చార్మినార్ చిహ్నాన్ని తొలగించడమంటే హైదరాబాదీలను అవమానించడమే: కేటీఆర్
జాక్‌పాట్ సీఎం మూర్ఖపు ఆలోచనను వ్యతిరేకిస్తున్నాం
కేసీఆర్‌పై కక్షతోనే ప్రజా వ్యతిరేక పనులు
ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తే ఊరుకోం
చార్మినార్ వద్ద పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ నిరసన
గుల్జార్‌హౌస్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ
చార్మినార్ (హైదరాబాద్): తెలంగాణ రాజముద్ర లోని చారిత్రక చిహ్నాలను రాజకీయ కుట్రతోనే మార్చాలనుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జాక్‌పాట్ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను తొలగించాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం చార్మినార్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
అనంతరం గుల్జార్‌హౌజ్ నుంచి చార్మినార్ వరకు కాలినడకన వచ్చిన ఆయన చార్మినార్ వద్ద విలేకరులతో మాట్లాడారు. చేతనైతే గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి తప్ప.. కేసీఆర్‌పై కక్షతో ఆయన చేసిన అభివృద్ధిని కాలరాయొద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
చారిత్రక గుర్తింపును విస్మరించారు..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉన్న వారసత్వ కట్టడాల చిహ్నాలను రాజ ముద్ర నుంచి తొలగించాలని చూడటం తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని కేటీ ఆర్ చెప్పారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ కట్టడాలకు చారిత్రక గుర్తింపు ఉందన్న విషయా లను సీఎం రేవంత్‌రెడ్డి విస్మరించడం దురదృష్టకరమ న్నారు. లేని వాటిని చేర్చితే మంచిదే గానీ.. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన చిహ్నాలను ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు.
చార్మినార్ చిహ్నాన్ని తొలగించడమంటే ప్రతి హైదరాబాదీని అవమానించినట్లేనన్నారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. వీరందరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మారావు, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రులు రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య, చార్మినార్ బీఆర్‌ఎస్ ఇంచార్జి మహ్మద్ సలావుద్దీన్ లోధీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment