానాలు దక్కించుకుంటాయని సదరు సర్వే తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇదే సంస్థ జరిపిన సర్వేలో కన్జర్వేటివ్‌ పార్టీకి 169 స్థానాలు రావొచ్చని అంచనా వేయగా.. తాజా సర్వేలో ఆ స్థానాలు మరింత తగ్గడం గమనార్హం. 

పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ పోలిటికో సైతం ఇలాంటి ట్రెండ్‌నే ప్రకటించింది. మార్చి 31వ తేదీన వెల్లడించిన సర్వేలో.. 44 శాతం లేబర్‌ పార్టీకి, 23 శాతం కన్జర్వేటివ్‌పార్టీకి సీట్లు దక్కవచ్చని వెల్లడించింది. 

భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ అక్టోబర్‌ 24, 2022లో బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ముందు పెను సవాళ్లు ఉండగా.. ఆయన వాటిని అధిగమిస్తానని స్పష్టం చేశారు. అయితే.. అప్పటి నుంచి బ్రిటన్‌ సంక్షోభం మరింత ముదిరింది. ఈ మధ్యలో ఆయన పైనా విమర్శలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి.  

ఇదిలా ఉంటే.. మే 2వ తేదీన యూకేలో మేయర్‌, లోకల్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని కన్జర్వేటివ్‌ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, కోర్టులు అందుకు అంగీకరించలేదు. ఇక ఈ ఎన్నికల్లోనూ కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమి తప్పదంటూ ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి.

Advertisement
Advertisement