75 కేజీల బస్తా ధర రూ.200
తమిళనాడులో తీరంలో భారీ వర్షాల ప్రభావమే కారణం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు
సింగరాయకొండ: వాతావరణం అనుకూలించడం, ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఉప్పు రైతుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తమిళనాడులోని ఉప్పు పండించే ట్యుటికోరన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఉప్పు తయారీ నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పండించే ఉప్పుకు గిరాకీ ఏర్పడింది.
ఆ ఏడాది ఫిబ్రవరిలో ఉప్పు తయారీ ప్రారంభం కాగా.. నిన్న మొన్నటివరకు 75 కేజీల బస్తా ఉప్పు ధర రూ.100 నుంచి రూ.150 పలికింది. తమిళనాడు నుంచి భారీఎత్తున వ్యాపారులు ఇక్కడికి వచ్చి ఉప్పు కొనుగోలు చేస్తుండటంతో బస్తా రూ.200 ధర పలుకుతోంది.
9 నెలలూ ఉప్పు సాగే
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల పరిధిలోని సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు. వర్షాకాలం తప్ప మిగిలిన కాలాల్లో సుమారు 9 నెలలపాటు ఉప్పు సాగు చేస్తారు. ఎకరాకు 800 నుంచి 900 బస్తాల వరకు ఉప్పు దిగుబడి వస్తోంది.
ఈ ఏడాది వాతావరణం బాగా అనుకూలించడంతో 1,300 నుంచి 1,400 బస్తాల వరకు దిగబడి వస్తోంది. ప్రతినెలా ఇక్కడ 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. తయారీ బాగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 7 వేల మంది వరకు రైతులు, 10 వేలకు పైగా కూలీలు లబ్ధి పొందుతున్నారు.
ధరలు బాగున్నాయి
10 ఎకరాలను కౌలుకు తీసుకుని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ధరలు పెరుగుతుండటంతో ఉప్పు నిల్వ చేశాను. తమిళనాడు వ్యాపారులు నేరుగా వచ్చి నన్ను కలవటంతో మంచి ధర లభించింది. – పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం
దిగుబడి బాగా వచ్చింది
ఐదెకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నాను. ఏడాది ప్రారంభంలో ధరలు తక్కువగా ఉన్నా దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు వ్యాపారుల రాకతో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా ఉప్పు కొనుగోలు చేస్తే రైతుకు మంచి ధరలు లభిస్తాయి. – గౌరవరపు శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం
Comments
Please login to add a commentAdd a comment