రేపటి నుంచి జిల్లా స్థాయి పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జిల్లా స్థాయి పోస్టల్‌ బ్యాలెట్‌

Published Tue, May 7 2024 11:40 AM

రేపటి నుంచి జిల్లా స్థాయి  పోస్టల్‌ బ్యాలెట్‌

కాకినాడ సిటీ: ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి, కాకినాడ జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులకు మంగళ, బుధవారాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. ప్రతి ఉద్యోగీ పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ఓపీఓ, ఇతర శాఖల ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌కు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, ఓటింగ్‌కు హాజరైన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళ, బుధవారాల్లో జరిగే జిల్లా స్థాయి పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ నిర్వహణ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. పోలింగ్‌ ప్రక్రియలో ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా రెండు బృందాలుగా వెరిఫికేషన్‌, పోలింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఉద్యోగులు తమ నియోజకవర్గం, బ్యాలెట్‌ సీరియల్‌ నంబర్‌ వివరాలను కవర్లపై స్పష్టంగా రాయాలన్నారు. పోలింగ్‌ సిబ్బంది పర్యవేక్షణలోనే ఓటు వేసే ఉద్యోగులు సంతకం పెట్టించుకోవాలన్నారు. జిల్లాలో మూడు రోజులుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ సవ్యంగా సాగిందని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు చేపట్టిన ఏర్పాట్లను కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావు కలెక్టర్‌ నివాస్‌కు వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ డి.తిప్పేనాయక్‌, సీపీఓ పి.త్రినాథ్‌, జిల్లా పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి పి.శ్రీనివాసరావు, పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ బి.తిరుపాణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement